సోమవారం 30 నవంబర్ 2020
Rajanna-siricilla - Jul 15, 2020 , 02:26:01

పచ్చిరొట్ట.. పంటకు మేలు

పచ్చిరొట్ట.. పంటకు మేలు

  • భూమికి జీవం.. దిగుబడి ఘనం..
  • తగ్గనున్న నత్రజని సంబంధ ఎరువుల ఖర్చు
  • రాయితీపై విత్తనాలు అందించిన ప్రభుత్వం
  • మండలంలో932  ఎకరాల్లో జీలుగ సాగు

ఇబ్బడిముబ్బడిగా వినియోగిస్తున్న రసాయన ఎరువులతో భూమి విషతుల్యమవుతున్నది. రోజురోజుకూ సారం కోల్పోయి నిర్జీవంగా మారుతున్నది.  అక్కరకొచ్చే జీవజాలం అంతరించి  పోతున్నది. ఈ ప్రభావం పంటలపై పడి దిగుబడి తగ్గిపోతున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు నిస్సారమైన భూములకు జీవం పోసేందుకు చర్యలు చేపట్టింది. సేంద్రియ సాగును ప్రోత్సహించడంతోపాటు రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు అందజేస్తున్నది.    -గంభీరావుపేట

రైతులు తాము సాగుచేసే వివిధ పంటల్లో అధిక దిగుబడి సా ధించాలనే ఉద్దేశంతో పప్పుజాతిలో లెగ్యుమ్‌ రకానికి చెందిన జీలుగ విత్తనాలను ప్రభుత్వం రాయితీపై అందిస్తున్నది. రైతు లు వరి సాగుచేసే 45 రోజుల ముందు జీలుగ పంటను సాగు చేస్తున్నారు. దీంతో భూసారం పెరుగడంతో పాటు నత్రజనిని స్థిరీకరించే పచ్చి రొట్ట ఎరువుగా మారుతుంది. ఎకరం భూమిలో జీలుగ సాగుచేస్తే మూడు టన్నుల వరకు పచ్చి రొట్ట అందుతుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. 

సేంద్రియ ఎరువుకు ప్రత్యామ్నాయం

ప్రస్తుతం భూసారాన్ని పెంచే పశువుల ఎరువుల లభ్యత క్రమేణా తగ్గిపోతుంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా పచ్చి రొట్ట అందించే పంటలను సాగు చేయాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. జీలుగ, జనుము తదితర పంటలను వేయాలని కోరుతున్నారు. వీటి సాగుతో భూమిలో సూక్ష్మ జీవులు వృద్ధి చెంది పంటల దిగుబడి పెరుగుతుంది.

ఎకరానికి 15 కిలోల విత్తనాలు

వరి పంట సాగు చేసే 45 రోజుల ముందు ఎకరానికి    15 కిలోల జీలుగ విత్తనాలతో సాగు చేస్తే, తదుపరి వేసిన వరి పంట అధిక దిగుబడిని ఇస్తుంది. జీలుగ ఏపుగా పెరిగిన తర్వాత పొలంలోనే రొటోవేటర్‌తో కలియదున్నితే భూమికి కావాల్సినంత పచ్చిరొట్ట అందుతుంది. జీలుగ సాగుతో        ఎకరానికి సుమారు మూడు టన్నుల పచ్చి రొట్టను     తక్కువ ఖర్చుతో పొందవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు  తెలుపుతున్నారు. 

మండలంలో 932 ఎకరాల్లో సాగు

మండలంలోని రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా రాయితీపై ప్రభుత్వం 124 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు అందించింది. దీంతో సుమారు 932 ఎకరాల్లో రైతులు తమ పంట భూము ల్లో జీలుగను సాగు చేశారు. అధికారులు అన్నదాతలకు అవగాహన కల్పించడంతో జీలుగ సాగు గణనీయంగా పెరిగింది.

 బహుళ ప్రయోజనాలు..

జీలుగను కలియదున్నిన తర్వాత అది నేలకు తర్వాత వేసే పంటలకు ఎంతో ఉపయోగపడుతుంది. సాగుచేసే మొక్కలకు తక్షణమే నత్రజని, సూపర్‌ ఫాస్ఫేట్‌, జింకు, మాంగనీస్‌, కాల్షియం వంటి పోషకాలను భూమికి అందిస్తుంది. అంతేకాకుండా పంట చేనులో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. వరి పంటలో తుంగ, గరిక వంటి కలుపు మొక్కలు పెరుగకుండా అడ్డుకుంటుంది. నేలకు సహజ మిత్రులైన వానపాముల ఉత్పత్తిని కూడా పెంచుతుంది. -పూర్ణిమ, మండల వ్యవసాయాధికారి, గంభీరావుపేట