2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ఆకాంక్షిస్తూ ‘రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్’ (సంస్కరించు, ఆచరించు, పరివర్తన చెందు) అంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అయితే, స్లోగన్ (నినాదం)ను ఇవ్వడం వేరు. వాటిని ఆచరణాత్మకంగా యాక్షన్‌లోకి తీసుకురావడం వేరు. ‘లక్షల స్టార్టప్‌లను ప్రారంభించాం’ అంటూ రాజకీయ నాయకులు ప్రచారం చేసుకొంటున్నారు. అయితే, అందులో 90 శాతం స్టార్టప్ కంపెనీలు ఫెయిలవుతున్నాయి. వీటన్నింటిపై సమగ్ర చర్చ జరగాలని ప్రఖ్యాత ఆర్థికవేత్త మోంటెక్‌సింగ్ అహ్లువాలియా సూచిస్తున్నారు. హైదరాబాద్‌లో గత నెల 31న జరిగిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్మారక సభలో ఆయన కీలక ప్రసంగం చేశారు. ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే..
దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేండ్లు నిండే నాటికి అంటే 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలని పాలకులు లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఇది జరుగాలంటే జీడీపీ వృద్ధిరేటు ప్రతీ ఏడాది కనీసం 8 శాతంగా నమోదవ్వాలని కొందరు చెప్తున్నారు. ప్రస్తుతం మనం 2025-26లో ఉన్నాం. రానున్న 22 ఏండ్లపాటు ప్రతీ ఏడాది వృద్ధిరేటు 8 శాతంగా నమోదు అవుతుందని చెప్పలేం. దేశ ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉంటుందని ఊహించవద్దు. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల వృద్ధి రేటుపై అగ్రరాజ్యాల్లో జరిగే రాజకీయ పరిణామాలు, దౌత్య సంబంధాలు ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. కాబట్టి వచ్చే ఐదారేండ్లలో దేశ వృద్ధి రేటు 9 శాతం ఆపైన నమోదైతే.. ఆ తర్వాత కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురై వృద్ధి రేటు 7 శాతానికి పడిపోయినప్పటికీ, లక్ష్యాన్ని చేరే ప్రయాణంలో పెద్దగా సమస్యలు ఎదురవ్వవు. ఆ దిశగా మనం కార్యాచరణను సిద్ధం చేసుకోవాలి.
అప్పటి పరిస్థితులు లేవు
2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ఆకాంక్షిస్తూ ‘రీఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్’ (స్ంకరించు, ఆచరించు, పరివర్తన చెందు) అంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అయితే, ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. స్లోగన్స్‌ను ఇవ్వడం వేరు. వాటిని ఆచరణాత్మకంగా యాక్షన్‌లోకి తీసుకురావడం వేరు. ఈ విషయంపై చర్చ జరుగాలని నేను గట్టిగా కోరుకొంటాను. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేసుకొందాం. 1991లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకొచ్చిన సంస్కరణలు దేశ ఆర్థిక స్థితిగతులను గొప్ప మలుపు తిప్పాయి. అయితే, అప్పుడు మన దేశ వృద్ధి రేటు ఒకటి లేదా ఒకటిన్నర శాతమే. ఇప్పుడు వృద్ధి రేటు 8 శాతంగా ఉన్నది. అయినప్పటికీ, దేశంలో పరిస్థితులు అంత గొప్పగా లేవు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అందరం గమనించాలి. 1991లో ప్రపంచ పరిస్థితులు వేరు. ఇప్పుడున్న పరిస్థితులు వేరు. 1991లో ప్రపంచ ఆర్థిక విపణి తలుపులు తెరుచుకొని ఉన్నాయి. ఇప్పటిలాగా ‘మా దేశమే ఫస్ట్’ అన్న భావనను ఏ దేశమూ వ్యక్తం చేయలేదు. దీంతో గ్లోబల్ మార్కెట్లో ప్రవేశించాలనుకొన్న ఏ దేశానికీ సమస్యలు ఎదురుకాలేదు. దీంతో సంస్కరణ ఫలాలు దక్కాయి. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అమెరికా ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నది. ఇలాంటి సమయంలో మనం ఆచితూచి వ్యవహరించాలి.
చైనాలా మనం సవాల్ చేయలేం
భవిష్యత్తులో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే మొదటిది.. ప్రపంచ దేశాలతో వాణిజ్య సంబంధాలను మరింత మెరుగుపరుచుకోవాలి. ముఖ్యంగా అమెరికా వంటి దేశాలతో మనకు మంచి సంబంధాలు ఉండటం ఎంతో అవసరం. అమెరికాను సవాల్ చేస్తూ చైనా దూసుకుపోతున్నది. ఆర్థికంగా, సైనిక పరంగా, సాంకేతికపరంగా ఆ దేశం ఎంతో ముందున్నది. ఒక విధంగా ఆ దేశం స్వయంసమృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నది.
అందుకే, అమెరికా సహా ఏ దేశాన్నీ చైనా లెక్క చేయట్లేదు.
అయితే, చైనా మాదిరిగా మనం కూడా అమెరికాను బెదిరించే స్థితిలో ఇప్పుడు లేము. అంతటి శక్తి కూడా మనకు ఇప్పుడు లేదు. ఈ క్రమంలోనే అమెరికాతో మనం చర్చలతోనే పరిష్కార మార్గాలను వెదకాల్సి ఉంటుంది. నేను చెప్తున్న సలహాలు కొందరికి సరైనవిగా అనిపించకపోవచ్చు.
‘అమెరికా వంటి అవకాశవాద దేశాలతో చర్చలేంటి?’ అని కొందరు ప్రశ్నించవచ్చు. అయితే, దేశ ప్రయోజనాల కోసం
చర్చలు చేయాల్సిందే.
‘అమెరికన్లు సరైన పనే చేస్తారు. అయితే, అన్ని అవకాశాలను ప్రయత్నించి విఫలమైన తర్వాతే చివరకు ఆ సరైన పని చేస్తారు’ అంటూ యూకే మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్ ఒక సందర్భంలో అన్నారు. ఇప్పుడు అమెరికా అదే చేస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఆసియా-పసిఫిక్ దేశాల నుంచి సహాకారం ఎంతో అవసరం. అందుకే కాంప్రహెన్సివ్ అండ్ ప్రొగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్-పసిఫిక్ పార్ట్నర్షిప్ (సీపీటీపీపీ)లో భారత్ భాగస్వామిగా చేరడం మంచిది.
సాంకేతికతే సాధనం
భవిష్యత్తులో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారడానికి సాంకేతిక విప్లవం కూడా కీలకపాత్ర పోషిస్తుంది. 1991 నుంచి సాంకేతిక రంగంలో పెనుమార్పులు చోటు చేసుకొంటున్నాయి. ఉదాహరణకు.. 10 కోట్ల మంది కస్టమర్లను చేరుకోవడానికి ఆటోమొబైల్ సెక్టార్‌కు 20 ఏండ్లు పట్టింది. టీవీల విషయంలో పదేండ్లు మాత్రమే పట్టింది. ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీకి ఇది కేవలం మూడు రోజు ల్లో సాధ్యమైంది. ఇక, ఏఐ విప్లవంతో సాధారణ కోడింగ్, నైపుణ్యం అంతగా అవసరపడని రంగాల్లోని ఉద్యోగాలపై ప్రభావం ఉంటుందనే చెప్పాలి. దీంతో కొందరు ఉద్యోగాలు కోల్పోతారు. అయితే, కొత్త సాంకేతికతతో ఉద్యోగాలు పోతాయని.. దాన్ని అందిపుచ్చుకోవడం మానేస్తే, మిగతా దేశాలు మనల్ని దాటుకొని ముందుకు వెళ్లిపోవచ్చు. దీంతో గ్లోబల్ మార్కెట్లో వెనుకబడిపోతాం. కాబట్టి, కొత్త ఉద్యోగాల సృష్టిని ఎప్పటికప్పుడూ చేపడుతూ.. సాంకేతికతను అందిపుచ్చుకొంటూ ఉండాలి.
స్టార్టప్‌లు ఫెయిల్
యూనివర్సిటీల్లో చదువు పూర్తి చేసుకొన్న ఎంతోమంది యువతీ, యువకులను నేను ‘ఏం చేస్తారని’ ప్రశ్నించా. స్టార్టప్ కంపెనీ పెడుతామని వాళ్లు సమాధానమిస్తున్నారు. ఇక్కడే ఒక కఠోర వాస్తవం దాగి ఉంది. దేశంలో ప్రారంభమవుతున్న స్టార్టప్ కంపెనీల్లో 90 శాతం ఫెయిలవుతున్నాయి. 2 లక్షల స్టార్టప్ కంపెనీలు మొదలైతే, మూడేండ్లపాటు కార్యకలాపాలు సాగించినవి 40 వేలు కూడా ఉండటం లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ‘లక్షల స్టార్టప్‌లను ప్రారంభించాం’ అంటూ రాజకీయ నాయకులు ప్రచారం చేసుకొంటున్నారు. అయితే, అందులో ఎన్ని విజయవంతమయ్యాయి? ఎన్ని కొనసాగుతున్నాయి? అనే విషయాన్ని చర్చించాలి. స్టార్టప్‌లు మూసివేసే పరిస్థితులు ఇలాగే కొనసాగితే, యువ పారిశ్రామికవేత్తల కొరతే కాదు నిరుద్యోగం కూడా అంతకంతకూ పెరుగుతూపోతుంది.
చార్జీలు పెంచుతామంటే ఎలా?
భూ తాపం పెరుగుతున్న నేపథ్యంలో పర్యావరణహిత ఇంధన వనరులపై దేశాలన్నీ దృష్టి సారించాయి. అయితే, పర్యావరణ పరిరక్షణ కోసం వెచ్చించాల్సిన నిధులు అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో కొన్ని దేశాలు కాలుష్య కట్టడి చర్యలను వదిలేయడం ఆందోళనకరంగా మారింది.
కరెంట్ ఛార్జీల పెంపుపై రాజకీయ పార్టీలది తలో వాదన. అయితే, పర్యావరణహిత శక్తి. వనరులపై దృష్టి సారించినప్పుడు సోలార్ పవర్‌పై చర్చ వస్తుంది. బొగ్గు ఆధారిత విద్యుత్తుకు వసూలు చేస్తున్న చార్జీలనే.. సోలార్ పవర్ చార్జీలకు వసూలు చేస్తామంటే కుదరదు. సోలార్ సెల్స్ ఇన్స్టాలేషన్ పెద్ద ఖర్చుతో కూడుకొన్న పని. మరి, ఈ భారాన్ని ఎవరు మోయాలి?
ఉదాహరణకు.. చైనానే చూడండి. గ్లోబల్ డిమాండ్‌కు రెట్టింపు సోలార్ సెల్స్ ఆ దేశం దగ్గర ఉన్నాయి. దీన్ని మనం అందిపుచ్చుకోవాలి. దేశీయంగా విద్యుత్తు చార్జీలు పెంచకుండా సబ్సిడీ విద్యుత్తును సరఫరా చేయాలన్నా.. పర్యావరణహిత విద్యుత్తును అందించాలన్నా ఇప్పటికే రెడీగా ఉన్న సోలార్ సెల్స్‌ను మనం వాడుకోవాలి. లేదూ.. ‘ఆత్మనిర్భరత’ అంటూ కొత్తగా మనం సోలార్ సెల్స్ తయారుచేసి, విద్యుత్తు చార్జీల్లో సోలార్ సెల్స్ చార్జీ అంటూ 60 శాతం ఎక్కువ చార్జీలను వసూలు చేస్తే, వ్యతిరేకత వస్తుంది. గ్లోబల్ మార్కెట్ రేట్ల కంటే ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నారని కంపెనీలు కూడా నిరసనలు తెలిపే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి విషయాలను నీతి ఆయోగ్ వంటి మేధో సంస్థలు, సామాన్యులు చర్చించాలి.
ఎఫ్‌డీఐలు రావట్లే
దేశాభివృద్ధికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులూ (ఎఫ్‌డీఐ) ముఖ్యమే. ప్రస్తుతం దేశం నుంచి ఎఫ్‌డీఐలు బయటకు తరలిపోతున్నాయి. దేశంలోకి విదేశీ పెట్టుబడులు రాకపోవడానికి మన విధానాలే కారణమని కొందరు అంటున్నారు. అదే నిజమైతే, ఆ పాలసీల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నది. విదేశీ పెట్టుబడుల కోసం మనం పాలసీ సవరణలకు పూనుకోకపోతే, వాళ్లు మరో దేశంలో పెట్టుబడులు పెడతారు. ఈ విషయం గురించి పెద్దయెత్తున చర్చ జరుగాల్సిన అవసరం ఉన్నది. దేశం ఆర్థిక ప్రగతి సాధించాలంటే స్థూల ఆర్థిక సమతౌల్యం ముఖ్యం. 1991నాటి పరిస్థితులకైనా, ప్రస్తుత పరిస్థితులకైనా ఈ సూత్రం వర్తిస్తుంది. ద్రవ్యలోటు పెరిగిందంటే ఏదో తప్పుగా జరుగుతున్నట్టు అర్థం చేసుకోవాలి. ద్రవ్యలోటుతో పెట్టుబడులు మందగిస్తాయి. రూపాయి విలువ పడిపోతుంది. ప్రస్తుతం దేశంలో ద్రవ్యలోటు చాలా ఎక్కువగా ఉన్నది. దీన్ని తగ్గించాలి. ద్రవ్యలోటు 5.6 శాతంగా ఉన్నదని అంటున్నారు. దీన్ని 3.5 శాతానికి తగ్గించాల్సిన అవసరం ఉన్నది.
వీటిని పెంచాల్సిందేగా
కేంద్రంతో పాటు రాష్ర్టాల ద్రవ్య లోటును ఒక శాతం తగ్గించాల్సిన అవసరం ఇప్పుడు ఉన్నది. ద్రవ్యలోటు తగ్గింపుపై దృష్టి సారిస్తుంటే, నిధుల కేటాయింపునకు సంబంధించి కొన్ని కొత్త డిమాండ్లు తెరమీదకు రావొచ్చు. ఉదాహరణకు.. మన జీడీపీతో పోలిస్తే, రక్షణ రంగానికి కేటాయింపులు 2 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వచ్చే ఐదేండ్లలో ఇది కనీసం 3 శాతానికి చేరుకోవాలి. విద్య, వైద్యం, పరిశోధన & అభివృద్ధి , మౌలిక వసతుల ప్రాజెక్టులకూ తగినన్ని కేటాయింపులు జరుగట్లేదు. ద్రవ్యలోటుతో పాటు ఇవన్నీ కలుపుకొంటే జీడీపీలో 8 శాతం నిధులను అదనంగా వీటికి కేటాయించాల్సి వస్తుంది. భవిష్యత్తులో పన్నుల పెంపు ద్వారా ఒకటీ అరా శాతం మేర ఈ అంతరాన్ని పూడ్చవచ్చేమో గానీ, మిగతా 7 శాతం నిధులను ఎక్కడినుంచైనా సేకరించాల్సిందే. లేకపోతే, ఆయా కీలక రంగాలకు నిధుల్లో కోత పెట్టాల్సిందే. దీనిపై కేంద్రంతో పాటు రాష్ర్టాలు కూడా పెద్దయెత్తున చర్చ చేపట్టాల్సిన అవసరం ఉంది.
ఉచితాలతో నష్టమే
ప్రస్తుతం రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకొనేందుకు పోటాపోటీగా ఉచిత పథకాలను ప్రకటిస్తున్నాయి. ఉచితాలకు నిధులు వెచ్చిస్తూ పోతే, ఇక అభివృద్ధికి స్థానం ఎక్కడ ఉంటుంది? ఈ విధానానికి చెక్ పెట్టకపోతే దేశాభివృద్ధి సాధ్యం కాదు. వృద్ధి లేని చోట ఉపాధి అవకాశాలు ఉండవు. దీంతో సామాజిక సమస్యలు పెరుగుతాయి. భారతాభివృద్ధికి సంస్కరణలు తీసుకురావాలని యోచిస్తున్న పాలకులు ఇవన్నీ గుర్తుంచుకోవాలి. దీన్ని ఓ ఎజెండాగా తీసుకొని పెద్దయెత్తున చర్చించాల్సిన అవసరం ఉన్నది. పై ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు లేవు. అయితే, పీవీ-మన్మోహన్ కాలంలో ఎదురైన సంక్షోభ పరిస్థితుల కంటే ఇప్పుడు క్లిష్టమైన సవాళ్లు దేశం ముందు ఎన్నో ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా పరిష్కరిస్తూ వెళ్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది.
(అనువాదం : కడవేర్గు రాజశేఖర్)