షాబాద్, మే 10: జిల్లాస్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని రంగారెడ్డి జిల్లా పరిషత్తు చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్తు కార్యాలయంలో జడ్పీస్థాయి సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనితారెడ్డి మాట్లాడుతూ…జిల్లాలో ఆసరా పథకం ద్వారా వృద్ధాప్య, వితంతు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు పెన్షన్ కోసం రూ. 36.98 కోట్లు ప్రభుత్వం ఇస్తున్నదన్నారు. అనితారెడ్డి అడిగిన పలు ప్రశ్నలకు సంబంధిత అధికారులు సమాధానమిచ్చారు. 20,800 పెన్షన్లు మంజూరై, ఫైనాన్స్ క్లియరెన్స్ గురించి పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. 2021-22లో మండలాలవారీగా ఎస్‌హెచ్‌జీ బ్యాంకు లింకేజీ లక్ష్యం, స్త్రీనిధి లక్ష్యం సాధించినట్లు చెప్పారు.
2022-23లో మార్చి 31 వరకు 1,33,576 మంది కూలీలకు ఉపాధిహామీ పథకం ద్వారా రూ. 80.18కోట్లు ఖర్చు చేసి 43.60లక్షల పనిదినాలు కల్పించినట్లు పేర్కొన్నారు. రైతు పొలాల్లో కల్లాలు జిల్లాలో 385 పూర్తి చేసినట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి 30 వరకు 34,869 మంది కూలీలకు ఉపాధిహామీ పథకం ద్వారా రూ. 4.94 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఎన్ఆర్జీఏస్ 2022-23లో శ్మశానవాటికల నిర్మాణం, రైతు పొలాల్లో కల్లాలు, రైతువేదికల నిర్మాణ పనులకు చెల్లింపులు జరిగినట్లు చెప్పారు. 2021-22లో జిల్లాలో 41 కొనుగోలు కేంద్రాల ద్వారా 9933 మంది రైతుల నుంచి 43,813,600 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి, 13 రైస్ మిల్లకు చేర్చామని, రైతులకు ఇప్పటివరకు రూ. 85కోట్లు వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.
ఆర్అండ్బీ కేతిరెడ్డిపల్లి రోడ్డు ఎప్పటివరకు పూర్తి చేస్తారని చైర్పర్సన్ దృష్టికి తీసుకురాగా వారం రోజుల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పాఠశాలల్లో సంపు లేదా, ట్యాంక్ నిర్మాణం చేయాలని చైర్పర్సన్ సూచించారు. జిల్లాలో అవసరమున్న చోట కొత్త కరెంట్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్స్ త్వరగా ఇచ్చేలా చూడాలని అధికారులకు ఆమె సూచించారు. వనస్థలిపురం, కొండాపూర్, ఈఎన్టీలో చిన్న పిల్లల వైద్యులు ఎంతమంది ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. మన ఊరు-మన బడి పథకం కింద 1264 పాఠశాలలను ఎంపిక చేసినట్లు, వాటి పనులను కూడా ప్రారంభించినట్లు సంబంధిత అధికారి చైర్‌పర్సన్‌కు తెలిపారు. సమావేశంలో జడ్పీ సీఈవో దిలీప్‌కుమార్, జడ్పీటీసీలు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.