నిప్పులు గర్భాన దాల్చిన నేలమ్మే సూర్యోదయాన్ని కన్నట్టు, నెత్తురు, చెమట పారి పోరు పంటై ప్రభవించినట్టు, ఇసుక ఎడారిలో భవితవ్యం వికసించినట్టు గులాబీ జెండా ఆవిర్భావమే అపురూప విప్లవం కదా..! తమ నుంచి అంతా కోల్పోయిన మానవ సమూహం, మూకుమ్మడిగా తమఆశలను సైతం జమ్మిచెట్టుపైకి చేర్చి వలసెల్లి పోతూనో, లేదా ఎదురెళ్లి రాజ్యహింసకు ఒరిగిపోతూనో ఉన్న సందర్భం అది. తెలంగాణ పదమే రాజ్య నిషేధిత ఎజెండాగా మారి, దానిపై గొంతెత్తిన మనుషులనే ముక్కలుగా, సంస్థలనే శత్రువులుగా సర్కారే ఏరేస్తున్న భయానక కాలం అది.
సంఘాలు పెట్టడాన్నే రాజ్యద్రోహంగా పరిగణిస్తున్న సమయంలో తెలంగాణ కోసం ఏకంగా రాజకీయ పార్టీని ఎత్తిపట్టడమంటే హైనా ఎదుట నిలబడి నెమలి మీసం మెలేయడమే. అపారమైన వనరులు, మీడియా, కేంద్ర సర్కార్ అండదండలతో పట్టపగ్గాల్లేని అధికారోన్మాదంతో ఊరేగుతున్నది ఆనాటి చంద్రబాబు సర్కార్. అలాంటి పాశవిక ప్రభుత్వానికి ఎదురునిలబడటం, అందులోనూ వ్యతిరేకంగా రాజకీయ పోరును ప్రకటించడమెంత సాహసమో ఊహిస్తేనే ఒళ్లు జలదరించకమానదు. ఉక్కు సంకల్పం, తెలంగాణ స్వప్నం తప్ప ఏ బలవంతులు, ధనవంతుల ఆసరా లేని కేసీఆర్, ఒంటరిగా ఆనాడు దేశంలోనే శక్తివంతమైన చంద్రబాబు సర్కార్‌తో తలపడటమన్నది రాజకీయంగానే కాదు వ్యక్తిగతంగానూ ఎంత ప్రమాదకరమైన సాహసమో చరిత్రను తడిమిన మనసున్న వారెవరికైనా అర్థమైపోతుంది.
వాస్తవానికి కౌమార దశలోనే వివిధ ఉద్యమాల్లో నలిగిన తర్వాత డిగ్రీ చదువుల కోసం నిజాం కళాశాలలో చేరిన నాలాంటి మిత్రులమే కొందరం, టీఆర్ఎస్ ఆవిర్భావానికి మునుపు జరిగిన కొన్ని రాజకీయ, సామాజిక విషాదకర పరిణామాలను కొంత దగ్గరగా చూడగలిగాం. విద్యార్థి సంఘాల పోరాటాలు, భిన్న భావజాల సంఘర్షణలతో అలజడి జీవితాన్ని కొనసాగిస్తున్న సందర్భంలోనే బషీర్‌బాగ్ విద్యుత్తు ఉద్యమం, హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో వైఎస్సార్ దీక్ష, విరమణ రాజకీయం, వామపక్ష, ప్రజాసంఘాల పోరాట స్థలాల్లోనూ భాగస్వామిగా ఉండి వాటన్నింటినీ దగ్గరగా చూసి వివిధ కోణాల్లో అర్థం చేసుకోగలిగాం. డిప్యూటీ స్పీకర్‌గా ఉండిన కేసీఆర్ విద్యుత్తు ఛార్జీల పెంపుపై నాడు సంధించిన లేఖాగ్ని రగిలించిన జన దావాగ్నిపై, దానితో ఎదురులేని సర్కార్‌గా ఊరేగుతున్న చంద్రబాబు ప్రభుత్వంపై పడ్డ పొలిటికల్ పిడుగుపై అన్నివర్గాల్లో విస్తృతమైన చర్చ నడిచింది. బషీర్‌బాగ్ విద్యుత్తు కాల్పులు నిజాం కళాశాల ముందే జరిగితే, నేను నాటి ఎస్ఎఫ్ఐలో క్రియాశీల భూమిక పోషిస్తున్న ముత్యాలు తదితర మిత్రులందరం పోలీస్ లాఠీ, తూటా, టియర్ గ్యాస్దెబ్బల బాధితులను నిజాం కళాశాల గేటు లోపలికి ఎత్తుకొని వచ్చి సపర్యలు చేసి, దవాఖానలకు తరలించాం. ఇలా ఎన్నో.. బెల్లి లలిత కిరాతక హత్యను ఖండిస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాయంత్రం పూట జరిగిన ప్రజా సంఘాల సభ కన్నీటి సముద్రంగా మారింది.
అసెంబ్లీ, బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్, సుందరయ్య విజ్ఞానకేంద్రం మధ్యలో ప్రజా ఆకాంక్షల చుట్టూ పేనుతున్న వివిధ విషాద వలయాలను గమనించేవారం. ఇవన్నీ చూసిన మేము నిజాం కళాశాల హాస్టల్‌కు అడుగుల దూరంలోనే ఉన్న జలదృశ్యం ప్రాంగణంలో 2001లో జరిగిన టీఆర్ఎస్ ఆవిర్భావ సభాస్థలి చుట్టూ రెండు, మూడురోజుల ముందు నుంచే చక్కర్లు కొట్టాం. సభ ఆద్యంతం కురిసిన ఉద్రేకాన్ని, కేసీఆర్ త్యాగాల భావోద్వేగాన్ని స్వయంగా చూసిన తర్వాత ఉద్యమాలకు సంజీవని పర్వతం తోడైందనే సంపూర్ణ విశ్వాసం కలిగింది.
అందరం భావించినట్టే తొలి అడుగులోనే తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి ఉన్నతమైన రాజకీయ వివేకాన్ని జోడించి, విరోధులు ఉలిక్కిపడేలా ప్రజాబాట పట్టింది టీఆర్ఎస్. అయితే నాటికి తెలంగాణ డిమాండ్‌కు దేశంలోనే బలవంతుడైన రాజకీయ విరోధి చంద్రబాబు సర్కార్‌కు సహజంగానే కేసీఆర్ ప్రధాన శత్రువుగా మారిపోయాడు. వరంగల్‌లో తీవ్రమైన పోలీస్ నిర్భంధాన్ని ఎదుర్కొంటూ, రాజ్యం టార్గెట్‌గా మారిన కుసుమ జగదీశ్‌ను కాపాడే ఉద్దేశ్యంతో కేసీఆర్ హైదరాబాద్ తీసుకొచ్చి జలదృశ్యం కార్యాలయ పర్యవేక్షణ పనిలో పెట్టాడు. అంతకుముందే ఇతర ఉద్యమాల్లో జగదీశ్‌తో ఉన్న ఆత్మీయ బంధం దృష్ట్యా, ఉదయం నాలుగింటికే నవజవాన్ ఉటో అంటూ నిద్రలేపే కొండా లక్ష్మణ్ బాపూజీ ధాటికి తట్టుకోలేక రాత్రి కాగానే నా హాస్టల్ రూంకు వచ్చి పడుకొని ఉదయమే జగదీష్ జలదృశ్యం ఆఫీస్‌కు వెళ్లేవాడు. ఆ సందర్భంగా రెగ్యులర్‌గా ఆ ఆఫీస్‌కు వెళ్లే మాకు ఆనాడు మొగ్గ దశలోనే గులాబీ జెండాకు నిప్పుపెట్టడానికి యమకింకర సర్కార్ ఎన్ని విశ్వప్రయత్నాలు చేసేదో నాయకుల చర్చలు, పరిస్థితుల అధ్యయనం వల్ల తెలిసేది. పార్టీ, కేసీఆర్ అకౌంట్లలో నకిలీ కరెన్సీ జమచేసే ప్రయత్నం చేసి అక్రమ కేసుల్లో ఇరికించాలని, ఉద్యమంలోకి వచ్చిన ఒకరిద్దరు నేతలు మళ్లీ తిరిగి రాకుండా లొంగదీసుకుంటూ, కేసీఆర్ ఇంటి చుట్టూ, ఆఫీస్ నలువైపులా, అడుగు బయటపెడితే అడుగడుగునా నిఘావ్యవస్థ గద్దల్లా సంచరించేది అందరికీ తెలిసిపోయేది.
కుదిరితే రోడ్డు ప్రమాదం రూపంలోనో మరే ఇతర కుయుక్తుల ద్వారానో కేసీఆర్‌ను కూడా భౌతికంగా అడ్డుతొలగించుకోవాలనే విశ్వప్రయత్నాలను సైతం ఆనాటి గండరగండులు తీవ్రంగా చేస్తున్నారనే విషయం సైతం చర్చలో ఉండేది. అయితే గులాబీ జెండా ఎగరేయకముందే, ఏడాదికి పైగా భిన్నకోణాల్లో తెలంగాణ డిమాండ్‌ను, వాస్తవ భౌతిక పరిస్థితులను, దేశ, అంతర్జాతీయ రాజకీయ, సామాజిక పోరాటాలను, వాటి పట్ల సర్కార్ల దమననీతిని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన కేసీఆర్, అన్ని త్యాగాలకు సిద్ధపడే తెలంగాణ సాధన సమరంలోకి దూకడం వల్ల విరోధులను విష వ్యూహాలను ఎదుర్కోగలిగాడు. కేసీఆర్ కాబట్టి నిలదొక్కుకొని, రాజకీయ పార్టీని, ఉద్యమ పంథాను ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు నడిపించగలిగాడు కానీ, మరో నేత ఎవరైనా కిరాతక సర్కార్ వలలో సులభంగా పడి కనుమరుగైపోయేవాడే.
ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ను నీటిలో చేపలా ప్రజల్లో మమేకం చేసేందుకు కేసీఆర్ పడ్డ కష్టం, చేసిన సాహసాలు, త్యాగాలు, వ్యూహాలు బహుశా దేశంలో మరే ఇతర పార్టీగాని, నేతలు గాని చేసి ఉండరు. టీఆర్ఎస్ పుట్టకముందే పలుమార్లు దెబ్బతిని ఆత్మన్యూనతతో, ఎవరినీ నమ్మలేని అనుమానంతో తెలంగాణ సమాజం సతమతమవుతున్న సంధి కాలమది.
విశ్వాసం సన్నగిల్లిపోయిన సమాజం ఒకవైపు, దుర్భేద్యమైన, సకల వనరులతో ఎదుర్కోవలిసిన వెయ్యి తలల తెలంగాణ విరోధి మరోవైపు. ఇలా విచిత్రమైన పద్మవ్యూహంలో నిలబడి కేసీఆర్ ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, అమలుచేశారు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్ సహా ఈ ఐదు దశాబ్దాల్లో దేశంలో జరిగిన ఏ ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి ఎదురవ్వని, అక్కడి నాయకత్వం కలలో కూడా ఊహించని సంక్లిష్టమైన పరిస్థితులను కేసీఆర్ ఎదుర్కోవలిసి వచ్చింది. పాదయాత్రలతో నీళ్లల్లో నిప్పులు మం డించి, ధర్నాలతో తెలంగాణలో ధైర్యం వెలిగిం చి, బహిరంగ సభలతో జన సునామీలను సృ ష్టించి, రాజీనామా త్యాగాలు ధారపోసి విశ్వాసా న్ని పండించి ఇలా ఎన్నోసార్లు సీతమ్మ తల్లిలా అగ్గిలో దూకి ప్రత్యేక రాష్ట్ర పోరాట ప్రాతివత్యాన్ని కాపాడి, దేశం కళ్లు తెరిపించాడు కేసీఆర్.
చివరికి ఆమరణ దీక్షతో ప్రాణత్యాగానికీ సిద్ధపడి నలుదిక్కులా నిప్పుల వర్షం కురిసేలా చేసి, తెలంగాణ ఆవిర్భావానికి మార్గం సుగమం చేశాడు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా ఎనిమిదేండ్లలోనే అనేక అవాంతరాలను అధిగమించి తెలంగాణను విఫల రాష్ట్రం కాకుండా సర్వశక్తులు ఒడ్డి తాను శ్రమించడమే కాకుండా అన్ని స్థాయుల వ్యవస్థలనూ పరుగులు పెట్టించారు. ఈ ప్రయాణం ఎంత భీతావహమో కదా? ఎత్తుకున్న తెలంగాణపై ఎంత ప్రేమ ఉంటే కత్తుల వంతెనపై నడువగలరు? టీఆర్ఎస్ తొలినాళ్లలో ఒకసారి ఓయూ క్యాంపస్ నుంచి కొంతమంది మిత్రులం నిర్మాణంలో ఉన్న నందినగర్ ఇంట్లో కేసీఆర్‌తో సమావేశమైన సందర్భంగా ఒక విద్యార్థి మిత్రుడు ఇదంతా సాధ్యమా సార్ అంటూ అనుమానపడ్డాడు. అంతే కేసీఆర్ ఆవేశంగా ఏందయ్యా.. మీరంతా యువకులు, అవసరమైతే ఆకాశానికి సైతం అగ్గిపెడతమనే ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ, ఇలా మాట్లాడరాదంటూ హెచ్చరించాడు. బహుశా అంతకుమించిన విశ్వాసాన్ని నిరంతరం శ్వాసించబట్టే త్యాగాల నిచ్చెనేసి తెలంగాణను అస్తిత్వ శిఖరంపై కూర్చోబెట్టగలిగారు. దానివల్లనే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభపై 20 రోజుల ముందే పల్లెల్లో భావోద్వేగం ఏర్పడింది. సహజంగా రాజకీయ పార్టీల సభలు తరలింపు, మళ్లింపు అన్నట్టుగా జరిగిపోతాయి. కానీ, ఒక రాజకీయ పార్టీ రజతోత్సవం చరిత్రలోనే ఇంతలా చర్చనీయాంశం కాలేదు. అద్వితీయమైన గతాన్ని చూసిన ప్రతివారూ మనసారా అందరిలో నెమరేసుకుంటేనే కదా నూతన తరానికి నిజాలు తెలిసేది?