సముద్రం ఒకరి కాళ్ల ముందు మోకరిల్లి కెరటమెత్తదు. శిఖరం ఒకరికి వంగి సలాం చేయదు. తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీ తాబేదారులకు, ఆ తాబేదారుల తాటాకు చప్పుళ్లకు తలొగ్గదు. పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, వెల్లువెత్తుతున్న ప్రజావ్యతిరేకత నుంచి.. పాలకుల భూమాఫియా, ‘ఫార్మా’ఫియా,‘హైడ్రా’ఫియా, సింగరేణి తదితర కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఒకటి తర్వాత మరొకటిగా గొలుసుకట్టుగా పారిస్తున్న అకృత్యాలకు మొన్న విద్యుత్తు.. నిన్న కాళేశ్వరం.. నేడు ఫోన్‌ట్యాపింగ్ పేర్లు ఏదైతేనేమి తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్నది వేధింపులస్వామ్యం. ప్రజాపాలన ముసుగులో కొనసాగుతున్న పగస్వామ్యం. కాంగ్రెస్ పాలనలో చౌకబారు రాజకీయాలకు సాక్ష్యం.. తాజాగా కేసీఆర్‌కు జారీ చేసిన సిట్ నోటీసులు అన్నది జగద్విదితం.
గతంలో జస్టిస్ ఘోస్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక అసెంబ్లీకి చేరింది. సభలో కాంగ్రెస్ పక్షం ఢాం..ఢూం అంటూ చిందులు తొక్కింది. కానీ, కొసాకరికి ఏమి తేలింది? అంతా ఉత్తదేనని స్పష్టమైంది. గతంలో విద్యుత్తు కొనుగోళ్లలో అక్రమాలు అంటూ జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డితో కమిషన్ వేశారు. ఆ కమిషన్ అసలు విషయాన్ని పక్కనపెట్టి ‘నిర్దేశిత లీకులు’ ఇచ్చి అభాసుపాలైంది. దీంతో జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి విచారణకు అసలు అర్హుడే కాదని సుప్రీంకోర్టు తేలుస్తుందనే విషయం గ్రహించి ఆ విచారణ నుంచి ఆయన తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. తెలంగాణ మొత్తం కేసీఆర్ వెంటే ఉన్నది. కేసీఆర్‌ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే. స్వరాష్ట్రాన్ని సాధించి, తెలంగాణను దేశానికి దిక్సూచిగా నిలిపిన ధీశాలి.. ధిక్కార పిడికిలి కేసీఆర్. సమైక్య పాలనలో ఆరు దశాబ్దాలపాటు తెలంగాణపై యథేచ్ఛగా సాగిన దోపిడీకి తిరిగి ద్వారాలు తెరవాలంటే అందుకు అడ్డుగా ఉన్న కేసీఆర్‌ను, బీఆర్ఎస్ను కకావికలం చేస్తేకానీ సాధ్యంకాదని నిర్ధారించుకున్న తర్వాత తెలంగాణలో అసత్య పునాదులపై కుట్రల భవంతుల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. గురువు ఆదేశం.. శిష్యుని ఆచరణ, బడేభాయ్ హుకుం.. చోటేభాయ్ ‘జీ హుజూర్’గా సర్వవిధాల తెలంగాణను తమ గుప్పిట పెట్టుకోవాలనే ఎత్తుగడలో భాగంగానే ఒక్కొక్కటిగా పరిణామాలు పురికడుతున్నాయని తెలంగాణలో ప్రతి ఒక్కరికీ తెలిసిపోతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజల నోట్లో మట్టి కొట్టి, ఇచ్చిన హామీల అమల్లో విఫలమైంది. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ మోసాలు తెరమీదికి వచ్చినప్పుడల్లా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రదర్శిస్తున్న టక్కుటమార విద్యల్లో భాగమే విచారణల పేరుతో కేసీఆర్‌కు నోటీసులు. తమకు అవసరమైన ప్రతీసందర్భంలో తాము చేసిన పనులకు ప్రజల దగ్గరి నుంచి మద్దతు రాదని తెలుసుకున్న ప్రతీసారి కాంగ్రెస్ పాలకులు తమకు ఆపద్ధర్మంగా ఎంచుకున్న మార్గమే నోటీసులు, విచారణలు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తక్షణం మెడమీద కత్తిలా వేలాడుతున్నది మున్సిపల్ ఎన్నికలు. నిన్నమొన్నటి గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కార్ సర్వపటాలం కాలికి బలపం కట్టుకొని తిరిగినా బీఆర్ఎస్ 40-45 శాతం సర్పంచ్‌లను గెల్చుకున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార బలం ఉపయోగించినా ప్రజలు అటువైపు మొగ్గుచూపలేదు. పంచాయతీ ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజావ్యతిరేకత స్థాయిలో ఉన్నదో బహిర్గతం కావడంతో కాంగ్రెస్ పార్టీ కంగుతిన్నది.
కిందపడ్డా తమదే పైచేయి అన్నట్టుగా
పంచాయతీ ఎన్నికల్లో పరాభవానికి గురై చతికిల పడ్డా.. కాంగ్రెస్ పెద్దలు తామే విజయం సాధించాం అంటూ మీడియా సమావేశం పెట్టి మరీ డప్పుకొట్టుకున్నారు. అయితే, ఆ మీడియా సమావేశంలోనే ‘నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరించింది’ అన్నట్టు ఒక్క నేత ముఖంలో కూడా నెత్తురుచుక్క లేనితనాన్ని తెలంగాణ సమాజం గ్రహించింది. అందుకే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను వాయిదావేశారని వేరే చెప్పాల్సిన పనిలేదు.
ఇక ఎట్టకేలకు అనివార్యమైన పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయాల్సి వచ్చింది. ఈ ఎన్నికలు పార్టీ గుర్తుతో జరుగుతాయి. పురపోరులో బీఆర్ఎస్ ధాటిని తట్టుకోవడం కాంగ్రెస్‌కు అసాధ్యం. కాబట్టి ఆ పార్టీ శ్రేణులను నిలువరించడానికి కుట్రలు ముమ్మరం చేశారు. సిట్ నోటీసులు, విచారణ పేరుతో జిమ్మిక్కులు చేస్తున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల వేళ డైవర్షన్ రాజకీయాలను డైలీ సీరియల్లా నడిపితే తప్ప బీఆర్ఎస్ను నిలువరించలేమని కాంగ్రెస్ భావించింది. మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌కు వరుసగా నోటీసులు ఇచ్చి, విచారణ జరిపింది. అయినా కాంగ్రెస్ నేతలు ఆశించిన స్థాయిలో మైలేజ్ రాలేదు. ఇక కేసీఆర్‌ను పిలిచి, బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతీయాలనే కుట్రతో సిట్ ఎదుట హాజరు కావాలని పోలీసుల ద్వారా నోటీసులు జారీ చేశారు. రెండేండ్లుగా ప్రతీకార రాజకీయాలతోనే హస్తం పార్టీ పాలకులు పబ్బం గడుపుతున్నారు. చేసిందేమీ లేక, ప్రజల వద్దకు వెళ్లి ఓటు అడిగే ధైర్యంచాలక.. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ, నోటీసులు ఇస్తే ప్రజల దృష్టిని మళ్లుతుందని భావించడం అత్యాశ, చిత్తభ్రమ కాకపోతే మరేమిటి?
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పాలకులు మేడిగడ్డ బరాజ్‌లో కుంగిన రెండు పిల్లర్లపై రాద్ధాంతం చేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ (2024 మార్చిలో) ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ అనేక అంశాల్లో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌కు అనుగుణంగా వందలాదిమంది దగ్గరి నుంచి వాంగ్మూలాలు సేకరించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వీర్యమైందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధులు అసత్య ఆరోపణలు చేస్తూనే వచ్చారు. అప్పుడు ఇచ్చిన నోటీసుల తంతు లాగానే, అది జరిగింది. కాళేశ్వరంలో ఏదేదో జరిగిందని కాంగ్రెస్ నేతలు ఊదరగొట్టారు. బీఆర్ఎస్లో ఒకరి తర్వాత ఒకరిని వరుసపెట్టి బీఆర్కే భవన్‌కు పిలిచారు. అందులో భాగంగా కేసీఆర్‌ను కూడా పిలిచారు. 2025 జూన్‌లో కమిషన్ ముందు కేసీఆర్ హాజరై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అనివార్యతలు, ప్రాజెక్టు నిర్మాణం అనంతరం రాష్ట్రంలో మారిన సాగు ముఖచిత్రాన్ని ఆధారాలు, గణాంకాలతోపాటు వివరించారు.
ప్రభుత్వానికి జస్టిస్ ఘోస్ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక అసెంబ్లీకి చేరింది. సభలో కాంగ్రెస్ పక్షం ఢాం..ఢూం అంటూ చిందులు తొక్కింది. కానీ, కొసాకరికి ఏమి తేలింది? అంతా ఉత్తదేనని స్పష్టమైంది. గతంలో విద్యుత్తు కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయం టూ ప్రభుత్వం జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డితో కమిషన్ వేసింది. ఆ కమిషన్ అసలు విషయం పక్కకుపెట్టి ‘నిర్దేశిత లీకులు’ ఇచ్చి అభాసుపాలైంది. జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి విచారణకు అసలు అర్హుడే కాదని సుప్రీంకోర్టు తేలుస్తుందనే విషయం గ్రహించి, ఆ విచారణ నుంచి ఆయన తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశం ప్రజలకు అప్పుడే అర్థమైపోయింది. కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులపై ఉద్దేశపూర్వకంగానే కక్షసాధింపులు జరుగుతున్న సంగతి తెలిసిపోయింది.
తాజాగా కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వటం అంటే కాంగ్రెస్ సర్కార్ తన నెత్తిన తాను చేయి పెట్టుకున్నట్టే. రెండేండ్లుగా పెట్టిన కేసుల్లో ఒకదాంట్లోనైనా నిర్దిష్ట ఆరోపణ ఉన్నదా? గాలి ఆరోపణలు చేయడం, సోషల్ మీడియాలో తిప్పడం, విచారణ పేరుతో టైంపాస్ చేయడం మినహా జరిగింది ఏమైనా ఉన్నదా? అంటే ఏమీ లేదని అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ పాలకులు ఇలా ఎందుకు చేస్తున్నారు? ఏమి ఆశించి చేస్తున్నారు? ఎవరి ప్రయోజానాల కోసం చేస్తున్నారు? ఎవరి ప్రాపకం కోరి చేస్తున్నారో రెండు వారాలుగా జరుగుతున్న పరిణామాలను లోతుగా గమనిస్తే అర్థమవుతూనే ఉన్నది. అయినా, తెలంగాణ ఆత్మగౌరవం.. ద్రోహుల సిట్టాకు చప్పుళ్లకు తలొగ్గుతుందా?
-నూర శ్రీనివాస్