మానవజాతి చరిత్రలో జరిగిన విముక్తి పోరాటాలన్నింటికీ కారణాలు రెండే రెండు. ఒకటి అస్తిత్వ ఆకాంక్ష. రెండవది ఆత్మగౌరవ ఆకాంక్ష. అస్తిత్వ ఆకాంక్ష స్వాతంత్య్ర ఉద్యమానికి దారితీస్తే, ఆత్మగౌరవ ఆకాంక్ష తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది. వలసవాదులెప్పుడూ ప్రజల భాష, సంస్కృతి మీద దాడి చేస్తారు. అది ఆంధ్రావాళ్ళైనా లేక ఆంగ్లేయులైనా. సీత శోకం లంకా దహనానికి దారి తీసినట్లు, ద్రౌపది వస్ర్తాపహరణం కురుక్షేత్ర యుద్ధానికి నాంది అయినట్లు, తెలంగాణ ప్రజల యాస, భాషా సంస్కృతుల అవమాన ఫలితమే తెలంగాణ ఉద్యమానికి కారణమైంది.
కాలం గాయాల్ని మాన్పితే, చరిత్ర గాయాల్ని కెలుకుతుంది. చరిత్ర కెలికిన ఆ గాయాల్లోంచి ఉద్యమ తరంగమై ఉద్భవించిన నాయకుడు కేసీఆర్. తెలంగాణవాదం, తెలంగాణ నినాదం శూన్యంలో వేలాడుతున్నప్పుడు 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఉద్యమ పార్టీని స్థాపించి, దానికి రాజకీయ స్వరూపమిచ్చి, మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్వీకారం చుట్టిన నాయకుడు కేసీఆర్. కవుల కలం కష్టంతో, విద్యార్థి, యువకుల ఆత్మ బలిదానాలతో, ప్రజల సుదీర్ఘ పోరాటాలు, త్యాగాలతో, చివరికి ‘తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో’, ‘తెలంగాణ జైత్రయాత్రనా! కేసీఆర్ శవయాత్రనా!’ అంటూ కేసీఆర్ గారు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షతో మనం తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. రాష్ట్ర సాధనతో తెలంగాణ ప్రజలమైన మనం రాజకీయంగా, భౌగోళికంగా విముక్తులమైనాం. కానీ ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఇంకా మనం అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత మిగిలి ఉంది.
ఆకులు రాల్చుకున్న అడవి శిశిరం తరువాత కొత్త చిగురులు తొడగాలి. అది ప్రకృతి ధర్మం. నేలకొరిగిన వీరుల మరణాల ఫలంగా లభించిన విజయం తరువాత శాంతి పూలు పూయాలి. ప్రగతి ఫలాలు పండాలి. ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలి. ఇది యుద్ధాన్ని నడిపించి, గెలిపించిన నాయకుడి కర్తవ్యం. ఆ కర్తవ్య ప్రబోధంలోంచి.. ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసం వినియోగిస్తూ, ప్రజలిచ్చిన డబ్బును ప్రజల కోసం ఖర్చు చేస్తూ, ప్రజలే కేంద్రంగా, ప్రజాసమస్యలే ఇతివృత్తంగా సుపరిపాలన గావిస్తూ, తాను కలగన్న తెలంగాణను కాలంతో పోటీ పడి పునర్నిర్మాణం గావిస్తున్నాడు సీఎం కేసీఆర్.
అధికారంలోకి వచ్చి రెండు టర్మ్లైనా పూర్తి కాకుండానే అభివృద్ధి సంక్షేమంలో సాధించిన విప్లవాత్మక విజయాలు, విధ్వంసమైన తెలంగాణను విముక్తి వైపు పరుగులు తీయిస్తున్నాయి. పరాధీనత నుంచి స్వయంపాలన వైపు సాగిన సుదీర్ఘ పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ పోషించిన గణనీయమైన పాత్ర చరిత్రలో నమోదైంది. సకల జనుల వికాసం, సాంకేతిక ప్రగతి, విద్య, ఆరోగ్యం, శాంతియుత సహజీవన వాతావరణం, రాజకీయ సుస్థిరత, వేగవంతమైన అభివృద్ధి, సంక్షేమం, వినూత్న ఆలోచనలు కలిగిన నాయకుని విశ్రాంతి లేని శ్రమ ఫలితంగా సాధించుకున్న విజయాలు.. శిథిలాల్లోంచి చిగురించిన చిరుమొలకలా ఆరంభమై, నేడు వటవృక్షమై తెలంగాణ అంతటా విస్తరించాయి. వీటిని పది కాలాలపాటు కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంటుంది.
ప్రజల్లో గందరగోళం సృష్టించి, పచ్చి అబద్ధాలను ప్రచారం చేసి, వాస్తవాలను వక్రీకరించి, కులాలు, మతాలు, వర్గాల పేరుతో చిచ్చు పెట్టి, అమాయక ప్రజలను రెచ్చగొట్టి, అధికార లాలసతో అసత్యాలపై ఆధారపడుతూ, అభివృద్ధిని కూడా అడ్డుకోవడానికి అడ్డదారులు తొక్కేవాళ్లు మన పక్కనే పొంచి ఉంటారు. ఇలాంటి సందర్భాల్లోనే నాయకుని విజన్‌ను, పార్టీ విధానాలను, అమలవుతున్న పథకాలను, సాధించిన ప్రగతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయి సరియైన పద్ధతిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత, అవసరం ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తపై ఉంటుంది. అప్పుడే తెలంగాణ రాష్ట్ర విజయాల సాఫల్యతకు, భవిష్యత్తులో వాటి కొనసాగింపునకు అవకాశం ఉంటుంది.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
-నారదాసు లక్ష్మణ్ రావు