ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
191 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేత
యాచారం, ఫిబ్రవరి 23 : ఆడపిల్లల పెండ్లికోసం తల్లిదండ్రులు అప్పులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం కింద చేస్తున్న ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సాయి శరణం ఫంక్షన్హాల్లో 191 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున మొత్తం రూ.1,91,22,156ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను బుధవారం ఆయన ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన అనంతరం రాష్ట్రంలో బాల్య వివాహాలు తగ్గిపోయాయన్నారు. ఆడపిల్లల వివాహానికి ఆర్థిక సాయం అందించేందుకు మొదట్లో రూ.51 వేలు ఇచ్చిన ప్రభుత్వం దానిని రూ. 75,116కు పెంచిందని, ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుకూలంగా రూ.1,00,116లు అందజేస్తున్నదన్నారు. ఈ పథకం ఎంతో మంది ఆడపిల్లల తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్నదన్నారు. మహిళా సంక్షేమం కోసం అనేక రకాల పథకాలను ప్రభుత్వం ప్రవేశపెడుతున్నదని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మార్చి చివరిలోగా ధరణి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి సరఫరా చేస్తున్న భగీరథ నీటినే ప్రతి ఒక్కరూ తాగాలన్నారు. ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా శిక్షణ పొందుతున్న వారిలో 1000 మంది కానిస్టేబుళ్లు కానున్నట్లు తెలిపారు. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ఎవరైనా డబ్బులు అడిగితే తనకు చెప్పాలని, వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్య, జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, తహసీల్దార్ మహమూద్ అలీ, ఎంపీడీవో విజయలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ యాదయ్య, సర్పంచ్‌లు ఉదయశ్రీ, శ్రీనివాస్‌రెడ్డి, సంతోష, విజయలక్ష్మి, కృష్ణ, రాజశేఖర్‌రెడ్డి, జగదీశ్, రమేశ్, హబీబ్, యాదమ్మ, ఎంపీటీసీలు శివలీల, శారద, ఇస్రత్బేగం, రవికిరణ్‌రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ స్వరూప, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి భాష పాల్గొన్నారు.
ఒకే కుటుంబంలో ఇద్దరికి..
మండలంలోని చౌదర్పల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి ఒకేసారి కల్యాణలక్ష్మి పథకం ద్వారా 2 చెక్కులు మంజూరయ్యాయి. దీంతో ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆనందంలో మునిగితేలారు. గ్రామానికి చెందిన శ్రీనగరం భారతమ్మ-సోమయ్య దంపతులకు సబిత, చైతన్య ఇద్దరు కూతుళ్లు. వారి ఇద్దరి వివాహాలను పేదరికంతో పాటు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఇటీవలే చేశారు. పెద్దకూతురు సబిత వివాహాన్ని 2021, మే 20న, రెండో కూతురు చైతన్య వివాహం 2021, మే 23న 2 రోజుల వ్యవధిలోనే చేశారు. కల్యాణలక్ష్మి పథకం కోసం ఇద్దరు బిడ్డల పేర్లతో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వారికి రెండు కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరయ్యాయి. సీఎం కేసీఆర్ సల్లగుండాలని కృతజ్ఞత తెలిపింది.