పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాములు రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల ఉన్నాయి. గ్రానైట్, క్రషర్లు తదితర మైనింగ్ నిర్వహణకు ఉపయోగించే పేలుడు పదార్థాలను నిల్వ చేసే గోదాములపై ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడింది. ఈ నేపథ్యంలో వీటి నిర్వహణకు సంబంధించి విధివిధానాలు, నియమనిబంధనలు ప్రకటించాల్సిన అవసరం ఉన్నది.
పేలుడు పదార్థాల నిల్వ చేసే గోదాములకు అగ్నిమాపక శాఖ అనుమతులు అవసరమా? ఎలాంటి స్వభావం కలిగిన భూమిలో గోదాం ఏర్పాటు చేయాలి? ఆ గోదాం జనావాసాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు ఎంత దూరంలో ఉండాలి? నెలవారీగా అమ్మకాలకు సంబంధించిన దస్ర్తాలు నిర్వహించాలా? ఇటువంటి గోదాం విషయంలో పోలీసుల పాత్ర ఏమిటి? లైసెన్స్, అధికారుల పర్యవేక్షణ, గ్రామ పంచాయతీ తీర్మానం.. తదితర అంశాలపై స్పష్టమైన నిబంధనలను అధికారికంగా ప్రకటించాలి.
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోనూ ఇటువంటి గోదాం ఉన్నది. ఈ గోదాం జనావాసాలకు సమీపంలోనే ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీస్ స్టేషన్, రెవెన్యూ కార్యాలయానికి రెండు వందల గజాల దూరంలోనే ఉన్న ఈ గోదాం నిర్వహణ పట్ల ప్రజల్లో నెలకొన్న భయాందోళనలకు తెరదించాలి. తమకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని, నిబంధనలు పాటిస్తున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. అయినప్పటికీ జనావాసాలకు సమీపంలోనే ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నల్లబెల్లితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇటువంటి గోదాముల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించాలి. నిబంధనల మేరకు నిర్వహిస్తున్నారా? లేదా అనేది పర్యవేక్షించాలి.
– కోగిల చంద్రమౌళి