మానవ మనుగడకు కావాల్సినవి ప్రధానంగా గాలి, నీరు.సకల జీవకోటికి ప్రాణాధారమైన నీటి కోసం దేశాలు, రాష్ర్టాలు, ప్రాంతాల మధ్య యుద్ధాలూ జరుగుతున్నాయి. ఆ నీటి కోసం జరిగిన ఉద్యమ ఫలితంగానే తెలంగాణ ఏర్పడింది.
తెలంగాణ చరిత్రను ఒకసారి పరికించి చూస్తే నాడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దుర్భరంగా ఉండే ది. ఒకవైపు కులవృత్తులు కనుమరుగైపోయి, మరోవైపు నీటి వసతి లేక రైతులు కరువు కోరల్లో చిక్కుకున్నారు. ఆకలి కేకలతో తెలంగాణలో బతుకలేక, చావలేక ఎన్నో కుటుంబాలు వలసెల్లిపోయాయి. కొంతమంది రైతులు ఉన్న ఊరిని, కన్న తల్లిని విడిచిపోలేక ఎడాపెడా బోర్లు వేసి అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఒకప్పుడు తెలంగాణ అంటేనే కరువు.. రైతు ఆత్మహత్యలు.. వలసలకు కేరాఫ్ అడ్రస్. అలాంటి తెలంగాణ రూపురేఖలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో పూర్తిగా మారిపోయాయి. నేడు చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భూగర్భ జలాలు పెరిగాయి. ఇదంతా కాళేశ్వరం పుణ్యం కాదా!
తెలంగాణలో నేటికీ మెజారిటీ ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయానికి మూలమైన నీటి కోసం ఒక భారీ ప్రాజెక్టు నిర్మించడం తప్పా? అయినా తెలంగాణ ఉద్యమ నేపథ్యమే నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ నీళ్ల సమస్య స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి తెలంగాణకు జీవన్మరణ సమస్యలా తయారైంది. అలాంటి సమస్యను కేసీఆర్ తరిమికొట్టారు. తెలంగాణ ఏర్పాటుతో మన నిధులు మనకు దక్కాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో నీళ్లూ దక్కాయి. అయితే, ఈ ప్రాజెక్టుపై మొదటినుంచీ కొందరు విష ప్రచారం చేస్తుండటం హేయం.
సాధారణంగా నీరు ఎక్కువగా ఎక్కడైతే లభ్యమవుతుందో అక్కడే ప్రాజెక్టులు నిర్మిస్తారు. నది జన్మస్థానం నుంచి ఎంత కిందికి వెళ్తే అంత నీటి లభ్యత ఉంటుందనేది జగమెరిగిన సత్యం. జన్మస్థానం నుంచి నది కిందికి పయనించే కొద్ది ప్రవాహ మార్గంలో ఉపనదులు, వాగులు, వంకలు, కాలువలు, పాయలు కలుస్తుంటాయి. అందుకే డిజైన్‌ను మార్చి, ప్రస్తుత ప్రాంతంలో ప్రాజెక్టును కట్టాల్సి వచ్చింది.
ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కాస్ట్ బెనిఫిట్ రేషియో గురించి చూద్దాం. ఈ కాస్ట్ బెనిఫిట్ రేషియోను అసలు ఎలా చూడాలి? అసలు ఏ రంగంలో చూడాలి? మానవాళికి తాగునీరు అందించే విషయంలో చూడాలా? లేదా మానవ మనుగడకు అవసరమైన ఆహారాన్ని అందించే వ్యవసాయరంగానికి కావలసిన నీళ్లను ఇవ్వడంలో చూడాలా? పారిశ్రామికరంగానికి నీళ్లను అందించి, ఉద్యోగాలు కల్పించినందుకు చూడాలా? అసలు ఏ రంగంలో చూడాలి? ఈ విషయమై మేధావులకు అవగాహన లేకపోతే ఎలా?
ఇంకా నేడు కొంతమంది కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారు. అదేమిటంటే.. ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్టయితే నేడు పంపుసెట్లు ఎందుకు పెరిగాయని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో పంపుసెట్లు గతంలో కంటే పెరిగాయనేది వాస్తవం. దానికి ప్రధాన కారణం భూగర్భజలాల పెరుగుదల, నాణ్యమైన విద్యుత్తు సరఫరా. భూగర్భజలాలు పెరగడానికి ప్రధాన కారణం కాళేశ్వరం. మరొక ప్రశ్న ఏమంటే.. గత ఖరీఫ్ సీజన్లో కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వాడకపోయినా రికార్డు స్థాయిలో వడ్లు పండాయని చెప్తున్నారు. అదే రికార్డు పంట గత రబీ సీజన్లో ఎందుకు పండలేదు. ఎందుకంటే, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను ఖరీఫ్ కంటే రబీ సీజన్లో ఎక్కువగా వాడుతాం. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే.. ఖరీఫ్‌లో వరి మాత్రమే ఎక్కువగా పండిస్తాం. అదే రబీ సీజన్లో వరితో పాటు అన్ని రకాల పంటలు పండిస్తాం. ఈ వాస్తవాలను గ్రహించాలి. ఇప్పటికైనా రాజకీయ నాయకులు, మేధావులు కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవాకులు చెవాకులు పేలడం మానుకోవాలి. అర్ధసత్యాలు వల్లె వేయడం మాని కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకు సమాయత్తం కావాలి. అప్పుడే తెలంగాణ రైతాంగానికి భవిష్యత్తు ఉంటుంది.
-అల్లెపు రాజు
73864 12601