ఇబ్రహీంపట్నం/ఆదిబట్ల ఫిబ్రవరి 21 : జిల్లాలోని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఆదాయ వనరులు సమకూర్చటంతో పాటు మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల మున్సిపాలిటీల బడ్జెట్ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటి వరకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని అన్నారు. ఇప్పటికే అనేక మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో పెద్ద ఎత్తున ఆదాయ పన్ను బకాయిలు ఉన్నాయని, వాటిని వసూలు చేయటంపై అధికారులు దృష్టి సారించాలన్నారు. పన్నుల నిర్ణయంపై అంచనాలను మరోసారి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా పలు విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు జిల్లాలో పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ ఆదాయం మాత్రం ఆశించిన మేరకు రావటంలేదన్నారు. సంస్థలు పెద్ద ఎత్తున ఆదాయాన్ని గడిస్తున్నప్పటికీ పన్నుల చెల్లింపునకు ముందుకు రావటం లేదన్నారు. గతంలో పన్నుల అంచనాలను నిర్దేశించాలని, ఈ అంచనాలను సవరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆదాయం ఇచ్చే అనేక సంస్థలు ఉన్నప్పటికీ వాటి ద్వారా ఆదాయం సమకూర్చటానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావటం లేదన్నారు. నిషేధిత ప్రాంతా ల్లో, అనుమతిలేని భవనాలు నిర్మిస్తే కచ్చితంగా కూల్చివేతలుంటాయని చెప్పారు. స్పెషల్‌డ్రైవ్ నిర్వహించాలన్నా రు. జీతాలు, కరెంటు బిల్లులు, హరితహారం వంటి ఖర్చు లు పోనూ మిగిలిన నిధులతో అభివృద్ధి చేయాలన్నారు.
చిన్నచెరువును పరిశీలించిన అదనపు కలెక్టర్
ఇబ్రహీంపట్నం చిన్న చెరువును అభివృద్ధి చేయటంతో పాటు వాకింగ్ పార్కును ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరువ తీసుకున్నారు. ఇటీవల కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పనులు నిలిచిపోయాయి. జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్ చిన్నచెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆయనతో పాటు ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కూడా పాల్గొన్నారు. చిన్నచెరువును సుందరీకరించి పార్కుగా మార్చటానికి ఏర్పాటు చేసిన డిజైన్‌లో స్వల్ప మార్పులు చేసి ఈ చెరువును అభివృద్ధి చేయాలని మున్సిపల్ పాలకవర్గాన్ని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, కమిషనర్ మహ్మద్ యూసఫ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
వెనుబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం
హయత్‌నగర్ రూరల్: పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశం సోమవారం చైర్పర్సన్ చెవుల స్వప్న అధ్యక్షతన తట్టిఅన్నారంలోని పురపాలక కార్యాలయంలో జరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మున్సిపాలిటీ సాధారణ ఆదాయం రూ.22.96 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. నిధులను మున్సిపాలిటీలో విలీనమైన ప్రాంతాలు, వెనుకబడ్డ ప్రాంతాలు తదితర చోట్ల మౌలిక వసతులు, ఇతర అభివృద్ధి పనులకు వినియోగించనున్నట్టు చైర్పర్సన్ పేర్కొన్నారు. అనంతరం 2022-23 బడ్జెట్ అంచనాలతో పాటు 2021-22 సవరణ బడ్జెట్ అంచనాలకు పాలకవర్గం ఆమోదించింది. సమావేశంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్, మున్సిపల్ వైస్‌చైర్మన్ సంపూర్ణారెడ్డి, కమిషనర్ అమరేందర్‌రెడ్డి, మేనేజర్ కిరణ్, డీఈ అశోక్‌కుమార్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.