ఇది సంసార సంబంధమైన సామెత. భార్యాభర్తల అన్యోన్యతకు సంబంధించిన వ్యవహారం. ఎన్ని సంపదలున్నా.. ఎంతపెద్ద ఉద్యోగం చేసినా.. ఇంటికి వెళ్లాక భార్యాపిల్లల ప్రేమాభిమనాలు అందకపోతే ఇల్లు నరకంగా మారుతుంది. అందులోనూ నిత్యం భార్యాభర్తల పోరు ఉంటే.. మానసిక ప్రశాంతత కరువవుతుంది. ఇంటి కంటే గుడే పదిలం అనిపిస్తుంది. ‘ఒర్రేదాన్ని ఏలుకోవడం కన్నా.. బర్రెను తోలుకోవడం మిన్న’ సామెతను ఉపయోగిస్తుంటారు. పూర్వం ఓ భర్త గయ్యాళి భార్య పోరు పడలేక.. బర్రెలు తోలుకొని రోజూ పొలానికి వెళ్లేవాడట. అక్కడ దొరికే ప్రశాంతతలోనే తన బాధలన్నీ మర్చిపోయేవాడట. ఆ అనుభవంలోంచి ఈ సామెత పుట్టుకొచ్చింది. భార్యలను ఉద్దేశించినదే అయినా, భర్తలకూ వర్తిస్తుంది ఈ హెచ్చరిక.