వీకెండ్ వచ్చిందంటే లాంగ్ డ్రైవ్‌లు, జలపాతాల వీక్షణకు యువకుల పయనం
మితిమీరిన వాహనాల వేగం, సెల్ఫీలతో ప్రమాదాలు
హయత్‌నగర్ రూరల్, ఫిబ్రవరి 20: వీకెండ్ వచ్చిందంటే చాలు కొంతమంది యువకులు స్నేహితులతో కలిసి బైకులపై షికార్లకు వెళ్తుంటారు. నీళ్లు కనిపిస్తే చాలు అవి ..జలపాతాలైనా.. చెక్డ్యాంలైనా..చెరువులైనా దూకేస్తున్నారు.. వందకు మించిన వేగంతో పోటాపోటీగా బైకులపై రయ్య్‌మ్రంటూ దూసుకుపోతున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యంతో చివరకు ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. కుటుంబసభ్యులకు కన్నీరు మిగిలిస్తున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని గండిచెరువు చెక్‌డ్యాం వద్దకు వారాంతా ల్లో సరదాగా గడిపేందుకు వచ్చిన స్నేహితుల్లో ఇద్దరు అక్కడే గల్లంతయ్యారు. ఒకరు అదేరోజు, మరొకరు రెండు రోజులకు శవమై తేలారు. గత నెలలోనూ ఓ యువకుడు ఇలాగే నీటిలోనే ప్రాణాలు వదిలాడు..
నీటి అందాల చెంత..
వర్షాలు సమృద్ధిగా కురవడంతో జలపాతాలతోపాటు నగర శివారులోని చాలా వరకు చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. కొన్ని చెక్‌డ్యాంలు జలపాతాలనే మరిపిస్తున్నాయి. వీటి అందాలను చూసేందుకు చాలామంది యువతీయువకులు పోటీ పడుతున్నారు. సెలవు దొరికితే చాలు.. రయ్మం టూ అక్కడ వాలిపోతున్నారు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ కొందరి అత్యుత్సాహం చివరకు ప్రాణాలపైకి వస్తున్నది. కొందరు ఈత వచ్చి నీటిలో దిగుతుండగా.. వారిని చూసి ఈత రానివారు సైతం నీటిలోకి దిగేస్తున్నారు. లోతును అంచనా వేయకుండా ప్రమాదంలో పడుతున్నారు. ఎటి ్టపరిస్థితుల్లోనూ ఈతరాని వారు నీటిలోకి దిగొద్దని, ఈత వచ్చిన వారు కూడా ప్రవహిస్తున్న నీటిలోకి దిగకపోవడమే ఉత్తమమని గజ ఈతగాళ్లు పేర్కొంటున్నా రు. చాలాచోట్ల చెరువులు, బావుల వద్ద రాళ్లు, బండలు నాచుపట్టి జారుతుంటాయని, వాటిని గమనించకపోతే జారి గాయాల పాలవుతామని హెచ్చరిస్తున్నారు. పలు గ్రామాల్లోని చెరువుల వద్ద ఇప్పటికే రక్షణ కంచెలను ఏర్పాటుచేశారు.
బైకులపై వేగంగా..
వారాంతం అనే సంతోషంలో స్నేహితులతో కలిసి చాలామంది యువకులు బైకులపై లాంగ్‌డ్రైవ్‌లకు బయలుదేరుతున్నారు. రేసింగ్‌ల మాదిరి పోటీ పెట్టుకుంటున్నారు. రోడ్లు ఖాళీగా కనిపించడమే ఆలస్యం వంద దాటేస్తున్నారు. నగర శివారులో ట్రాఫిక్ సమస్య లేకపోవడం, రోడ్లు ఖాళీగా, వెడల్పుగా ఉం డటంతో ఎక్కడా తగ్గడం లేదు. చివరకు మలుపులు తెలియక, జాతీయ రహదారులపై ఇతర వాహనాల వేగాన్ని అంచనా వేయక ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నారు. అతివేగం కారణంగానే సగం ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. చాలా చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాల వేగాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొంటున్నారు.
సెల్ఫీలతో జాగ్రత్త..
కార్యక్రమం ఏదైనా.. వెళ్లేది ఎక్కడికైనా చేతిలో సెల్‌ఫోన్ ఉండటం ప్రస్తుతం తప్పనిసరిగా మారింది. ప్రతిచోటా సెల్ఫీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అసందర్భమైనా.. ప్రమాదం అని తెలిసినా సెల్ఫీల మోజులో ప్రమాదాల బారినపడుతున్నారు. ఈ నెలలో అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని ఓ చెరువు వద్ద సెల్ఫీలు దిగుతూనే ఇద్దరు నీట మునిగి ప్రాణాలు వదిలారు. విజయవాడ జాతీయ రహదారిపై మరోచోట బైకుపై సెల్ఫీ దిగే ప్ర యత్నంలో కిందపడి గాయపడ్డారు. బైకు పై, నీళ్లు, కొండలు, ఇతర ప్రమాదకర మైన ప్రాంతాల్లో ఫొటోలకు పోజుల మో జులో పడొద్దని పోలీసులు సూచి స్తున్నారు.
రక్షణ చర్యలు తీసుకుంటున్నాం
వీకెండ్లో నగరం నుంచి శివారు ప్రాంతాలకు ఎక్కువ మంది యువకులు వస్తున్నారు. చెరువులు, చెక్‌డ్యాంల వద్ద వారు సందడి చేస్తున్నారు. రద్దీకి అనుగుణంగా చాలాచోట్ల రక్షణ చర్యలు తీసుకుంటు న్నాం. మండలంలోని సర్పంచ్‌లతోనూ దీనిపై చర్చిం చాం. నీటితో కళకళలాడే చెరువుల్లోకి దిగకుండా పలుచోట్ల ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. తారామతిపేట, బండరావిరాల తదితర గ్రామాల్లోని చెరువుల వద్ద రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. గండిచెరువు చెక్‌డ్యాం వద్ద నీటి అందాలు ఆకట్టుకుంటున్నాయి. దీంతో వారాంతాల్లో ఎక్కువమంది అక్కడికి వస్తుండటంతో పికెటింగ్ సైతం ఏర్పాటు చేస్తున్నాం. ఇతర రక్షణ చర్యల కోసం స్థానిక ప్రజాప్రతినిధులతోనూ మాట్లాడటం జరిగింది. యువకులు వాహనాలపై అధిక వేగంతో ప్రయాణించొద్దు.. కొత్త రహదారుల్లో వెళ్లేటప్పుడు జాగ్రత్తగా, అప్రమత్తంగా వెళ్లాలి. స్వామి, అబ్దుల్లాపూర్‌మెట్ సీఐ