తాజాగా జరిగిన రష్యా అధ్యక్ష ఎన్నికల్లో వ్లదీమిర్ పుతిన్ విజయం అందరూ ఊహించినదే. మొదటి ఓటు బ్యాలెట్ పెట్టెలో పడకముందే విజేత ఎవరో తేలిపోయిన ఎన్నికలవి. ఇప్పటికే అధికార పీఠంపై పాతికేండ్లు పూర్తిచేసుకున్న పుతిన్ మరో ఐదేండ్లు, అంటే మొత్తమ్మీద సుమారు ముప్ఫై ఏండ్లు రష్యా అధ్యక్షునిగా కొనసాగుతారన్నమాట! ఆ విధంగా సోవియట్ నియంత జోసెఫ్ స్టాలిన్ 27 ఏండ్ల రికార్డును పుతిన్ బద్దలు కొట్టనున్నారు. నియంతృత్వంలో పుతిన్ ఆయన కన్నా ఏ మాత్రం తక్కువ కాదనేది అందరికీ తెలుసు. సహజంగానే పుతిన్ విజయంపై పశ్చిమ దేశాలు పెదవి విరిచాయి.
ప్రధాని నరేంద్ర మోదీ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ ప్రతి స్పందనలు సహజమే. రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌లో పుతిన్‌కు 88 శాతం ఓట్లు పడితే ఆయన సమీప కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి నికొలాయ్ ఖారిటొనోవ్కు 4.3 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. క్రెమ్లిన్ కనుసన్నల్లో, చెప్పుచేతల్లో జరిగిన ఎన్నికల్లో పుతిన్ కాక ఇంకెవరు గెలుస్తారు? ఎన్నికలు ఓ ప్రహసనం మాత్రమే. ఎందుకంటే క్రెమ్లిన్ ఆమోదించిన అభ్యర్థులు మాత్రమే పోటీ చేశారు. పుతిన్ విధానాలను విమర్శించేవారిని సాంకేతిక కారణాలతో ఎన్నికల బరిలోకి దిగకుండా చేశారు.
విమర్శల మాటెలా ఉన్నప్పటికీ సామాన్య రష్యా ప్రజలు పుతిన్‌ను పెద్దదిక్కుగా చూస్తున్నారనేది గమనార్హం. సోవియట్ యూనియన్ కూలిపోయినప్పుడు మొదటగా స్వతంత్రం ప్రకటించుకున్నది రష్యాయే. ఆ తర్వాత పదేండ్ల పాటు రష్యా స్తబ్దుగా ఉండేది. దేశ ఖ్యాతి, పరపతి అట్టడుగు స్థాయికి పడిపోయాయి. పశ్చిమదేశాల అవహేళనలతో అవమానకరంగా గడిచేది. కానీ పుతిన్ నాయకుడిగా ఎదిగివచ్చిన తర్వాత పరిస్థితి మారింది. దేశాన్ని ఉక్కు క్రమశిక్షణ కింద ఉంచి అభివృద్ధిలో పరుగులు పెట్టించాడు. అంతర్యుద్ధాలకు ముగింపు పలికి ఆర్థికంగా మెరుగుదల సాధించాడు. అందుకే పుతిన్‌ను రష్యాకు పూర్వవైభవాన్ని తెచ్చిన నేతగా చూస్తారంతా. సోవియట్ పతనంతో పశ్చిమ దేశాలతో కోల్పోయిన సమతూకాన్ని కొంతలో కొంతైనా తిరిగి సాధించడం పుతిన్ విజయం.
సాధారణంగా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షులు మారిపోతుంటారు. కానీ, పుతిన్ సంగతే వేరు. అధ్యక్షుని కోసం రాజ్యాంగమే మారుతూ వచ్చింది. మొదటలో నిబంధనల మేరకు అధ్యక్ష, ప్రధాని పదవులను మార్చి మార్చి చేపట్టినా, తర్వాత తన ఏకచ్ఛత్రాదిపత్యాన్ని సుస్థిరం చేసుకునేందుకు నియమాలను తారుమారు చేశారు. ఈ క్రమంలో ఆయన ఒక కరడుగట్టిన ని యంతగా మారిపోయారు. మీడియా గొంతు నొక్కి, విపక్షాలను అణగదొక్కారు. నవాల్నీ వంటి రాజకీయ ప్రత్యర్థులను మట్టుబెట్టారు. మరెందరినో జైళ్లలో పెట్టారు.
రాజ్య సంస్థలను క్రెమ్లిన్‌కు తోకలుగా మార్చారు.క్రిమియా లాంటి ప్రాంతాలను రష్యాలో కలిపేసుకుని పశ్చిమ దేశాలకు సవాల్ విసిరారు. ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వచ్చినప్పటికీ ర ష్యా ఇంకా పూర్తిగా నా చెప్పుచేతల్లోనే ఉందని చాటుకునేందుకు మరోమారు తూతూ మంత్రంగా ఎన్నికల తతంగం నడిపారు. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి రష్యా నాయకత్వాన్ని విమర్శించడం నేరమని ఎన్నికలకు ముందే చట్టం తేవడం గమనార్హం. వ్యతిరేకత అనేది అంటుకు లేకుండా చే సి, కట్టుదిట్టమైన రీతిలో నిర్వహించిన ఎన్నికల్లో పుతిన్ గెలవడంలో ఆశ్చర్యం ఏముంటుంది? రష్యా ప్రజానీకం ఏకమొత్తంగా పుతిన్‌కు అండగా నిలిచిందని ఎన్నికల అధికారులే ఆడంబరంగా ప్రకటించడం కొసమెరుపు.