‘సవాయ్ పని ఏడుంది బేటా. ఆ రోజులన్నీ పోయినయ్. మా కాలంల ఒకలకొకలం సవాయ్ కైకిలికి పొయ్యేది. ఇప్పుడంతా పైసతోనే పని. సవాయ్ పనే లేదు. ఆ మంచితనం అసలే లేదు’ అంటుంటారు పెద్దలు. ఈ పదబంధంలో ‘సవాయ్’ గురించి చాలా మందికి తెలియదు. పూర్వం గ్రామాల్లో రైతులకు కూలీల కొరత వచ్చినా, డబ్బులిచ్చే స్తోమత లేకపోయినా ఒక పొలం పనికి మరొకరు వెళ్లేవారు. దానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. మెట్ట పంటలైన మక్కలు, మిరప, పత్తి పొలాలకైతే తెల్లవారు
జామునే కలుపు తీయడానికి వెళ్లేవారు. పొద్దున్నే ఆరింటి నుంచి ఎనిమిది వరకు పనిచేసుకొని ఇంటిబాట పట్టేవారు. తెల్ల వారుజామున ఆ రెండుగంటల పనినే ‘సవాయ్’ పనిగా పిలిచేవారు. పక్కపక్క పొలాల రైతులు ఈ పద్ధతికి ఎక్కువగా మొగ్గు చూపేవారు. దీనివల్ల పొద్దున్నే సగం పని పూర్తయిపోయేది. కూలీ డబ్బులు ఇవ్వాల్సిన బాధా తప్పేది. ఒకరికొకరు ఉన్నామనే భావన ఎంతో సంతృప్తినిచ్చేది. సవాయ్ పనికి కూలీలను పిలిచినా రోజు కూలీలో పావువంతు మాత్రమే ఇచ్చేవారు. ఈ సవాయ్ అనే పలుకుబడి.. ఉర్దూలోని ‘సవేరా’ నుంచి వచ్చిందని చెబుతుంటారు. సవేరా అంటే.. పొద్దు పొద్దుగాల అని అర్థం.