ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ప్రభుత్వాలకు దిక్సూచిగా ఉంటూ, పాలకులకు దిశానిర్దేశం చేసేది రాజ్యాంగం. ఎంతో మహోన్నతమైన రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత నాయకులపై ఉన్నది. గతంలో ఎంతోమంది నేతలు రాజ్యాంగ విలువలను పాటిస్తూ ఆదర్శంగా నిలిచారు కూడా. కానీ, ఇప్పటి నేతలు మాత్రం అందుకు భిన్నం. రాజ్యాంగాన్ని కాపాడాల్సిందిపోయి వారే స్వయంగా విలువలకు తిలోదకాలిస్తూ.. రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాసేందుకు యత్నిస్తున్నారు.
పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఒక చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకొని, మరో చేత్తో దాని విలువలను కాలరాస్తున్న తీరే అందుకు నిదర్శనం. పార్టీ ఫిరాయించిన వారిపై వెంటనే వేటు వేసేలా రాజ్యాంగాన్ని సవరిస్తామని న్యాయ్‌పత్ర పేరిట ఓ వైపు హామీ ఇస్తూనే.. మరో వైపు ఇతర పార్టీల నేతలకు కండువాలు కప్పి ఫిరాయింపులను ప్రోత్సహిస్తుండటం శోచనీయం. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నవారే.. రాజ్యాంగాన్ని రక్షిస్తామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరం.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫిరాయింపులకు తాము వ్యతిరేకమని అంటూనే రాష్ర్టా ల్లో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నది. గతంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టిన చరిత్ర ఆ పార్టీది. అనైతికంగా పార్టీలను చీల్చుతూ పొత్తులతో ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తున్న మోదీ సర్కార్ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నది. ఈ విధంగా రెండు జాతీయ పార్టీలూ రాజ్యాంగం విలువలకు తిలోదకాలిస్తున్నాయి.
పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా కేంద్రం లో కాంగ్రెస్ అగ్రనాయకత్వం రాజ్యాంగాన్ని చేతబూని పోరాటం చేస్తుండగా.. తెలంగాణ రాష్ట్ర నాయకత్వం మాత్రం అందుకు విరుద్ధంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను పార్టీలో చేర్చుకుని రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నది. 1985లో రాజీవ్‌గాంధీ సర్కార్ తీసుకొచ్చిన ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడుస్తున్నది. అయితే ఈ ఫిరాయింపులు ఇప్పటికిప్పుడు పురుడుపోసుకున్నవి కావు. రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన నాటి నుంచి నేటి వరకు అవి కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని అరికట్టేందుకు 1985లో చట్టం తీసుకురాగా, 2003లో దానికి సవరణలు జరిగాయి. అయినప్పటకీ ఈ చట్టాన్ని తమ చుట్టంగా భావిస్తూ, అందులోని లొసుగులను ఆసరాగా చేసుకుని అధికారం ఎక్కడుంటే అక్కడ నేతలు వాలిపోతున్నారు.
రాజకీయ వ్యవస్థను ఫిరాయింపులు జలగల్లా పీడిస్తున్నప్పటికీ పలు సంఘటనలు ప్రజాస్వామ్యానికి ప్రాణం పోస్తున్నాయి. నిష్పక్షపాతంగా వ్యవహరించే పలువురు స్పీకర్లు పార్టీ ఫిరాయించిన వారిపై వేటు వేస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెడుతున్నారు. 2017లో రాజ్యసభ సభ్యులు శరత్ యాదవ్, అన్వర్ అలీ పార్టీ ఫిరాయించగా అప్పటి రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు మూడు నెలల్లోనే వారి సభ్యత్వాన్ని రద్దు చేశారు. అయితే కొంతమంది సభాపతులు, సభాధ్యక్షులు మాత్రం చట్టంలోని లోపాలను ఆసరాగా చేసుకుని ఫిరాయింపులను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు.
పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేస్తున్నా ఫలితం లేకపోవటంతో గతంలో పలు పార్టీలు న్యాయస్థానాలను ఆశ్రయించాయి. ఆయా కేసులపై పలు కోర్టులు తీర్పులు వెలువరించాయి. ఈ సందర్భంగా ఫిరాయింపులపై న్యాయస్థానాలు వెలువరించిన తీర్పుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది.
కిహోట హాల్లోహాన్ వర్సెస్ జాచిల్లూ కేసు (1993): ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సభ్యులపై అనర్హత వేటు వేయడంలో స్పీకర్‌దే తుదినిర్ణయం కాదని ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొన్నది. స్పీకర్ నిర్ణయం న్యాయసమీక్షకు లోబడి ఉంటుందని, సభాధ్యక్షుల నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాలు చేయడం రాజ్యాంగబద్ధమేనని చెప్పింది.
జి.విశ్వనాథన్ వర్సెస్ తమిళనాడు శాసనసభ స్పీకర్ (1996): చట్టసభ సభ్యుడు బహిష్కరణకు గురైనప్పుడు అతడిని ఆ సభకు చెందని వ్యక్తిగా పరిగణించాలని ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం తెలిపింది. అదే సమయంలో అతడు పాత రాజకీయ పార్టీ సభ్యుడిగానే కొనసాగుతాడని చెప్పింది. ఒకవేళ అతడు వేరే పార్టీలో చేరితే తన పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టు పరిగణించాలని, కాబట్టి ఆ సందర్భంలో ఆ సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించవచ్చని పేర్కొన్నది.
కులదీప్ నాయర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2006): రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్ర శాసన సభ్యుడు తన పార్టీ ఆదేశాలకు భిన్నంగా ఓటు వేస్తే 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత వర్తించదని, రాష్ట్ర శాసనమండలి సభ్యుల ఎన్నిక విషయంలో మాత్రం అనర్హత వర్తిస్తుందని సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ సందర్భంగా పేర్కొన్నది. చట్టం ఉన్నప్పటికీ, న్యాయ వ్యవస్థ జోక్యం ఉన్నప్పటికీ నేటికీ ఫిరాయింపులు ఆగడం లేదు. అయితే ఫిరాయింపుల చట్టంలో వాదిగా, ప్రతివాదిగా ఎక్కువసార్లు నిలిచింది మాత్రం కాంగ్రెస్ పార్టీయే. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మరోసారి కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లొసుగులను సవరించాలి. సభాధ్యక్షులు ఫిరాయింపుల అనర్హత ఫిర్యాదుపై మూడు నెలల్లోనే తీర్పు చెప్పాలని, లేనిపక్షంలో నిర్ణయించే అధికారాన్ని సభాధ్యక్షులకు కాకుండా స్వతంత్ర ట్రిబ్యునల్‌కు బదిలీ చేసే విధంగా సవరణలు చేయాల్సిన గురుతర బాధ్యత కేంద్రంపై ఉన్నది. ఈ చట్టాన్ని సవరణ చేసి అమలులోకి తెచ్చే విధంగా కేంద్రంపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఒత్తిడి తీసుకురావాలి. లేనిపక్షంలో వారిచ్చింది డొల్ల హామీలేనని ప్రజలు అర్థం చేసుకోవాల్సి వస్తుంది.
పదేండ్లు అధికారాన్ని అనుభవించి, బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే అధికార పార్టీలో చేరుతున్న నాయకులను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కష్టకాలంలో అండగా ఉండాల్సిన నాయకులు స్వార్థంతో పార్టీ మారడం గర్హనీయం. కాంగ్రెస్ చెంత చేరిన బీఆర్ఎస్ శాసనసభ్యులను, శాసనమండలి సభ్యులను అనర్హులుగా ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. వారి సభ్యత్వాలను రద్దు చేయడమే కాకుండా, భవిష్యత్తులో వారు పోటీచేసే అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలి.
-పిన్నింటి విజయ్ కుమార్
90520 39109