బీజేపీలో పార్టీ మారాలనుకునే వారికి బండి సంజయ్ సాకుగా దొరికాడని ఆ పార్టీలో ఒక వర్గం వాదన. వచ్చే ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానంలోనైనా నిలిచేటట్టు లేదని కొందరు నాయకులు పార్టీ మారాలనుకుంటున్నారని, అయితే ఆ విషయం చెప్పకుండా రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఉన్న బండి సంజయ్‌ని తొలగించడం వల్లనే తాము పార్టీని వీడుతున్నట్టు ప్రచారం చేస్తున్నారని ఈ వర్గం మండిపడుతున్నది. గోడ దూకడానికి సిద్ధమైన నాయకులు బండిని కొనసాగించినా పార్టీ మారేవారని, కానీ, వెళ్తూ, వెళ్తూ పార్టీ మీద ఒక రాయి విసిరేయడం తప్ప మరేం లేదంటున్నారు. ఈ వాస్తవ పరిస్థితి అర్థం కాక బీజేపీలో ఏమో జరిగిపోతున్నట్టు అభద్రతాభావంతో మరి కొందరు ఇతర పార్టీల వైపు చూస్తున్నారంటున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా మొత్తంగా రాష్ట్ర బీజేపీ తీవ్రగందరగోళంలో పడిందన్నది నిజం.
బీజేపీ కల్చర్
బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయంటే ఇదేనేమో! బీజేపీ నాయకులు కొందరు కాంగ్రెస్‌లో చేరేందుకు సంప్రదిస్తే ‘ఇక్కడ బీజేపీ కల్చర్ నడవదు, ముందే ఆలోచించుకొండ’ని ఒక సీనియర్ నాయకుడు హెచ్చరించినట్టు సమాచారం. ఇప్పుడిది ఇరు పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదివరకు కాంగ్రెస్ కల్చర్ అని విమర్శించేవారు. ఇప్పుడేమో బీజేపీ కల్చర్ అని విమర్శించే స్థాయికి రావడమంటే రాష్ట్ర బీజేపీలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలకు అద్దం పడుతున్నది. ‘హమ్మయ్యా.. తమ పార్టీ మీద ఇంతకాలం పడిన ముద్ర పోయినట్టే’నని కాంగ్రెస్ నాయకులు ఊపిరి పీల్చుకుంటుండగా.. సంబురపడొద్దు.. బీజేపీలో కాంగ్రెస్ కల్చర్ తీసుకొచ్చిన నాయకులే గాంధీభవన్‌కు క్యూ కడుతున్నారు, అలాంటివాళ్లు పోవడమే బెటరని బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
ఔటాఫ్ కవరేజ్ ఏరియా
వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై మీడియా అడిగితే, అవును నిజమే తనకు ఢిల్లీ నుంచి కాల్స్ వస్తే ఫోన్ ఎత్తలేదని ఆ మధ్య అన్నారు. అప్పుడు కాల్స్ ఎత్తలేదని షర్మిల మీద కాంగ్రెస్ నేతలకు కోపం వచ్చినట్టుంది. ఇప్పుడు షర్మిల అదే నంబర్లకు ఫోన్ చేస్తే ‘ఔటాఫ్ కవరేజ్ ఏరియా’ అని వస్తుందట. అంటే సదరు నాయకులు షర్మిల ఫోన్‌ను బ్లాక్ లిస్టులో పెట్టినట్టు అర్థమవుతున్నది. ఇదే విషయాన్ని డీకే శివకుమార్ దృష్టికి తీసుకెళ్తే, ఆమె వెంట పట్టుమని నలుగురు మనుషులు లేరు, ఏకంగా నలభై సీట్లు అడిగితే ఏం మాట్లాడుతామంటున్నారట.
ఏక్ నిరంజన్
ఏపీ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీలో చేరినప్పుడు, ఆయన వెంట ఒక్క ఓటు లేదు, ఇలాంటి ఏక్నిరంజన్ల వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువని తెలంగాణ కమలనాథులు పెదవి విరిచారు. ఒక్క ఓటు లేదనేది తప్పు, మై హూనా అంటూ మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి ముందుకువచ్చాడు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆ పార్టీలో ఎక్క డా కనిపించని, వినిపించని మాగం రంగారెడ్డి అనే అతనికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆ విధేయతతో కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీలో చేరడంతో మాగం రంగారెడ్డి చేరనున్నట్టు ప్రకటించారు. అయితే ఒక్క ఓటు ఉన్నదని బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో జోకులేసుకుంటున్నారు.