శనివారం 04 జూలై 2020
Rajanna-siricilla - May 27, 2020 , 02:43:10

కోనసీమలా మారుస్తా

కోనసీమలా మారుస్తా

 దసరా నాటికి కాలువ ద్వారా 2.50 లక్షల ఎకరాలకు నీళ్లు 

 అక్టోబర్‌ నాటికి ప్యాకేజీ-9 పనులు పూర్తి 

 నీటి జంక్షన్‌లా జిల్లా 

 కేసీఆర్‌ కృషితోనే ఎండకాలంలో నిండుగా చెరువులు 

 మధ్యమానేరును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా 

 నియంత్రిత సాగు దిక్సూచి కావాలి 

 రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ 

వ్యవసాయశాఖ మంత్రితో కలిసి పర్యటన

మెట్ట ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాను కోనసీమలా మారుస్తానని, దసరా నాటికి 2.50 లక్షల ఎకరాలకు కాలువల ద్వారా గోదారి నీళ్లు అందిస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషితో జిల్లా నీటి జంక్షన్‌లా మారిందని, ఎండకాలంలో కూడా చెరువులు మత్తళ్లు దూకుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌తో కలిసి మంగళవారం అమాత్యుడు రామన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. రైతు వేదికల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తూ, భవనాలను ప్రారంభిస్తూ ముందుకు సాగారు. నియంత్రిత సాగుపై రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైతును రాజుగా చూడాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన నియంత్రిత సాగు విధానం దేశానికే దిక్సూచి కావాలని ఆకాంక్షించారు. మద్దతు ధర లేని పంటలను వేయద్దని, డిమాండ్‌ ఉన్న పంటలనే పండిద్దామని పిలుపునిచ్చారు. 

 సిరిసిల్ల/ వేములవాడ/ ఎల్లారెడ్డిపేట/ ముస్తాబాద్‌/ బోయినపల్లి : అక్టోబర్‌ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 9 పనులను పూర్తి చేస్తామని, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2.50 లక్షల ఎకరాలకు కాలువల ద్వారా సాగునీరు అందిస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. నియంత్రిత పంటల సాగు విధానంతో దేశంలో వ్యవసాయానికి నవశకం రానున్నదని ఉద్ఘాటించారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి మంగళవారం అమాత్యుడు రామన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. రైతు వేదికల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తూ, భవనాలను ప్రారంభిస్తూ ముందుకు సాగారు. నియంత్రిత సాగుపై రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. జల విప్లవం, హరిత విప్లవం, నీలి విప్లవం, శ్వేత విప్లవం, గులాబీ విప్లవంతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని చెప్పారు. గోదారి జలాలతో జిల్లాలో 6 మీటర్ల వరకు భూగర్భజలాలు పెరగడం కూడా అసాధారణ విషయమని చెప్పారు. రోణి ఎండల్లో జిల్లాలోని 660 చెరువులకు గానూ 80 శాతం చెరువులను గోదారి జలాలతో నింపగా మత్తడి దూకుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్తులతో కలిసి పిల్లకాలువలను ఏర్పాటు చేసుకుంటే కొంత భూమి నష్టపోయినా, ఎంతో మంది రైతుల కు మేలు జరుగుతుందని వివరించారు. భగీరథుడు గంగమ్మను ఆకా శం నుంచి నేలమీదికి తెస్తే, అపర భగీరథుడు కేసీఆర్‌ సముద్రమట్టానికి 85 మీటర్ల ఎత్తున పారుతున్న గోదారమ్మను 500 మీటర్ల ఎత్తుకు తీసుకువచ్చి రైతులు, ప్రజల కాళ్లు కడుగుతున్నారని కొనియాడారు. శాస్త్రీయ పద్ధతుల్లో సాంకేతికతను అందిపుచ్చుకొని నూతన వ్యవసాయ విధానంతో దేశానికే దిక్సూచిగా నిలుద్దామన్నారు. ప్రపంచమంతా కరోనాతో గందరగోళంగా ఉన్నా.. అమెరికా నుంచి భారతదేశం వరకు తల్లడిల్లుతున్నా,, మాట తప్పకుండా అన్నదాతలకు 1200 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు.

అంజీరాను మనరాష్ట్రంలో పండిస్తున్నరా..

బోయినపల్లి / రామడుగు: రామడుగు మండలం తిర్మలాపూర్‌ గ్రామానికి చెందిన యువరైతు కట్ల శ్రీనివాస్‌ తాను పండించిన అంజీరా పండ్లను మంగళవారం బోయినపల్లిలో మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డికి అందజేశారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలకు అనుగుణంగా రైతు కట్ల శ్రీనివాస్‌ బ్రౌన్‌టర్కీ రకం అంజీరా సాగు చేపట్టడం, పంటమార్పిడి విధానం అనుసరిస్తున్నందుకు మంత్రులు అభినందించారు. కాగా, శ్రీనివాస్‌ చేపడుతున్న సాగు వివరాలను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అంజీరా రుచి చూసిన మంత్రి కేటీఆర్‌ ఆనందం వ్యక్తం చేస్తూ ‘ఈ పండ్లను మన రాష్ట్రంలో పండిస్తున్నారా..? ఇంత అద్భుతమైన రుచి ఉన్నది’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మంత్రి నిరంజన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా తిర్మలాపూర్‌ను సందర్శిస్తానని చెప్పారు. భావితరాల రైతులకు మార్గదర్శకంగా వినూత్న పంటలకు శ్రీకారం చుట్టిన శ్రీనివాస్‌ను అభినందించారు. 

శంకుస్థాపనలు.. సదస్సులు..

ఉదయం 11.15 గంటలకు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌, సిరిసిల్ల జిల్లా సరిహద్దు ముస్తాబాద్‌ శివారు వెంకట్రావుపల్లిలోని పులికుంట చెరువులోకి వస్తున్న గోదారి జలాలకు పూజలు చేశారు. 11.45కు ముస్తాబాద్‌ మండలకేంద్రంలోని రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పోత్గల్‌ సహకార సంఘం రుణ సాయంతో తీసుకున్న హార్వెస్టర్‌ను ప్రారంభించారు. 12.30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలోని రైతు వేదిక నిర్మాణానికి భూమిపూజ చేశారు. 12.55కు బొప్పాపూర్‌లోని మార్కెట్‌ కమిటీ పరిపాలనా భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. అనంతరం అక్కడే భోజనం చేసి, 2.12 గంటలకు వేములవాడకు వెళ్లారు. వానకాలం నియంత్రిత సాగు విధానంపై జిల్లా స్థాయి వ్యవసాయ అధికారులు, రైతు బంధు సమితి కోఆర్డినేటర్లు, సహకార సంఘాల అధ్యక్షులు ప్రజాప్రతినిధులతో పట్టణంలోని మహారాజ ఫంక్షన్‌హాల్‌లో అవగాహన సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు బోయినపల్లి మండలంలోని శ్రీ రాజరాజేశ్వర జలాశయాన్ని సందర్శించారు. అనంతరం బోయినపల్లిలో రైతు వేదికకు భూమిపూజ చేసి, అక్కడే ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. 7 గంటలకు తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోయారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌, టెస్కాబ్‌ అధ్యక్షుడు రవీందర్‌రావు, ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ఆర్బీఎస్‌ కన్వీనర్‌ గడ్డం నర్సయ్య, డీఏవో రణధీర్‌రెడ్డి, జడ్పీ, ఉపాధ్యక్షులు సిద్ధం వేణు, ముస్తాబాద్‌, ఎల్లారెడ్డిపేట ఆర్బీఎస్‌ కన్వీనర్‌ కల్వకుంట్ల గోపాల్‌రావు, రాధారపు శంకర్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా అధికార ప్రతినిధి తోట ఆగయ్య, ముస్తాబాద్‌ ఎంపీపీ జనగామ శరత్‌రావు, జడ్పీటీసీలు గుండం నర్సయ్య, చీటి లక్ష్మణ్‌రావు, సెస్‌ డైరెక్టర్‌ విజయరామారావు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సురేందర్‌రావు, ఏఎంసీ చైర్మన్‌ గుళ్లపల్లి నర్సింహారెడ్డి, ఎంపీపీ పిల్లి రేణుక, సెస్‌ డైరెక్టర్‌ కుంబాల మల్లారెడ్డి, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యులు చాంద్‌పాషా, వేములవాడ మున్సిపల్‌ అధ్యక్షురాలు మాధవి, సర్పంచులు గాండ్ల సుమతి, కే బాల్‌రెడ్డి, సరోజన, ఎంపీటీసీ గీతాంజలి, మాజీ ఎంపీపీ చంద్రమోహన్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.

గొప్ప నాయకుడు కేసీఆర్‌ : వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి 

తెలంగాణ సమాజం ఊహించని వాటిని నిజం చేసిన గొప్పనాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కొనియాడారు. ‘రోళ్లు పగిలే రోణి ఎండల్ల బందనకల్‌లో గోదారి నీళ్లు నెత్తినపోసుకుని కలలో ఉన్నామా? వాస్తవంలో ఉన్నామా? అని ఆశ్చర్యపోయామ’ని చెప్పారు. రైతును నెత్తినపెట్టుకుని పూజించే కేసీఆర్‌ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా పని చేస్తున్నందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తంచేశారు. కేసీఆర్‌ను, తెలంగాణ అభివృద్ధిని సహించని ప్రతిపక్ష నాయకులు ప్రతి విషయాన్నీ వ్యతిరేకిస్తూ భంగ పడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 60 శాతం ప్రజలు వ్యవసాయం, దాని అనుబంధ వృత్తులపై ఆధారపడి పనిచేస్తున్నారని వివరించారు. వ్యవసాయం బలోపేతమైతే సమాజం బలోపేతం అవుతుందనే.. ఇంత ప్రాధాన్యం ఇస్తున్నారని స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్‌ చొరవతో పరిశ్రమలు, ఐటీ, సేవ, హైదరాబాద్‌ మహానగరం, మున్సిపాలిటీలు అద్భుత పురోగతిని సాధిస్తున్నాయన్నారు. దీంతో లక్షలాదిమందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. మండలకేంద్రాల్లో జరిగిన అభివృద్ధి మున్సిపాలిటీలను తలపించేలా ఉన్నాయని కొనియాడారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చే తీరున తెలంగాణను తీర్చిదిద్దేందుకు మంత్రి కేటీఆర్‌ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని చెప్పారు. తొలి రైతువేదిక నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టినందుకు సంతోషంగా ఉందన్నారు. ‘సిరిసిల్ల ప్రాంతం అన్ని వనరులుండి కుదేలైన వ్యవసాయరంగం గురించి యూనివర్సిటీలో చదువుతున్న కాలంలో ఉపన్యాసాలు విన్నాం.. నేతన్నల ఆత్మహత్యలు, అన్నదాతల ఆక్రందనల గురించి తెలుసుకున్నాం. ఈ రోజు శ్రీ రాజరాజేశ్వర జలాశయంతో భూగర్భజలాలు ఆరుమీటర్లు పెరగడం సంతోషంగా ఉంది’ అని చెప్పారు. తెలంగాణ సమాజానికి కేసీఆరే శ్రీరామరక్ష అని, అందుకే రైతులు ఏ పంటవేయాలో ఆయనే చెప్పగలరని ధీమా వ్యక్తం చేశారు. పండిన పంట వృథా పోకూడదనే నియంత్రిత సేద్యపు విధానానికి ముఖ్యమంత్రి కొత్త ఆలోచన చేశారని చెప్పారు. మన రాష్ట్రంలో పండించే పంట.. మన రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చి, పక్కరాష్ర్టాల్లో కూడా డిమాండ్‌ ఉండేలా సేద్యపు విధానాన్ని మార్చాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని చెప్పారు. ఆయిల్‌పామ్‌ పెంచేందుకు అనువైన స్థలం సిరిసిల్ల ప్రాంతమని, ఆ దిశగా ఆలోచించాలని రైతులను కోరారు. కోతుల బెడదలేకుండా కాంట్రాక్ట్‌ఫాం చేసి, మూడేండ్లు అంతరపంటలు వేస్తే నాలుగో ఏడు పంటదిగుబడి వస్తుందని ఆయన సూచించారు. 

ముద్దుల మనువడు కేటీఆర్‌ : సుంకె

సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ బోయినపల్లి మండలం కొదురుపాకకు చెందిన వారని, ఆమె తనయుడైన మంత్రి కేటీఆర్‌ చొప్పదండి నియోజకవర్గ ముద్దుల మనువడని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ చెప్పారు. దీంతో రైతులు, అధికారులు సంతోషంతో నవ్వారు. సిరిసిల్లతో పాటు చొప్పదండి నియోజకవర్గాన్ని కూడా అదేవిధంగా అభివృద్ధి చేయాలని కోరారు. అనంతరం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్‌ కూడా మండలంలోని కోరెం గ్రామం అల్లుడని అన్నారు. సీఎం కేసీఆర్‌ అత్తగారి ఊరు కొదురుపాక కావడంతో బోయినపల్లి మండలంతోపాటు నియోజకవర్గానికి కూడా ప్రత్యేక విశిష్టత ఉందని చెప్పారు. 

ఎనిమిది రైతు వేదికల నిర్మాణానికి దాతలు

జిల్లాలో నిర్మించే ఎనిమిది వేదికలకు దాతలు ముందుకొచ్చారని వేదికపై మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లో చిదుగు గోవర్ధన్‌గౌడ్‌, అల్మాస్‌పూర్‌లో రాధారపు సత్యం, శంకర్‌, గంభీరావుపేట మండలంలోని లింగన్నపేటలో హైకోర్టు అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ రాంచందర్‌రావు, సముద్రాలింగాపూర్‌లో టెస్కాబ్‌ అధ్యక్షుడు రవీందర్‌రావు, నర్మాలలో అనిల్‌రావు, ముస్తాబాద్‌ మండలం చీకోడులో హన్మంతరావు, పోత్గల్‌లో విద్యుత్‌ నియంత్రణ మండలి రాష్ట్ర చైర్మన్‌ తన్నీరు రంగారావు, తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్‌లో సెస్‌ మాజీ చైర్మన్‌ చిక్కాల రామారావు, గోపాల్‌రావుపల్లిలో మిర్యాల భాస్కర్‌యాదవ్‌ తమ సొంత ఖర్చులతో రైతు వేదికలను నిర్మిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ వివరించారు.

ఆరు మండల కేంద్రాల్లో మంత్రి సొంత ఖర్చులతో.. 

నియోజకవర్గంలోని ఐదు మండలాలతో పాటు బోయినపల్లిలో తన సొంత ఖర్చులతో రైతు వేదికలను నిర్మిస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. నియోజకవర్గంలోని గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌, వీర్నపల్లి, తంగళ్లపల్లితో పాటు తమ అమ్మమ్మ మండలమైన బోయినపల్లిలోనూ నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దానికి సంబంధించిన పత్రాలను కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌కు అందించారు.


logo