భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో పేర్కొన్న పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దాఖలైన ఫిర్యాదులపై చట్టసభల స్పీకర్ ఉత్తర్వులు వెలువరించటానికి కాలవ్యవధిని నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు గత తీర్పుల్లో ప్రకటించింది.కోర్టు ధిక్కార ఉత్తర్వుల దాకా వెళ్లిన దాఖలాలూ ఉన్నాయి. అయినా, రాజ్యాంగం ప్రసాదించిన విచక్షణ హక్కును సభాపతి సహేతుకమైన సమయంలో ఉపయోగించట్లేదనేది వాస్తవం.
ఒక రాజకీయ పార్టీ టికెట్‌పై ఎన్నికల్లో నిలబడి, ఆ పా ర్టీ మద్దతుతో గెలిచిన ఒక సభ్యుడు ఎన్నికల తర్వాత అధికారం చేజిక్కించుకున్న మరో రాజకీయ పార్టీలో నిర్లజ్జగా చేరటం ఆనవాయితీగా మారింది. రెండు లేక మూడు లక్షల మంది ఓటర్ల చేత గౌరవప్రదంగా ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా ఎన్నుకోబడిన సభ్యుడు ఆ ఓటర్ల తీర్పునకు తిలోదకాలిచ్చి, వారి నమ్మకాన్ని, ఆశయాన్ని తుంగలో తొక్కి, ఎన్నికైన కొద్దికాలానికే పసలేని కారణాలు చెప్పి మరొక పార్టీలోకి జంప్ చేయటం హర్షణీయం కాదు. పార్టీలు మారే ఈ విధానం మొట్టమొదటగా హర్యానాలో ‘ఆయారామ్ గయారామ్’గా, తెలుగు రాష్ర్టాల్లో ‘గోడ మీద పిల్లి’గా ప్రచారంలోకి వచ్చింది. అధికారంలో ఉన్న పార్టీలో ఉంటే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఎక్కువగా తెచ్చుకునే అవకాశం ఉంటుందని, తన నియోజకవర్గంలోని ఓటర్ల అభీష్టం మేరకే అధికార పార్టీ కండువా కప్పుకొన్నట్టు చెప్పుకోవటం కేవలం ఒక సాకు మాత్రమే. అక్రమంగా వెనుకేసుకున్న ఆస్తులను సీబీఐ లేదా ఇతర దర్యాప్తు సంస్థల నుంచి కాపాడుకునేందుకు లేదా ఏదైనా పదవి లేదా కాంట్రాక్టులు ఆశించి మాత్రమే అధికార పార్టీకి అంటకాగుతున్నాడనేది సామాన్యుడి అభిప్రాయం.
‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం’ అనేది ఒకటి ఉన్నదని, దానికి కట్టుబడి ఉండాలనే నియమం చాలామంది చట్టసభల సభ్యుల్లో మచ్చుకైనా కనపడదు. ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలో చేరిన సభ్యుల సభ్యత్వం రద్దు ఫిర్యాదులు ఎంతకాలానికి పరిష్కారమవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. ఐదేండ్ల సభ కాలపరిమితి కూడా ముగిసిపోవచ్చు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్ ముందు దాఖలైన ఫిర్యాదుల్లో తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తుందని భావించి నాటి ఏపీ శాసనసభలోని ఆరుగురు సభ్యులు ముందుగానే తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దానితో అప్పటి స్పీకర్ వారి రాజీనామాలను ఆమోదిస్తూ ఎటువంటి తీర్పు ప్రకటించకుండా ఫిర్యాదులను మూసివేశారు. రాజీనామాలు ఆమోదించినా, భారత రాజ్యాంగంలో తదుపరి తీసుకోవలసిన శిక్షా నిబంధనల గురించి ఎలాంటి ప్రస్తావన లేనందున, మరే విధమైన చర్యలు తీసుకోకుండా అనర్హత వేటు ఫిర్యాదులను మూసివేయవలసి వచ్చిందని స్పీకర్ ముక్తాయింపును ఇచ్చారు.
ఏదేని సభ్యుడు పార్టీ ఫిరాయించాడని భావిస్తే, ఆ సభ్యుడి మిగతా కాలానికి సభ్యత్వం రద్దుచేసే అధికారం స్పీకర్‌కు రాజ్యాంగం ప్రసాదించింది. పార్టీ ఫిరాయింపు అనర్హత పిటిషన్ స్పీకర్ ముందు పెండింగ్‌లో ఉన్న సమయంలో, సభ్యుడు స్వయానా సభ్యత్వానికి రాజీనామా కూడా సమర్పించవచ్చు. ఈ రెండు సందర్భాల్లోనూ ఆ సభ్యుడు కడిగిన ముత్యంలాగా తిరిగి జరుగబోయే ఉప ఎన్నికలో లేదా సాధారణ ఎన్నికల్లో తనకు నచ్చిన రాజకీయ పార్టీ ప్రతినిధిగా నిర్ద్వందంగా పోటీ చేయవచ్చు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ పార్టీ మారిన సభ్యుడి సభ్యత్వ రద్దుకు మాత్రమే పరిమితమైంది. సభ్యత్వ రద్దు కాకుండా ఇతర చట్టపరమైన చర్యల గురించి ఎలాంటి ప్రస్తావన లేకుండటంతో జంప్ జిలానీలు దానిని తమకనుకూలంగా మార్చుకుంటున్నారు.
దీనికి భిన్నంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్లు, 8 నుంచి 10లో ప్రస్తావించబడిన నేరాలకు సంబంధించి శిక్షకు గురికాబడిన సభ్యుడు, 3 నుంచి 6 ఏండ్ల పాటు చట్టసభలకు పోటీ చేయడానికి అనర్హుడు. అయితే, ఈ అనర్హతను రద్దుచేసే లేదా కాలవ్యవధిని తగ్గించే అధికారం కేంద్ర ఎలక్షన్ కమిషన్‌కు ఆ చట్టం కట్టబెట్టింది.
ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఏ విధంగానైతే కొన్నేండ్ల పాటు పోటీ చేయడానికి అనర్హత వేటు కల్పించబడిందో అదేవిధంగా లక్షల ఓటర్ల అభీష్టం మేరకు ఒక పార్టీ ప్రతినిధిగా ఎన్నుకోబడి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా వేరొక రాజకీయ పార్టీలోకి ఫిరాయిస్తే ఆ సభ్యుడి సభ్యత్వం రద్దు చేయాలి. అంతేకాదు కొన్నేండ్ల పాటు చట్టసభలకు పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించే హక్కును స్పీకర్‌కు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ తేవాలి. పార్టీ ఫిరాయింపు ఫిర్యాదును స్పీకర్ పరిష్కరించే కాలవ్యవధి కూడా రాజ్యాంగ సవరణ ద్వారా తేవాలి. అప్పుడే ఈ ఫిరాయింపుదారుల కట్టడి చేసినట్టవుతుంది. తద్వారా ఓటర్లు ఇచ్చిన తీర్పును గౌరవించినట్టవుతుంది. ఎన్నుకోబడిన సభ్యుల్లో జవాబుదారీతనం పెరుగుతుంది. అధికారంలో ఉన్న పార్టీకి ప్రతిపక్ష పార్టీ సభ్యులను ప్రలోభపరిచే అవకాశం ఉండదు. అదేవిధంగా అధికారపక్షం నుంచి ఎన్నుకోబడిన సభ్యులు పదవి దక్కలేదనే అక్కసుతో ప్రతిపక్ష పార్టీతో చేతులు కలిపి అధికార పక్ష పార్టీని అస్థిరపరచే పన్నాగాలకు అడ్డుకట్ట వేసినట్టవుతుంది. ఒకవేళ తాను ఎన్నుకోబడిన పార్టీ విధానాలు నచ్చకపోతే సభ్యుడు పార్టీకి రాజీనామా చేసి, మరో ఎన్నికల్లో ఓటర్లకు రాజీనామా కారణాలు వివరించాలి. వారి అభీష్టం మేరకే మళ్లీ ఎన్నుకోబడాలి. రాజకీయాల్లో సంస్కరణలు తేవాలంటే కాలవ్యవధి ప్రస్తావన, శిక్షా నిబంధనల ప్రస్తావనతో కూడిన రాజ్యాంగ సవరణలు అవసరం.
(వ్యాసకర్త: జిల్లా మాజీ జడ్జి)
-తడకమళ్ల మురళీధర్
98485 45970