2014లో తెలంగాణ ఏర్పడ్డ నాడు వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది. పవర్ హాలీడేలపై పరిశ్రమల యాజమాన్యాలు ఉద్యమిస్తున్నాయి.
కరెంట్ కష్టాలతో రాష్ట్రం మొత్తం చీకటిలో మగ్గుతున్నది. ఉమ్మడి రాజధాని పేరిట హైదరాబాద్‌లో ఆంక్షలు అమలవుతున్నాయి. వలస పాలనలో 60 ఏండ్ల విధ్వంసం తర్వాత ఏది, ఎక్కడ, ఏ స్థితిలో ఉందో స్పష్టత లేని అయోమయ వాతావరణంలో కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ మొదలైంది.
తెలంగాణలో విద్యుత్తు సమస్యల పరిష్కారానికి రెండేండ్ల సమయం పట్టవచ్చని, అందరూ సహకరించాలని అంతకుముందు ఎన్నికల సభల్లోనే ప్రజలను కేసీఆర్ కోరారు. ఒకవైపు ఏడు మండలాలతో పాటు సీలేరు విద్యుత్తు కేంద్రాన్ని ఆంధ్రలో కలపడం, కాళ్లల్లో కట్టెలు పెట్టినట్టు విద్యుత్తు పీపీఏలను చంద్రబాబు రద్దు చేయడం వంటి అనేక సమస్యలు తొలి ప్రభుత్వానికి స్వాగతం పలికాయి. వాటన్నింటిని అధిగమించి రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే కేసీఆర్ విద్యుత్తు సమస్యను తీర్చారు. తద్దారా దేశంలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చిన తొలి రాష్ట్రంగా కీర్తి గడించారు.
ఏదైనా సమస్యను పైపైన నామ్ కే వాస్తే అన్నట్టు అర్థం చేసుకుని, చూపే పరిష్కారం తాత్కాలికంగా తీవ్రతను తగ్గించినా దీర్ఘకాలికంగా ఆ సమస్య ఇంకా పెద్దదవుతుంది. కానీ, సమస్య మూలాల్లోకి వెళ్లి, కారణాలను విశ్లేషించి, మూలాల్లోంచి దాన్ని తొలగించేలా పరిష్కారం చూపితే క్రమంగా సమస్య తీవ్రత తగ్గుతుంది. కొంతకాలానికి ఆ సమస్యే కనుమరుగవుతుంది. కేసీఆర్ చేసింది ఇదే.
కరెంట్ ఎప్పుడొస్తదని ఎదురుచూసే స్థితి నుంచి కరెంట్ పోతే వార్త అనే స్థాయికి తెలంగాణను తీసుకువచ్చారు కేసీఆర్. కరెంట్ కోసం ఇందిరాపార్కు వద్ద పరిశ్రమల యజమానులు ధర్నా చేసిన రోజుల నుంచి 2023 నాటికి తలసరి విద్యుత్తు వినియోగంలో జాతీయ సగటు (1,196 యూనిట్లు)ని మించి దాదాపు రెండింతలు (2,166 యూనిట్లు) పెరిగే స్థితికి చేర్చారు. ఈ ఆధునిక యుగంలో విద్యుత్తు ఒక నిత్యావసరం. మౌలిక వసతులతోపాటు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌లలో తీసుకొచ్చిన మార్పులు, క్వాలిటీని మెయింటెన్ చేయడం, గత పదేండ్లలో ఈ రంగంలో పెద్ద మొత్తంలో పెట్టిన మూలధన వ్యయంతో తెలంగాణ స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 7,778 మెగావాట్ల నుంచి 25 వేల మెగావాట్లకు చేరుకున్నది. తెలంగాణను పవర్ బ్యాంక్‌గా మార్చిన ఘనత కేసీఆర్‌దే.
ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే, 2014లో రూ.40 వేల కోట్ల రెవెన్యూ ఆదాయంతో సమస్యల వలయంలో మొదలైన తెలంగాణ ప్రయాణం 2023 నాటికి రూ.1.6 లక్షల కోట్ల రెవెన్యూ ఆదాయానికి చేరింది. ఈ దశాబ్ద కాలంలో ఏ రాష్ట్రం కూడా ఇంతటి రెవెన్యూ పెరుగుదలను చూడలేదు. దీని వెనుక కఠోర శ్రమ ఉంది. కేంద్రం మద్దతు లేకుండానే, కేంద్రం పెట్టే ప్రజాకంటక విధానాలను తట్టుకొని, వారిచ్చే తాయిలాల వంటి సబ్సిడీలకు ఆశపడకుండా కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని చూసింది. బలమైన రాష్ర్టాలే బలమైన దేశానికి నాంది అని చెప్పే కేసీఆర్ ఫెడరల్ నినాదాన్ని ముందుగా తన పాలనలో, తన రాష్ట్రంలో అమలుచేసి చూపించారు. ప్రగతికి పట్టుగొమ్మలైన గ్రామాల్లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టిపెట్టారు.
గ్రామాల నుంచి మండలాలకు రోడ్లు, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు, గ్రామ గ్రామాన పల్లె ప్రకృతి వనాలు, ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు, సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణ, సమయానికి చెరువులను నింపడం, చేప పిల్లల పంపిణీ, శ్మశానవాటికల నిర్మాణం, చెత్త సేకరణ, హరితహారం, 24 గంటల కరెంట్, చెక్ డ్యాంల నిర్మాణం, రైతు వేదికలు, గురుకుల పాఠశాలలు, రైతుబంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు.. ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వ ప్రగతి సాధ నాలు. ఇవే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేసి రాష్ట్ర రెవెన్యూ పెరుగుదలకు దోహదపడ్డాయి. కాలంతోపాటు అర్బన్ రెవెన్యూ పెరగడం ఎక్కడైనా సహజమే. కానీ, రూరల్‌లో ఈ స్థాయిలో రెవెన్యూ పెరగడమనేది కేవలం తెలంగాణలోనే, కేసీఆర్ పాలనలోనే సాధ్యపడింది.
నైపుణ్యం గల మానవ వనరులున్న తెలంగాణలో మన మాంసం అవసరాలను రాష్ట్రంలోనే తీర్చుకోలేమా? ఎందుకు ఇతర రాష్ర్టాల నుంచి పెద్ద స్థాయిలో గొర్రెలను దిగుమతి చేసుకుంటున్నాం? అని కేసీఆర్ ప్రశ్నించుకున్నారు. ఆ ప్రశ్నల నుంచే గొర్రెల పంపిణీ పథకమనే సమాధానం పుట్టింది. ఆ పథకం మూలంగా రాష్ట్రంలో గొర్రెల సంఖ్యతోపాటే ఆయా వర్గాల ఉపాధి, వారి కొనుగోలు శక్తి పెరిగాయి. ఇవి రాష్ట్ర ప్రగతికి దోహదపడ్డాయి. గొర్రెల పెంపకంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. అత్యధిక తలసరి మాంసం అందుబాటులో ఉన్న రాష్ట్రంగా అవతరించింది.
(29.21 కిలోలు/సంవత్సరం).
తెలంగాణ చెరువుల్లో కనుమరుగైన ఎర్ర రొయ్యలు, మంచినీటి చేపలు, చెరువులను ఎల్లప్పుడూ నీటితో నింపడం ద్వారా గ్రామీణ వ్యవస్థకు ఒనగూడే ప్రత్యక్ష, పరోక్ష ప్రయోజనాల గురించి కేసీఆర్ సూక్ష్మంగా చర్చించిన సందర్భాలెన్నో. ఒక్కొక్క పని చేస్తూ, ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆయన చేసిన పనులు, తద్వారా గ్రామాల్లో జరిగిన ప్రగతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసింది. జనాభా ఎక్కువ ఉన్నచోట పెరిగిన మౌలిక వసతులు, ఉపాధి, సగటు గ్రామీణ తెలంగాణ కొనుగోలు శక్తే ప్రగతికి సూచికలు. కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్‌తో పాటు టైర్-2 నగరాలు, గ్రామాల్లో మూలధన పెట్టుబడిపై ఎక్కువగా దృష్టిసారించింది. అలాగే కేసీఆర్ హయాంలో సంక్షేమం కూడా అభివృద్ధికి దోహదపడే విధంగా సాగింది. సంక్షేమ పథకాలు పొందిన వర్గాల్లో మారిన వారి జీవనశైలి, పెరిగిన ఆత్మవిశ్వాసం, భవిష్యత్తుపై ఆశలతో మరింత మెరుగైన వృద్ధి వైపు అడుగులు వేసేలా చేశాయి. పెరిగిన సామాన్యుల జీవన ప్రమాణాలు ఆర్థిక వ్యవస్థకు మరింత దోహదం చేశాయి. ప్రతీ రంగంలోనూ ఉపాధికి కొత్త అవకాశాలు పుట్టుకొచ్చాయి. పింఛన్లు, రైతుబంధు, గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపి ణీ, దళిత బంధు, బీసీ బంధు, 24 గంటల కరెం ట్, గ్రామాలకు మ్యాచింగ్ గ్రాంట్లు, రైతు బీమా లాంటి పథకాల ద్వారా నేరుగా గ్రామాల్లోకి డబ్బును పంపించడంతో వలసలు ఆగాయి. వలసల వాపస్నూ మనం చూశాం. స్థానికంగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి. తాము ఉన్నకాడనే ఉపాధి దొరుకుతుందనే ధీమా ప్రజల్లో కలిగింది. ఇలాంటి భరోసా కల్పించడమే కదా ఇంటి పెద్దగా ప్రభుత్వం చేయాల్సిన పని.
వ్యవసాయం విషయంలో చెప్పుకోవాలంటే చర్విత చరణమే. మన దగ్గర పంట కొనలేక కేంద్రమే చేతులెత్తేసింది. కేంద్రం మీద ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వమే ధర్నా చేయాల్సినంత పంట పండింది తెలంగాణలో. వలసల జిల్లాలని పేరుపడ్డ పాలమూరు, కరీంనగర్‌లలో పక్క రాష్ర్టాల కూలీలు వచ్చినా ఇంకా డిమాండ్ ఉందంటే వ్యవసాయ రంగంలో ఏ స్థాయిలో ఉపాధి పెరిగిందో అర్థం చేసుకోవాలి. అత్యధిక జనాభా ఆధారపడిన వ్యవసాయాన్ని తొలి ప్రాధాన్యంగా భావించి నీళ్లు, కరెంట్, మార్కెటింగ్‌తో పాటు పెట్టుబడి కోసం రూ.72 వేల కోట్లను రైతుబంధు రూపంలో ఇవ్వడంతో పంట ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. వ్యవసాయ ఉత్పత్తులు, ఉపాధి పెరగడం, వ్యవసాయ ఆధారిత రంగాల్లో ప్రగతితో తెలంగాణలో వచ్చినంత మార్పు.. ఈ దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా రాలేదు.
తెలంగాణను ఎంఎస్ స్వామినాథన్ మెచ్చుకున్నారు. ఐక్యరాజ్యసమితి పొగిడింది. దేశం స్ఫూర్తిపొంది రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలను కాపీ కొట్టింది. కేసీఆర్ ప్రభుత్వం ఎంత నిషిత పరిశీలనతో, ప్రగతికాముకంగా పనిచేసిందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. కమలనాథులు ఊదరగొట్టే గుజరాత్ మోడల్ నుంచి ఒక్కటంటే ఒక్క పథకాన్నీ దేశం ఈ స్థాయిలో ఆమోదించలేదు. కానీ, అనతికాలంలోనే తెలంగాణ మోడల్ అంటే ఏంటో దేశం చూసింది. దేశాన్ని మనవైపు చూసేలా చేశారు కేసీఆర్.
ఆర్థికరంగ నిపుణులు డాక్టర్ జీఆర్ రెడ్డి లాంటి వారి సూచనలు, కేసీఆర్ సూక్ష్మ, దూరదృష్టితో తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ జీవన ప్రమాణాల్లో, మౌలిక సదుపాయాల కల్పనలో, ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపడంలో అద్భుత విజయం సాధించింది. ముఖ్యంగా గ్రామీణ తెలంగాణలో అద్భుత ప్రగతిని మనం చూశాం. 2014-2023 మధ్యకాలంలో తెలంగాణ జీఎస్డీపీ రూ.4.5 లక్షల కోట్ల నుంచి రూ.16 లక్షల కోట్లకు చేరింది. ఈ పెరుగుదలను మెట్రో నగరమున్న మరే రాష్ట్రం సాధించలేకపోయింది. సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లలాగా సాగిన కేసీఆర్ పాలనలో నగరాభివృద్ధితోపాటు గ్రామీణాభివృద్ధి జరగడంతోనే ఇది సాధ్యమైంది. నిజానికి తెలంగాణలో, ముఖ్యంగా గ్రామీణ తెలంగాణలో గత పదేండ్లలో జరిగిన పనులు అనేక పరిశోధనలకు కేంద్రంగా మారాయి. ‘తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కా దు, వెనుకవేయబడ్డ ప్రాంతం. తెలంగాణ ధనిక రాష్ట్రం, సాంస్కృతిక వైభవమున్న రాష్ట్రం’ అని ఉద్యమంలో చెప్పిన ప్రతీ మాటను తన పాలనలో, పనితీరుతో, సాధించిన ఫలితాలతో దేశం ముందు నిరూపించి, తెలంగాణను ఒక అభివృద్ధి మోడల్‌గా ప్రపంచానికి పరిచయం చేశారు కేసీఆర్.
జై తెలంగాణ!
-రఘునందన్‌రెడ్డి పాశం
72077 70469