త్రీచక్ర వాహనాలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు,
బ్యాటరీ వీల్ చైర్స్ అందజేస్తున్న ప్రభుత్వం
కిరాణా దుకాణాలు, టీ స్టాల్స్ వంటి
వ్యాపారాలకూ రుణాల మంజూరు
అర్హులైన ప్రతి దివ్యాంగుడికీ అండగా నిలుస్తున్న రాష్ట్ర సర్కార్
రూ.3016 పింఛన్ అందిస్తుండడంతో వారిలో పెరిగిన మనోధైర్యం
పరికరాలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నవారు ఎంపిక
వికారాబాద్, ఫిబ్రవరి 18 : దివ్యాంగులము ఏమి చేయలేమనే నిరుత్సాహ పడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న వారికి ప్రభుత్వం చేయుతనందిస్తున్నది. ప్రభుత్వం దివ్యాంగులకు ప్రత్యేక గుర్తింపును అందిస్తున్నది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అవసరం మేరకు యంత్రాలు, యంత్ర పరికరాలు, వాహనాలు, పింఛన్లు, రుణాలు సమకూరుస్తున్నది. వినికిడి యంత్రాలు, ట్రైసైకిళ్లు, వీల్‌చైర్స్ తదితర పరికరాలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్నది. అర్హులైన దివ్యాంగులకు ప్రతి నెలా రూ.3016లు పింఛన్ ఇస్తూ భరోసాను కల్పిస్తున్నది. దివ్యాంగులు గ్రూపులు మారి డీఆర్డీఏ ద్వారా రుణ సదుపాయాలు పొందుతున్నారు. కిరాణ షాపులు, టీ స్టాల్స్, ఆసక్తి ఉన్న పనుల్లో ఉపాధి పొందేలా అవకాశాలు కల్పిస్తున్నారు. రుణాలతో స్వయం ఉపాధి పొందుతూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఉన్నత చదువులు చదివిన దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేందుకు అవకాశాలు (కేటగిరి) ఉన్నాయి. బస్సు, రైళ్లలో కూడా ప్రత్యేక రాయితీలు కల్పించడంతో సంతోషాన్ని వ్యక్తి చేస్తున్నారు. దివ్యాంగులను సకలాంగులు పెళ్లి చేసుకుంటే వారికి రూ.లక్ష రూపాయలు ప్రోత్సాహకం ప్రభుత్వం ఇస్తున్నది.
ఈ సంవత్సరం ముందడుగు…
జిల్లాలో దివ్యాంగులకు ఉచితంగా వినికిడి యంత్రాలు, ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు అందించడంతో పాటు ఈ సారి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వికారాబాద్ జిల్లాలో త్రిచక్ర వాహనాలు 21, డిగ్రీ, పీజీలు చేసిన దివ్యాంగులకు ల్యాప్‌టాప్‌లు 7, నడవలేని వారికి బ్యాటరీ వీల్చైర్లు 4, చదువుకునే వారికి 2 స్మార్ట్ఫోన్లను ఇటీవల అందించింది. వికారాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులకు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆనంద్ అందజేశారు. పరిగి నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పంపిణీ చేశారు. తాండూరు నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అందజేశారు.