‘నోరు మంచిదైతే ఊరు మంచిదైతది’ అని అంటారు. కడుపు నిండా విషం పెట్టుకున్నాక నోరు ఎలా మంచిదవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన పనితీరుతో కాకుండా నోటితోనే వార్తల్లోకి ఎక్కుతున్నారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చిన చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించాలని అనుకున్నారో లేదా తెలంగాణకు వ్యతిరేకంగా రెండుకండ్ల సిద్ధాంతంతో టీడీపీ ఊడ్చుకుపోవడంతో నాటి పార్టీ నాయకునిగా మళ్లీ ఆ పార్టీకి జీవం పోయాలని అనుకున్నారో ఏమో.. ఖమ్మంలో ఇటీవల జరిగిన సర్పంచ్ల సమావేశంలో రేవంత్ మాటలతో తన నిజస్వరూపాన్ని చాటుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కాలంలో సబ్బండ ప్రజానీకం తెలంగాణ వ్యతిరేకులపై జంగ్ సైరన్ మోగించారు.
చంద్రబాబు ప్రకటనతో ప్రజలు ఆగ్రహావేశాలకు లోనై తెలంగాణ వ్యతిరేక పార్టీ తమకెందుకని టీడీపీ గద్దెలను కూల్చారు. పాపం.. ఆ సమయంలో టీడీపీలో ఉండి ఏమీ చేయలేకపోయిన రేవంత్‌రెడ్డికి నేడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నాటి టీడీపీ పతనం గుర్తుకు వచ్చినట్టున్నది. అందుకే టీడీపీ గద్దెలు కూల్చినట్టు బీఆర్ఎస్ గద్దెలు కూల్చాలని, బీఆర్ఎస్ పతనం కావాలని కోరుకోవడం ఆయనలో ఇంకా టీడీపీ ఆనవాళ్లు ఉన్నాయనే వాదనకు బలం చేకూరుతున్నది. టీడీపీ ఎదుగుదల గురించి పీసీసీ చీఫ్‌గా పనిచేసి, నేడు సీఎంగా ఉన్న వ్యక్తి మాట్లాడటం రాజకీయాల్లో సంచలనంగా మారింది. తెలంగాణలో టీడీపీ ఎదుగుదల అంటే తెలంగాణ గోసకు కారణమైన పార్టీని భుజాన వేసుకోవడమే.
ఇటీవలి సినిమా టికెట్ల ధర పెంపు వివాదం, మద్యం సీసాల లేబుళ్ల పంచాయితీ, బొగ్గు కుంభకోణం, ఉప ముఖ్యమంత్రి భట్టి మీద ఆరోపణలు, కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హాజరుపర్చడం, సిట్ పేరిట మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లను వేధింపులకు గురిచేయడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ 10-20 ఏండ్ల వరకు కోలుకునే పరిస్థితి లేదని సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది.
రెండేండ్లు దాటినా పాస్ మార్కులేవీ?
కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు వారి పరిపాలనను పాత ప్రభుత్వంతో పోల్చి చూస్తుంటారు. రెండేండ్లు దాటినా రేవంత్‌రెడ్డి పాలనలో కనీసం పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేకపోయారు. ‘నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు’ అన్నట్టు ఉన్నది.. రేవంత్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పాలన. ఇప్పటివరకు ఒక్క మంచి కార్యక్రమంతోనైనా ప్రజల మనసును గెలవలేకపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో చాంతాడంత హామీలు ఇచ్చి అమలు చేయలేక బోర్లాపడి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ చావుతప్పి కన్ను లోట్టబోయినట్టు పరిపాలన సాగిస్తున్నారు. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయడం ఆచరణ సాధ్యం కాదని తెలిసినా వినకుండా మొండిపట్టుకు పోయిన రేవంత్‌రెడ్డి రైతుల్లో అప్రతిష్ఠ పాలయ్యారు. ప్రజల దృష్టిని మరల్చడానికి మూసీ ప్రక్షాళన, హైడ్రా కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అభాసుపాలయ్యారు. ఈ నిర్ణయాలతో దేశంలోనే రెండో రాజధానికి పేరున్న హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది. కేసీఆర్ జాడలు చెరిపేస్తామంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పాతరేసి కాంగ్రెస్ నాటి పాత పాలనను గుర్తుకు తెస్తున్నారు.
స్పష్టంగా కనిపిస్తున్న మార్పు
మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలన్నారు.. నేడు తెలంగాణలో మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది. తెలంగాణ అంతటా వ్యవసాయ మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడంతో గ్రామాల్లోకి మోటర్లు తీసే మిషన్లు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. మోటర్ మెకానిక్‌లకు, కేబుల్ వైర్, మోటర్ షాప్‌ల వారికి చేతి నిండా పనిదొరుకుతున్నది. యూరియా కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు. నేడు ఎక్కడికి వెళ్లినా రుణమాఫీ కాలేదని, రైతుబంధు ఇవ్వడం లేదని రైతులు ఆందోళనలకు గురవుతున్నారు. అంగన్వాడీ, ఆశావర్కర్లతోపాటు ఉద్యోగ, నిరుద్యోగ వర్గాలు, కార్మిక, కర్షక వర్గాలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు
తొమ్మిదిన్నరేండ్లు కరువు కనిపించలే
కరువు కాటకాల్లో ఉన్న తెలంగాణలో గోదావరి, కృష్ణా మిగులు జలాలను పారించి సస్యశ్యామలం చేయడానికి కేసీఆర్ తీవ్రంగా కృషి చేశారు. ఆయన హయాంలో తొమ్మిదిన్నరేండ్లు తెలంగాణలో కరువుఛాయలు కనిపించలేదు. కానీ నేడు ఏపీ ప్రభుత్వం కృష్ణా, గోదావరి జల దోపిడీ చేస్తుంటే రేవంత్‌రెడ్డి సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. రేవంత్ నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు అశనిపాతంగా మారడం ఖాయమనే సంగతి స్పష్టమైపోయింది.
-జీడిపల్లి రాంరెడ్డి
9666680051