మీ దుఃఖం మా దుఃఖం
మీ సంతోషమే మా సంతోషం
మనం సామూహికం ఎవరూ ఒంటరి కాదు!
మహమ్మారిని ఒంటరి చేద్దాం
తునకలు తునకలుగా విడగొట్డి
తుక్కు తుక్కు చేద్దాం ఒంటరి ఎవరూ కాదు
ఒకరికొకరం మనం!
హలో! మిత్రమా!
ఈ ఉదయమే మీ గడప ముందు
ఇడ్లీ సాంబారు సిద్ధంగా ఉంచాం
తలుపులు తీసి స్వీకరించండి
దిగులును గడప అవతలికి పంపండి
మనోబలాన్ని మించిన మందు ఏముంది
ఒంటరి ఎవరూ కాదు ఒకరికొకరం మనం!
హలో! నేస్తమా!
ఈ మధ్యాహ్నం పౌష్టికాహారం
మీ గుమ్మం ముందు మీకై సిద్ధాన్నంగా ఉంది
మెతుకు మిగలకుండా తినండి
విచారాన్ని బయటకు విసిరివేయండి
ఒంటరి ఎవరూ కాదు ఒకరికొకరం మనం!
హలో! తలుపులు తీసారా!
ఇదిగో రాత్రి భోజనం
ఆకలి లేదని పక్కకు పెట్టకండి
చీకటైందని భయపడకండి
ఇరుగుపొరుగుగా మేమంతా..
చూస్తుండగానే 14రోజుల ప్రవాసం ముగుస్తుంది
మీ ఆరోగ్యం మీకు మహాభాగ్యమౌతుంది
ఒంటరి ఎవరూ కాదు ఒకరికొకరం మనం!!
కందాళై రాఘవాచార్య
87905 93638