దేశానికి అన్నం పెట్టే రైతుల జీవితాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే తపనతోనే కవి డాక్టర్ నందిని సిధారెడ్డి తన కలంతో సాగుచేసి పండించిన పంటే ‘అన్నదాత’ నృత్యరూపకం. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని పురస్కరించుకొని 2024, నవంబర్ 28న సాయంత్రం హైదరాబాద్లోని, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. ఈ నృత్య రూపకంలో పూలే వర్ణాశ్రమ ధర్మాలపై పోరాటం చేస్తూ రచించిన గులాంగిరి పుస్తక ప్రాముఖ్యాన్ని వివరించారు. ఇదిలా ఉంటే త్రైలోక్య ఆర్ట్స్ అకాడమీ కళాకారులు ఈ నృత్యరూపకం ప్రదర్శించారు.
సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ మనిషి ఆకలిని ఏ యంత్రమూ తీర్చడం లేదు. అందుకే రైతును కాపాడుకుంటేనే యావత్ ప్రజల ఆకలి తీరుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే కవి సిధారెడ్డి ‘అన్నదాత’ నృత్యరూపకం రచన చేసి, ‘రైతు జీవితాన్ని’ అద్భుతంగా ఆవిష్కరించారు. వ్యవసాయానికి నీరే ప్రాణాధారం. వానలు పడక, పంటలు పండక, కరువు కోరల్లో చిక్కినప్పుడు వేసిన పంట ఎండిపోతుంటే రైతు విలవిలలాడటం, భార్యాపిల్లలు పస్తులుండటం, కప్పతల్లి కల్యాణ ఘట్టాలను త్రైలోక్య నృత్యకారులు అభినయస్తూ అద్భుతంగా నటించారు. కరువు తాండవించినప్పుడు రైతు పరిస్థితి ఎలా ఉంటుందో చూపే సన్నివేశం ప్రేక్షకులను కంటతడి పెట్టించింది.
ఈ అన్నదాత నృత్యరూపకం రచించడం వెనుక కవి సిధారెడ్డి ఆర్ద్రత ఎంతో ఉన్నది. ఆయన రైతుగా ఎన్నో సంఘర్షణలకు లోనయ్యారు. అందుకే రైతు జీవితంలోకి పరకాయ ప్రవేశం చేసి రైతు ఆర్తిని, ఆవేదనను, కష్టాలను, సాధకబాధకాలను తన రచనలో పొందుపరిచారు. ఆయన రచనకు త్రైలోక్య అకాడమీ నటుల నృత్యాభినయం జతకావడంతో అభిమానులు ఆకర్షితులయ్యారు. అందుకే ఈ ‘అన్నదాత’ నృత్యరూపకం దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ప్రదర్శిస్తే బాగుంటుంది.