శంకర్పల్లి, ఫిబ్రవరి 21 : రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాములో శనగల కొనుగోలు కేంద్రాన్ని డీసీఎంఎస్ జిల్లా చైర్మన్ కృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం క్వింటాలు శనగలకు రూ.5,230 మద్దతు ధర ప్రకటించిందని చెప్పారు. రైతులు తాము పండించిన శనగలను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి లాభాలు పొందాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ పీ గోవర్ధన్‌రెడ్డి, శంకర్పల్లి ఏఎంసీ, పీఏసీఎస్ చైర్మన్లు ఎం.బుచ్చిరెడ్డి, శశిధర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి, బిజినెస్ మేనేజర్ పాండురంగం, బ్రాంచ్ మేనేజర్ రామకృష్ణరాజు, మండల వ్యవసాయాధికారి సురేశ్‌బాబు, మార్కెట్ సెక్రటరీ పద్మజ, జనవాడ ఎంపీటీసీ నాగేందర్ పాల్గొన్నారు.
ఆలయ అభివృద్ధికి కృషి
చేవెళ్లటౌన్ : లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తాననిఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. వేంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి కోసం ఎమ్మెల్యే కాలె యాదయ్య, టీఆర్ఎస్ పార్టీ నాయకులు చింటు, కృష్ణారెడ్డి, శంకర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆకారపు మహేశ్ చారితో కలిసి రూ. 5 లక్షలు విరాళంగా అందజేశారు. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదన్నారు. రెండో తిరుపతిగా పేరుగాంచిన చేవెళ్ల వేంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు తీసుకువస్తానని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా జరిగే జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాణిక్యరెడ్డి, కృష్ణ కాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.