ఇక ఆన్లైన్లో ప్రజారోగ్య వివరాల నమోదు
పేదలకు మరింత చేరువలో వైద్య సాయం
వికారాబాద్ జిల్లాలో 713 మంది ఆశ వర్కర్లు
త్వరలో పంపిణీకి సిద్ధంగా స్మార్ట్ ఫోన్లు
పరిగి, ఫిబ్రవరి 21 : ప్రజారోగ్యమే పరమావధిగా రాష్ట్ర సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో కార్పొరేట్‌కు దీటుగా సర్కారు దవాఖానలనూ ఆధునీకరించింది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆశవర్కర్లు సేకరించిన ఆరోగ్య వివరాలను ఉన్నతాధికారులు తెలుసుకోవాలంటే రోజుల వ్యవధి పడుతున్నది. ఈ సమస్యను అధిగమించి వైద్య సాయాన్ని పేదలకు చేరువ చేసేలా ఆన్లైన్లో ఆరోగ్య వివరాలను నమోదు చేయాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. వికారాబాద్ జిల్లాలోని 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 713 మంది ఆశ వర్కర్లు పని చేస్తుండగా, త్వరలో వీరందరికీ స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయనున్నారు. ఇక మీదట ఒక్క క్లిక్‌తో ప్రజల ఆరోగ్య వివరాలు ఆన్లైన్లో నమోదు కానున్నాయి.
శాస్త్ర, సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతున్నకొద్దీ పనిభారం తగ్గుతుంది. ఇప్పటికే అన్ని శాఖల్లో డిజిటల్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ సైతం డిజిటల్ విధానంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. గ్రామస్థాయిలో ప్రతి చిన్న సర్వే మొదలుకొని, అనేక అంశాలపై పనిచేస్తున్న ఆశా వర్కర్లకు స్మార్ట్ఫోన్లు అందజేయడం ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం ప్రధాన కార్యాలయానికి చేరవేయడానికి ఉపయుక్తంగా ఉండనుంది. దీంతోపాటు ఏ గ్రామానికి సంబంధించిన సమాచారం కావాలన్నా ఒక్క క్లిక్‌తో లభిస్తుంది. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 713 మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు. వారందరికీ అందజేసేందుకు స్మార్ట్ ఫోన్లు జిల్లాకు వచ్చాయి. వాటిని ఇప్పటికే కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సైతం పంపిణీ చేశారు. ఒకటి రెండు రోజుల్లో ఆశా వర్కర్లకు స్మార్ట్ఫోన్లు అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.
జిల్లాకు చేరుకున్న స్మార్ట్ఫోన్లు
ఆశా వర్కర్లకు అందజేసేందుకు వికారాబాద్‌లోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయానికి స్మార్ట్ఫోన్లను తరలించారు. జిల్లాలో పనిచేస్తున్న 713 మంది ఆశా వర్కర్లకు అందజేయడానికి ఈ స్మార్ట్ఫోన్లు తెప్పించగా, వాటిలో కొన్నింటిని ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. ఒకటి రెండు రోజుల్లోవాటిని పంపిణీ చేసేలా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఆశా వర్కర్లకు స్మార్ట్ఫోన్లు పంపిణీ చేయనున్నారు.
ప్రతి సమాచారం ఆన్లైన్లో…
గ్రామాల్లో పనిచేసే ఆశా వర్కర్లు ప్రతి సమాచారాన్ని ఆన్లైన్లో ఫీడ్ చేసేందుకు వీలుగా స్మార్ట్ఫోన్లను ప్రభుత్వం అందజేస్తున్నది. వికారాబాద్ జిల్లాలోని 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 713 మంది ఆశా వర్కర్లు ప్రస్తుతం పనిచేస్తున్నారు. వెయ్యి మంది జనాభాకు ఒకరు చొప్పున ఉన్నారు. వెయ్యి మంది జనాభాలో సుమారు 300లకు పైగా కుటుంబాలు ఉంటాయి. ప్రతి కుటుంబంలో ఎంతమంది కిశోర బాలికలు ఉన్నారు, గర్భిణులు, బాలింతల సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి ప్రతి నెల నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ప్రసవం తర్వాత తల్లి, శిశువుల ఆరోగ్య పరిస్థితికి సంబంధించి సమాచారం చేరవేస్తారు. చిన్నపిల్లలకు టీకాలు వేసే కార్యక్రమానికి సంబంధించిన సమాచారం ఆయా గ్రామాలవారీగా అందజేస్తారు. శిశువుల్లో ఏమైనా అనారోగ్య సమస్యలుంటే వారిని తాండూరు మాతా శిశు సంరక్షణ కేంద్రానికి తరలించేందుకు ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తారు. ఇవేకాకుండా అసంక్రమిత వ్యాధులు బీపీ, షుగర్, గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి వాటితో బాధపడుతున్నవారు ఎంతమంది ఉన్నారు, వారికి ఏ మందులు అందజేయాలి తదితర వివరాలను సైతం ప్రతి నెల ఆశా వర్కర్లు తెలియజేస్తారు.
ఇప్పటివరకు ఈ వివరాలన్నీ ప్రత్యేకంగా ఏర్పాటుచేసే రిజిస్టర్లో నమోదు చేసేవారు. ఆశా వర్కర్లందరికీ స్మార్ట్ఫోన్లు అందజేస్తుండడంతో ఇకమీదట ఈ సమాచారమంతా ఆన్లైన్లో ఎప్పటికప్పుడు ఫీడ్ చేస్తారు. తద్వారా ఆశా వర్కర్లు ప్రతి రోజూ ఎన్ని కుటుంబాలను సందర్శించారు, ఏ సమాచారం తెలుసుకున్నారనేది ఉన్నతాధికారులకు సైతం తెలుస్తుంది. ఏ గ్రామంలో ఎంతమంది కిశోర బాలికలు, గర్భిణులు, బాలింతలు, అసంక్రమిత వ్యాధులతో బాధపడుతున్నవారు ఉన్నారు అనే సమాచారం సైతం ఒక్క క్లిక్‌తో ఉన్నతాధికారులు తెలుసుకోగలుగుతారు. వైద్య, ఆరోగ్య శాఖలో ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగివుండి.. వారి ఆరోగ్య వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఇప్పటికే పారితోషికం సైతం పెంచారు. వారి పనిభారం తగ్గించేందుకు ప్రస్తుతం స్మార్ట్ఫోన్లు అందజేస్తున్నారు.