‘ఇది నవ భారతం, యువ భారతం, మహిళా భారతం’ అంటూ మైక్ అందుకున్న ప్రతిసారి ఊదరగొట్టే ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. దేశ రాజధానిలో నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా రెజ్లర్లపై సాగిన వికృత కాండకు ఏ పేరు పెడతారో మరి? ప్రాణం పోయినా పరవాలేదు, దేశానికి పతకం అందిస్తే చాలు అనే లక్ష్యంతో బరిలోకి దిగి ప్రత్యర్థులను చిత్తుచేసి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన కుస్తీవీరులు.. ఇప్పుడా పతకాలను గంగా నదిలో నిమజ్జనం చేసేందుకు సిద్ధమయ్యారంటే.. దీనికి కారకులెవరు? తమ పార్టీకి చెందిన ఒక ఎంపీపై విచారణ చేపట్టేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నది?
రింగ్‌లోకి దిగితే ఎంతటి ప్రత్యర్థినైనా.. మట్టికరిపించగల ఈ మల్లయోధులు, తమపై జరిగిన అకృత్యాల మీద పోరాడే సమయంలో మాత్రం దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. యావత్ క్రీడాలోకాన్ని తమ అసమాన ప్రతిభతో అబ్బురపరిచిన స్టార్ రెజ్లర్లు.. గంగా తీరంలో నిస్సహాయంగా కూర్చొని రోదించడం.. ప్రతి క్రీడాభిమానిని కంటతడి పెట్టిస్తున్నది. చాంపియన్ల కంట కన్నీటికి కారకులైన వారిపై కేంద్ర ప్రభుత్వం శీతకన్ను ఎంకెన్నాళ్లు? అంటూ సోషల్ మీడియా కోడై కూస్తున్నది.
భారత క్రీడా చరిత్రలో రెజ్లింగ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. త్రేతాయుగంలో వాలి, సుగ్రీవుడి నుంచి ద్వాపరయుగంలో భీమార్జునుల వరకు బలనిరూపణకు అత్యుత్తమ మార్గంగా నిలిచింది ఈ క్రీడే. ఆధునిక కాలంలో మట్టి నుంచి మ్యాట్ పైకి మారి ఎన్నో హంగులు జోడించుకున్న నాటి మల్లయుద్ధమే నేటి రెజ్లింగ్. విశ్వక్రీడా సమరమైన ఒలింపిక్స్‌లో దేశానికి అత్యధిక వ్యక్తిగత పతకాలు తెచ్చిపెట్టింది కుస్తీ వీరులే. 120 ఏండ్లుగా ఒలింపిక్స్ బరిలో దిగుతున్న భారత్.. ఆ మెగాటోర్నీలో ఇప్పటి వరకు సాధించిన మొత్తం పతకాలు 35. అందులో సింహభాగం అనధికారిక జాతీయ క్రీడ హాకీలోనే రాగా.. రెండోస్థానం రెజ్లింగ్‌కే దక్కింది. టీమ్ గేమ్ అయిన హాకీలో భారత్‌కు 8 స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలు (మొత్తం 12 పతకాలు) లభించగా.. వ్యక్తిగత ప్రతిభతో కూడిన రెజ్లింగ్‌లో మనవాళ్లు 7 పతకాలు (2 రజతాలు, 5 కాంస్యాలు) నెగ్గా రు. ఒలింపిక్స్‌లోని మరే క్రీడలోనూ భారత్‌కు ఇప్పటి వరకు నాలుగు కంటే ఎక్కువ పతకాలు లభించలేదు. అంత ఘనమైన చరిత్ర ఉన్న దేశ రెజ్లింగ్ ప్రభ.. ప్రస్తుతం మసక బారుతున్నది.
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ మహిళా రెజ్లర్లు ఆందోళన బాట పట్టగా.. అది చినికి చినికి గాలి వానలా మారింది. వారికి పురుష రెజ్లర్లు కూడా మద్దతుగా నిలిచారు. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు సాధించి దేశ ఖ్యాతిని పెంచిన సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, సంగీత ఫోగట్, బజరంగ్ పునియా వంటి వాళ్లు తమకు న్యాయం చేయాలని మొత్తుకుంటున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిని అరెస్ట్ చేసి అతడిపై విచారణ చేపట్టాలనే డిమాండ్‌తో ధర్నాకు దిగిన రెజ్లర్లు.. శాంతియుత మార్గంలో నిరసన తెలిపినా ఫలితం లేకపోయింది. దీంతో తమ గోడు ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో ఆదివారం పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం సమయంలో అక్కడికి చేరి డిమాండ్లను కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రెజ్లర్లు భావించారు. కానీ, కేంద్ర సర్కార్.. రెజ్లర్లందరినీ టెర్రరిస్టుల కంటే దారుణంగా అరెస్ట్ చేసింది.
అంతర్జాతీయస్థాయిలో పతకాలను గెల్చుకున్న ఏ అథ్లెట్‌కైనా.. మీ జీవితంలో అత్యంత ఉద్వేగభరిత క్షణం ఏది అంటే.. పతకం నెగ్గిన అనంతరం, రెపరెపలాడుతూ త్రివర్ణ పతాకం పైకి ఎగరడమే అని నిస్సంకోచంగా వెల్లడిస్తారు. అలాంటి అసమాన దేశభక్తి ప్రదర్శించే అథ్లెట్లతో పోలీసులు వ్యవహరించిన తీరు ముమ్మాటికి ఆక్షేపణీయం.తాము కిందపడ్డా జాతీయ జెండా నేల పడొద్దనే సంకల్పంతో రెజ్లర్లు నడిరోడ్డుపై కుస్తీ పట్లు పడుతుంటే.. పోలీసులు బలవంతంగా వారిని ఈడ్చిపడేసి, వారి నిరసన కేంద్రాన్ని తొలగించిన దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలచివేశాయి.
ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియాగేమ్స్ వంటి ముఖ్యమైన క్రీడా టోర్నీలకు వెళ్లే ముందు అథ్లెట్లతో మాట్లాడి, వారిలో మనోధైర్యం నింపడం తన ప్రధాన ఉద్దేశం అని పలుమార్లు చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తమ పార్టీకి చెందిన ఓ ఎంపీపై వచ్చిన లైంగిక ఆరోపణల విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారన్నది అంతుచిక్కని ప్రశ్న. రింగ్‌లోకి దిగితే ఎంతటి ప్రత్యర్థినైనా.. మట్టికరిపించగల ఈ మల్లయోధులు, తమపై జరిగిన ఆకృత్యాల మీద పోరాడే సమయంలో మాత్రం దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. యావత్ క్రీడాలోకాన్ని తమ అసమాన ప్రతిభతో అబ్బురపరిచిన స్టార్ రెజ్లర్లు.. గంగా తీరంలో నిస్సహాయంగా కూర్చొని రోదించడం.. ప్రతి క్రీడాభిమానిని కంటతడి పెట్టిస్తున్నది. చాంపియన్ల కంట కన్నీటికి కారకులైన వారిపై కేంద్ర ప్రభుత్వం శీతకన్ను ఎంకెన్నాళ్లు? అంటూ సోషల్ మీడియా కోడై కూస్తున్నది.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల వేళ మల్లయోధులు పవిత్ర పుణ్యక్షేత్రమైన హరిద్వార్‌లో విలపిస్తున్నారు. మరి, ఈ
కన్నీళ్లకు విలువ లేదా? పతకాలు సాధించినప్పుడు మాత్రం ‘దేశ్ కీ బేటీ’ అంటూ అక్కున చేర్చుకునే వాళ్లు.. ఇప్పుడు వారిని ఎందుకు పట్టించుకోవటం లేదు? విపక్ష సభ్యులపై చిన్న చిన్న ఆరోపణలకే కేంద్ర సంస్థలతో దాడులు, దర్యాప్తులు చేయించే కేంద్ర ప్రభుత్వం.. తమ పార్టీ నేతపై వచ్చిన ఆరోపణలను మాత్రం పట్టించుకోకపోవటం ద్వంద్వప్రవృత్తికి నిదర్శనం.
కుస్తీలో మన ఘన చరిత్ర
స్వతంత్ర భారతంలో దేశానికి తొలి వ్యక్తిగత ఒలింపిక్స్ పతకం రెజ్లింగ్‌లోనే దక్కింది. 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లో కేడీ జాదవ్ కాంస్య పతకం సాధించాడు. అనంతరం, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ కాంస్య పతకాన్ని గెల్చాడు. ఆ తర్వాతి ఒలింపిక్స్ (2012 లండన్)లో సుశీల్ రజతం కైవసం చేసుకోగా, యోగేశ్వర్ దత్ కాంస్యాన్ని సాధించాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో దేశానికి కేవలం రెండు పతకాలే దక్కగా.. అందులో ఒకటి (కాంస్యం) సాక్షి మాలిక్ సాధించింది. ఇక 2020 టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి ఏడు పతకాలు వస్తే.. అందులో రెండు రెజ్లింగ్వే. రవికుమార్ దహియా రజతం చేజిక్కించుకోగా.. బజరంగ్ పునియా కాంస్యం గెలుచుకున్నాడు.
-ఇంతియాజ్ మహమ్మద్
76609 91992