గురువారం 02 ఏప్రిల్ 2020
Peddapalli - Mar 21, 2020 , 02:59:33

ఆపరేషన్‌ కరోనా

ఆపరేషన్‌ కరోనా

  • అప్రమత్తంగా అధికార యంత్రాంగం
  • ముమ్మరంగా ముందు జాగ్రత్త చర్యలు
  • విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా, హౌస్‌ క్యారంటైన్‌ 
  • పెద్దపల్లి, గోదావరిఖని, సుల్తానాబాద్‌ దవాఖానల్లో ఐసోలేషన్‌ వార్డులు 
  • అన్ని ప్రధాన ఆలయాల్లో భక్తులకు ప్రవేశం బంద్‌..  
  • పిల్లలు, వృద్ధులు ఇంటిపట్టునే ఉండాలంటున్న వైద్యులు

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరోనా ముందస్తు నివారణకు జిల్లా అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. ఇప్పటి దాకా ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కానప్పటికీ పక్క జిల్లా కరీంనగర్‌లో ఇటీవల విదేశాల నుంచి వచ్చిన కొందరికి పాజిటివ్‌ ఉన్నట్లుగా తేలడంతో జిల్లా అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చిన వారు జిల్లాలోని రామగుడం రైల్వే స్టేషన్‌ నుంచి ఆటోలు, బస్సుల ద్వారా కరీంనగర్‌కు చేరడంతో వీ రు ప్రయాణించిన సమయంలో అదే రైలు, బస్సుల్లో ఉన్న వారిని జిల్లా అధికారులు అప్రమత్తం చేశారు.  అదే విధంగా ప్రజలు అధికంగా తిరిగే, ప్రయాణిస్తున్న బస్సు స్టాండ్ల వద్ద, రైల్వే స్టేషన్ల వద్ద, జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచ నలు, సలహాలు అందజేస్తున్నారు. ఎవరికీ ఈ వైరస్‌ వ్యా పించకుండా మాస్క్‌లు ధరించాలని కలెక్టర్‌ సిక్తా పట్నా యక్‌తో సహా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు రంగంలోకి దిగి ప్రజలను చైతన్య పరుస్తున్నారు. 

నిరంతరం పర్యవేక్షిస్తూ..

వివిధ దేశాల నుంచి ఇటీవల దేశానికి వచ్చిన వారి వివరాలను సేకరిస్తున్న అధికారులు, వారికి ఇళ్ల వద్దే వైద్య పరీక్షలు నిర్వహిస్తూ క్వారంటైన్‌ చేస్తున్నారు. నిరంతరం పర్యవేక్షిస్తూ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. కొంచెం అనుమానం వచ్చినా హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలిస్తూ పరీక్షలు చేయిస్తూనే, లేదని తేలినా 14 రోజులపాటు క్వారంటైన్‌ చేసి అబ్జర్వేషన్‌లో పెడుతున్నారు. వారికి ప్రత్యేకంగా 11 రకాల వస్తువులతోకూడిన శానిటేషన్‌ కిట్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. 

జిల్లాలో 34 ఐసోలేషన్‌ వార్డులు.. 

కరోనా నేపథ్యంలో జిల్లాలో ప్రత్యేకంగా ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. పెద్దపల్లిలోని జిల్లా ప్రధాన దవాఖానలో ఐసోలేషన్‌ వార్డులో 8 బెడ్లు, గోదావరిఖని పెద్ద దవాఖానలో 10 బెడ్లు, సుల్తానాబాద్‌ టీబీ దవాఖానలో 16 బెడ్లతో ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలను కలెక్టర్‌, అధికారులు పరిశీలించారు. 

ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు.. 

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలకు సెలవులు ప్రకటించడంతోపాటు బా ర్లు, రెస్టారెంట్లను మూసివేశారు. సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌ మూతబడ్డాయి. శుక్రవారం జిల్లాలోని ప్రధాన ఆలయాల్లోకి భక్తులకు ప్రవేశాన్ని నిలిపివేయించారు. ఈ మేరకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఇక తమ అనుమతి లేకుండా ఫంక్షన్‌ హాళ్లను నడపవద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. 

పెరిగిన శానిటైజర్ల వాడకం..

కరోనా వైరస్‌ వల్ల వ్యక్తిగత శుభ్రత పెరిగింది. ప్రజల్లోనూ చైతన్యం వచ్చింది. ఎక్కడ చూసినా ముఖానికి మాస్కులు, రుమాళ్లు కట్టుకునే కనిపిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇక ఇళ్లలో, బయటా చేతులు పదే పదే కడుక్కోవడం అనివార్యమైంది. దీని వల్ల శానిటైజర్ల వినియోగం విపరీతంగా పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. శానిటైజర్‌ లిక్విడ్‌, సర్జికల్‌ స్పిరిట్‌, డెట్టాల్‌ ఇతర హ్యాండ్‌వాష్‌ లిక్విడ్‌ల వాడకం అనూహ్యంగా పెరిగింది. ప్రజలు గుమికూడిన ప్రతిచోట శానిటైజర్‌ వాడుతున్నారు. దీంతో కొన్ని చోట్ల శానిటైజర్‌కు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడి కొరత ఉందని చెబుతున్నారు. నిజానికి రోజూ ఉపయోగించే సబ్బుతో చేతులు కడుకున్నా సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు. 

విస్తృత అవగాహన

కరోనా వైరస్‌ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కాగా, రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌తో ఫోన్‌లో మాట్లాడి జిల్లాలో కరోనా వైరస్‌ విషయంలో తీసుకుంటున్న చర్యలను గురించి సమీక్షించారు. ఆ తర్వాత కలెక్టర్‌ జిల్లా వ్యాప్తంగా పర్యటించడంతోపాటు రామగుండంలో అధికారులు, ప్రజా ప్రతిధులతో సమీక్షించారు. ఆయాచోట్ల సీపీ సత్యనారాయణ, అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, డీసీపీ పులిగిల్ల రవీందర్‌, మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌, రామగుండం కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌, డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధాకర్‌ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా, మంథని మున్సిపల్‌ చైర్మన్‌ పుట్ట శైలజ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సిబ్బంది, కార్మికులకు కరోనా నేపథ్యంలో మాస్క్‌లను అందజేశారు. వార్డుల్లో శానిటేషన్‌ పనులు చేయించారు.


logo