ఎంపికైన లబ్ధిదారులు నచ్చినచోట యూనిట్లను నెలకొల్పుకోవచ్చు
మార్చి 10 కల్లా యూనిట్ల గ్రౌండింగ్ పనులు పూర్తి చేయాలి
రంగారెడ్డి జిల్లాలో 698 మంది ఎంపిక, నిధులు మంజూరు
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
మహేశ్వరం మండల పరిషత్తు కాన్ఫరెన్స్ హాల్లో దళితబంధు అవగాహన సదస్సు
జల్పల్లి గ్రామంలో పారిశుధ్య కార్మికులతో కలిసి భోజనం చేసిన మంత్రి, ఎంపీ రంజిత్‌రెడ్డి
పారిశుధ్య కార్మికుల సేవలు అమోఘమని ప్రశంస
షాబాద్, ఫిబ్రవరి 23 :‘దళితబంధు అమలులో రంగారెడ్డి జిల్లా ఆదర్శంగా నిలువాలి.. ఇప్పటికే రాష్ట్ర సర్కార్ నిధులు మంజూరు చేసింది.. ఎంపికైన లబ్ధిదారులు నచ్చినచోట నచ్చిన యూనిట్లను నెలకొల్పుకోవచ్చు..’ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచించారు. బుధవారం మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం మండల పరిషత్తు కాన్ఫరెన్స్ హాల్లో దళితబంధు లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మార్చి 10వ తేదీకల్లా యూనిట్ల గ్రౌండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 698 మంది ఎంపికయ్యారని, వీరంతా వ్యాపార, వాణిజ్య రంగాల్లో రాణించిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అనంతరం జల్పల్లి గ్రామంలో పారిశుధ్య కార్మికులకు శానిటేషన్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి,
ఎంపీ రంజిత్‌రెడ్డి పారిశుధ్య కార్మికులతో కలిసి భోజనం చేశారు.
దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతూ, సామాజిక అసమానతలను రూపుమాపడానికి దళిత బంధు పథకం దోహదం చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డిజిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో మొదటి విడుతలో ఎంపికైన 100 మంది లబ్ధిదారులతో బుధవారం మహేశ్వరం మండల పరిషత్తు కాన్ఫరెన్స్ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఎంపీ రంజిత్‌రెడ్డితో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గంలో మొదటి విడుతలో పైలట్ ప్రాజెక్టుగా 100మందికి ఈ పథకం కింద లబ్ధి చేకూరుస్తున్నట్లు, అనంతరం దశలవారీగా దళితులందరికీ అమలు చేస్తామన్నారు. రంగారెడ్డిజిల్లాలో 698 మందికి రూ.69.8కోట్లు దళిత బంధు కింద నిధులు మంజూరయ్యాయన్నారు. మంచి యూనిట్లు నెలకొల్పి సక్సెస్ కావాలని సూచించారు. తక్కువ పెట్టుబడితో నేడు విశేషంగా రాణిస్తున్న ఎంపీ రంజిత్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. మార్చి 10 వరకు అన్ని యూనిట్లను గ్రౌండ్ చేయాలన్నారు. బడ్టెట్ తర్వాత 2వేల మందికి నియోజకవర్గాలవారీగా దళితబంధు పథకం ద్వారా లబ్ధి చేకూర్చనున్నట్లు తెలిపారు. గతంలో కన్నా ఈ పథకంలో కొన్ని మార్పులు చేసినట్లు, ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చని, కుటుంబంలో సభ్యులు విడివిడిగా రెండు మూడు వ్యాపారాలు చేయవచ్చన్నారు. గ్రామస్థాయిలో ఒక అధికారికి ప్రత్యేక బాధ్యతలు ఇవ్వాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, జడ్పీటీసీ జంగారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
పారిశుధ్య కార్మికుల సేవలు ఎంతో గొప్పవి
స్వచ్ఛ జల్పల్లి కోసం నిరంతరం శ్రమించే పారిశుధ్య కార్మికుల సేవలు ఎంతో గొప్పవని మంత్రి సబితారెడ్డి కొనియాడారు. బుధవారం చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డితో కలిసి జల్పల్లి పారిశుధ్య సిబ్బందికి పలు రకాల వస్తువులతో కూడిన శానిటేషన్ కిట్లను అందించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. కార్మికులకు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా కాలంలో అందరూ ఇంటికే పరిమితమైన ప్రజల కోసం బయటకి వచ్చి సేవలు అందించింది పారిశుధ్య కార్మికులు మాత్రమే అని చెప్పారు. ప్రభుత్వం వీరికి అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సాధి, వైస్ చైర్మన్ ఫర్హానాజ్, కమిషనర్ కుమార్ ఉన్నారు.