పరిగి, నవంబర్ 5 : సర్కారు దవాఖానల బలోపేతం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మాతాశిశు మరణాల సంఖ్య తగ్గడానికి మరోవైపు సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్ కిట్ ప్రధాన పాత్ర పోషిస్తున్నది. ప్రసవాలకు వచ్చే గర్భిణులకు సరైన వైద్య సదుపాయం అందేలా చూడడంతోపాటు ఏదైనా సమస్యతో జన్మించే శిశువుల ఆరోగ్య పరిరక్షణకు నడుం బిగించింది. తద్వారా సర్కారు దవాఖానల్లో మూడేండ్ల నుంచి ప్రసవాలు పెరుగుతున్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరులోని జిల్లా దవాఖాన వరుసగా రెండు నెలలు ప్రసవాల్లో రాష్ట్ర స్థాయిలోనే రెండో స్థానంలో నిలవడం గమనార్హం. ఇందులో సగానికి పైగానే సాధారణ ప్రసవాలు కావడం వైద్యులు అందిస్తున్న సేవలకు నిదర్శనం. తాండూరులోని జిల్లా దవాఖానలో అక్టోబర్‌లో 782 ప్రసవాలు జరిగాయి. అందులో 413 సాధారణ ప్రసవాలు అయ్యాయి. దీంతో ప్రసవాల్లో తాండూరులోని జిల్లా దవాఖాన రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచింది. సెప్టెంబర్, అక్టోబర్ రెండు నెలలు ఈ రికార్డును నెలకొల్పడం గమనార్హం.
పది నెలల్లో 5,103 ప్రసవాలు..
వికారాబాద్ జిల్లాలోని తాండూరు జిల్లా దవాఖానలో 2021 జనవరి నుంచి పది నెలల సమయంలోనే రికార్డు స్థాయిలో 5,103 ప్రసవాలు జరిగాయి. ఇందులో 2,551 సాధారణ ప్రసవాలుగా నమోదు అయ్యాయి. నెలల వారీగా పరిశీలిస్తే జనవరిలో 371 ప్రసవాలు జరుగగా, 174 సాధారణ ప్రసవాలు, 197 సిజేరియన్, ఫిబ్రవరిలో 353 ప్రసవాలు జరుగగా 172 సాధారణ, 181 సిజేరియన్, మార్చిలో 438 ప్రసవాలు జరుగగా 204 సాధారణ, 234 సిజేరియన్, ఏప్రిల్‌లో 384 ప్రసవాలు జరుగగా 203 సాధారణ, 181 సిజేరియన్, మే నెలలో 405 ప్రసవాలు జరుగగా 198 సాధారణ, 207 సిజేరియన్, జూన్‌లో 509 ప్రసవాలు జరుగగా 240 సాధారణ, 269 సిజేరియన్, జూలైలో 546 ప్రసవాలు జరుగగా 243 సాధారణ, 303 సిజేరియన్, ఆగస్టులో 629 ప్రసవాలు జరుగగా 330 సాధారణ, 299 సిజేరియన్, సెప్టెంబర్‌లో 686 ప్రసవాలు జరుగగా 374 సాధారణ, 312 సిజేరియన్, అక్టోబర్ నెలలో 782 ప్రసవాలు జరుగగా 413 సాధారణ, 369 సిజేరియన్ జరిగాయి. తద్వారా వరుసగా సెప్టెంబర్, అక్టోబర్ రెండు నెలల్లోనూ దవాఖానలో ప్రసవాల్లో తాండూరులోని జిల్లా దవాఖానలో రెండో స్థానంలో నిలిచింది. దవాఖానలో జరిగిన ప్రసవాల్లో 50శాతం సాధారణ ప్రసవాలు జరుగడం గమనార్హం.
సర్కారు చర్యలతోనే పెరిగిన ప్రసవాల సంఖ్య..
సర్కారు దవాఖానల్లో అవసరమైన సదుపాయాలు కల్పించడంతోపాటు ప్రసవాలు జరిగేలా అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నది. 2017 జూన్ రెండో తేదీన ప్రభుత్వం కేసీఆర్ కిట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తాండూరు జిల్లా దవాఖానలో 2021 నవంబర్ 3వ తేదీ వరకు 17,185 మందికి కేసీఆర్ కిట్లు అందించింది. ఇందులో భాగంగా సర్కారు దవాఖానలో ప్రసవాలు జరిగి ఆడ శిశువు జన్మిస్తే రూ.13వేలు, మగ శిశువు జన్మిస్తే రూ.12వేలు అందజేయడంతోపాటు కేసీఆర్ కిట్‌ను అందజేస్తున్నది. గర్భిణులు ఏఎన్సీ చెకప్‌ల కోసం సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అమ్మ ఒడి ప్రత్యేక వాహనాల్లో తీసుకురావడంతోపాటు వైద్య పరీక్షల అనంతరం వారిని ఇంటి దగ్గర వదిలి పెట్టేలా చర్యలు చేపట్టింది. ఈ పథకం అమలు చేయకముందు ప్రసవాల కోసం ప్రైవేటు దవాఖానలకు వెళ్తే వేలాది రూపాయలు గుంజేవారు. అవసరం లేకున్నా సిజేరియన్ చేసి సాధారణ ప్రసవం కంటే రెట్టింపు డబ్బులు వసూలు చేసేవారు. కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. పేదలు, మధ్య తరగతి వారందరూ ప్రసవం కోసం సర్కారు దవాఖానలకు వెళ్తున్నారు. తద్వారా జిల్లాలోని సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది.
పెరిగిన ప్రసవాలు
ప్రధానంగా కేసీఆర్ కిట్, ఆడ శిశువు జన్మిస్తే రూ.13వేలు, మగ శిశువు జన్మిస్తే రూ.12వేలు అందజేయడం వల్ల సర్కారు దవాఖానల్లో ప్రసవాలు పెరుగడం జరిగింది. దవాఖానల్లో ప్రభుత్వం అవసరమైన మేరకు సదుపాయాలు కల్పించడంతోపాటు మెరుగైన వైద్యసేవలతో ప్రసవాలు పెరిగాయి. గర్భిణులకు ఏఎన్సీ చెకప్‌లకు అమ్మ ఒడి వాహనాల్లో సమీపంలోని దవాఖానకు తీసుకువచ్చి, వైద్య పరీక్షల తర్వాత ఇంటి దగ్గరకు చేరవేస్తున్నారు. ప్రసవం జరిగిన తర్వాత కేసీఆర్ కిట్ అందజేస్తున్నాం. దవాఖానలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది కృషితో తాండూరులోని దవాఖాన ప్రసవాల్లో సెప్టెంబర్, అక్టోబర్ రెండు నెలలు వరుసగా రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచింది.