దేన్నైనా కూల్చడం లిప్త కాలం. రెప్పపాటులో సమస్తాన్ని బూడిదగా మార్చవచ్చు. అదే కట్టడం ఎంత కష్టం? ఎంత శ్రమ? ఎన్ని కోట్ల సొమ్ము ఖర్చు అవుతుంది? ఎన్ని ప్రణాళికలు… ఎన్ని రాత్రులు..ఎంత కాలం అవసరం అవుతుంది. ఎన్ని ప్రకృతి వనరుల వినియోగం.. మరెన్ని ఆలోచనల ఉపయోగం జరుగుతుంది. కాబట్టి నిర్మించడం అనేది బృహత్తరమైన బాధ్యత.
తెలంగాణ అంటేనే మిళితమైన సం స్కృతులకు సంప్రదాయాలకు నిల యం. ‘గంగాజమున తెహ్జీబ్’ అని ప్రపంచమంతా కొనియాడుతున్న గొప్ప నాగరికతను తెలంగాణ కలిగి ఉన్నది. మన తెలంగాణ విభిన్నతల సమాహారం. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉద్యమనేత కేసీఆర్ పాలన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఈ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా, ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు, భావాలకు విలువిచ్చి ఎన్నో నూతన కట్టడాలకు అంకురార్పణ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో నిర్మాణాలు పూర్తయ్యాయి. అందులో ప్రాజెక్టులు, కాలువలు మొదలైనవి ప్రజల జీవనంలో విప్లవాత్మక మార్పు తెచ్చాయి. ప్రగతి భవనం, సచివాలయం, కొత్త కలెక్టర్ కార్యాలయాల వంటివి ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ప్రజల అవసరాలు తీరుస్తున్నాయి. వీటికి తో డు అంబేద్కర్ విగ్రహం, అమరుల స్మారక స్థూపం నిర్మాణంలో ఉన్నాయి. యాదాద్రి సహా పలు దేవాలయాలు కొత్త సొబగులను సంతరించుకుంటున్నాయి.
ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయ ప్ర బుద్ధులు కొత్తగా నిర్మించిన ప్రగతి భవన్‌ను నక్సలైట్లు డైనమెట్లతో పేల్చివేయాలని ఉద్రిక్తతలను సృష్టించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నాయకుడు ఇలా మాట్లాడడం దిగజారుడుతనమే. ఆ వ్యాఖ్యలు పూర్తిగా అహంకారం తో చేసిన ప్రకటనలా ఉంది.
ఎక్కడైనా ప్రభుత్వాలు కట్టే కట్టడాలన్నీ ప్రజలకే చెందుతాయి. అంటే ఆ కట్టడాలన్నీ ప్రజల సొమ్ముతో, వారి చెమట చుక్కల శ్రమ తో నిర్మితమైనవని అర్థం. ఏ పార్టీ ప్రభుత్వం నిర్మించినా అవి ప్రజల ఆస్తి. అలాంటి ప్రజా ఆస్తులను కూల్చుతామని గొంతు చించుకొని అరవడం అంటే ప్రజల ఆస్తులను కూల్చుతామనే కదా అర్థం. మేధావులు, కాసింత సామాజిక స్పృహ ఉన్న ప్రజలందరూ దీని గురించి ఆలోచించాలి.
నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం ఆ మాటలు అనాల్సి రావడం వారి వ్యక్తిత్వ పతనాన్ని సూచిస్తున్నది. వారిలో దాగున్న బూర్జువా ఆలోచనలకు సంకేతంగా మిగిలిపోతుంది. అంతేకానీ అది వారు మోస్తున్న పార్టీ ఎదుగుదలకు ఏమాత్రం ఉపకరించకపోగా ఆ పార్టీ పతనానికి దారితీసే ప్రమాదమే ఎక్కువ.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ సభలోనైనా ఒక హితవాక్యం చెబుతూ ఉంటారు. ‘అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఎంత పేరు మోసిన మోతెబరి నేతలైనా కొద్ది రోజులకు మాజీలుగా మారిపోవాల్సిందే’ అని. అది అక్షరాల సత్యం. ప్రజలు ఆదరించినన్ని రోజులు అధికారం, ఆ తర్వాత ప్రతి పక్షమో, రాజకీయ సన్యాసమో ఏదో ఒకటి తప్పదు. ఆ సమయంలో ఆ పాత్రలో ఇమిడి పోవాల్సిందే. అంతేతప్ప ఏ పదవీ ఎవరికీ సొంతం కాదు. అటువంటప్పుడు రాజకీయ స్వార్థం కోసం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం మంచిదికాదు. అలాంటి నాయకుడిని ఎక్కువకాలం రాజకీయ క్షేత్రంలో ఉంచడానికి ప్రజలు ఆసక్తి చూపించరు.
పొద్దున లేస్తే మతం మంటకాగే బీజేపీ రాష్ట్ర బాధ్యుడు బండి సంజయ్ కూడా కూల్చివేతలే కోరుకొంటున్నారు. తెలంగాణ సచివాలయం పైన నిర్మించిన డోములను కూల్చుతామని ఆయన ఆవేశంగా ఊగిపోతున్నారు. అవి ఇతర మత సంప్రదాయాలకు అనుకూలంగా, తెలంగాణ కళాత్మకతకు దూరంగా ఉన్నాయంటూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సువిశాల భారతదేశంలో చారిత్రకంగా ఎన్నో సంస్కృతులు మిళితమయ్యాయి.
భిన్న దేశాల సంస్కృతుల ప్రభావం మన కట్టడాలపై ఉన్నది. అనేక దేశాల సంస్కృతితో పాటు భాషలు, ఆహారపు అలవాట్లు, కట్టు బొట్టు, ఆచారాలు మన ప్రజలలో ఇమిడి పోయాయి. వాటిలో నచ్చిన వాటిని పాటించడం, నచ్చనివి వదిలివేయడం మన ఇష్టం. ఈ డోమ్ కట్టడాల పద్ధతి కూడా అరబ్బు దేశాల శైలి నిర్మాణాలు చేపట్టే శిల్పకారుల వలన మన దేశానికి వచ్చింది. ప్రపంచ ఎనిమిదో వింత తాజ్‌మహాల్, న్యూఢిల్లీ సెక్రటేరియట్, గుజరాత్, కర్ణాటక అసెంబ్లీలతోపాటు అనేక ప్రముఖ హోటల్స్‌కు కూడా ఈ డోమ్‌లు ఉన్నాయి. ఇవేవీ తెలుసుకోకుండా మూర్ఖంగా కూల్చుతామని ప్రకటించడమంటే ప్రజల మనసులో మూర్ఖులుగా మిగిలిపోవడం తప్ప మరోటి కాదు.
కులమతాలకు అతీతంగా కవుల సృజనను, శిల్పుల పనితనాన్ని, కట్టడాలను, కళాఖండాలను ఆదరించింది హైదరాబాద్ విస్తృతంగా తెలంగాణ గడ్డ. దక్కనీ ఆత్మకు ఏకాత్మ హైదరాబాద్. భాగమతి అందెల రవళిలో తన్మయించినదీ నేల. ఈ సజీవ సంస్కృతిని భగ్నం చేయడానికి కుట్రలు నడుస్తున్నయి. ఈ కుట్రలు మనిషిని మతం మత్తులో దించి ఇక్కడి గొప్పతనాలకు, మానవత్వాలకు మంటల రంగులద్దుతాయి. తెలంగాణ స్వయం పాలనలో కుదురుకుంటున్న సమయాన, నిన్నటిదాకా లేని ఒక కొత్త సామాజిక సమస్య మత విద్వేషం రూపంలో ముందుకు వస్తున్నది. సామరస్యంతో జీవిస్తున్న మనుషుల నడుమ మత చిచ్చును రగిల్చే కుట్రలు జరుగుతున్నాయి. ఈ సమయంలో సామాజిక బాధ్యత కలిగి, ఉద్యమ చరిత కలిగిన తెలంగాణ బిడ్డలందరూ అప్రమత్తంగా ఉండాలి.
– అవనిశ్రీ
99854 19424