స్వచ్ఛంగ తెలుపుతున్న. సరిగ్గ ఈ కంపోజింగ్ టైంల కరెంటు లేదు. శుక్రవారం పొద్దుగాల పావుదక్వ పదకొండిట్కి పోయింది. మల్ల పగటీల 12.20 కొచ్చింది. కమ్ సే కమ్ గంటన్నర గుటుక్కుమన్నది. ఇంక కడమ దినంల ఇట్ల రెండు మూడు తాపల జెరంత మిట్కరిచ్చుడు రివాజైతున్నది. రాజధాని నగరంల అల్వాల్ సైడుల మా అపార్టుమెంట్ వాచ్మెన్ పోచయ్యకు నెల కిందనే చెప్పిన. మార్పు వస్తుంది జాగ్రత్త. జెర అప్పుడప్పుడు జనరేటర్ ఆన్ చెయ్యి అని.
కరెంటే పోదుగదా అనే నమ్మిక పదేండ్ల సంది పోచయ్య మైండ్ల గట్టిగ నాట్కపోయె. ఇశార చెయ్యంగనె ఇనెతందుకు తనకు టైం పట్టింది. ఆ టైం పట్టుడు..కంప్లీట్ అవుడు, తను మార్పునకు తగ్గట్టు ట్యూన్ గాకడ ఒకపారే ఏకకాలంల జరిగినై. రానే వచ్చిండు నా తానికి. జనరేటర్ చాల్ అయితలేదు. కరెంటేమో పోవట్టె అని చెప్పుకచ్చిండు. మొదాలె చెప్తే ఇనక పోతివి..అని సున్నితంగా యాజ్జేశి, వెంటనే మెకానిక్ ఆంజనేయులుకు ఫోన్ చేశిన. గిట్ల గిట్ల అని తక్లీబు తెలిపిన. సరే వస్త అన్నడు. ఎప్పుడస్తడో ఫిక్సుడు టైం ఎందుకు చెప్పలేదో దినం గడిచిన కొద్దీ జెరంత జెరంత మన్సనవడుతుంది. ఎందుకంటే, శాతకు మించిన అసైన్మెంట్లు ఆఫీసు తనకు వేస్తున్నది. ఒక్కసారిగ జనరేటర్ల మరమ్మతులు అమాంతం పెరుగుతున్నయి.
ఇటూఅటూ పరుగులు తీసుడు మెకానిక్ వంతైతున్నది. మా ఆస్థాన మెకానిక్ అతనే. జనవరి 11 నాడు రిక్వెస్ట్ జేశిన. రోజులు గడువవట్టె. రోజూ వస్తా వస్తా అంటుండె గానీ, రోజులు గడుస్తున్నా తాను వచ్చే రోజు వస్తలేదు. లిఫ్ట్‌ల ఎవలైన ఉన్నప్పుడు కరెంటు పోతే ఎట్టా? అని నా రంది నాది. ఆంజనేయులు నంబర్ వాచ్‌మెన్‌కు, తక్కిన ఫ్లాట్ల ఓనర్లకు ఫాలో అప్ కోసం షేర్ చేశిన. మొత్తానికి ఆరొద్దులకు 17న మెకానిక్ దర్శన భాగ్యం కలిగింది. జనరేటర్ చెక్ చేశిండు. ప్రాపర్‌గా యూజ్ (ఆన్) చేయనందున బ్యాటరీ డౌన్ అయిందని తేల్చిండు. సపోర్ట్ ఛార్జర్ పెట్టుకోవాలన్నది తన సజెషన్. అది రూ.6,500 ఉంటుందన్నడు. ఇప్పటికిప్పుడు అంత ఇన్వెస్ట్ ఎందుకనే ఒపీనియన్ అపార్ట్మెంట్ల వచ్చింది. కాబట్టి తక్షణ కర్తవ్యంగా ఆ బ్యాటరీని నా బండి మీద పెట్టుకొని వాచ్‌మెన్‌తో కలిసి ఓల్డ్ అల్వాల్ బ్యాటరీ కమ్ ఇన్వర్టర్ల షాపునకు పోయినం. దానికి ఛార్జింగ్ పెట్టాలె. ఇప్పుడు బిజీ. రేపు పగలు గీ టైంకు తీస్కపోన్రి అన్నడు దుకాణదారు. చార్జింగ్ మీదట వాచ్మెన్ 18 నాడు బ్యాటరీ తెచ్చిండు. మెకానిక్కు అప్డేట్ చేశినంక పూటకు టైం ఇచ్చి, వచ్చిండు. బ్యాటరీ ఫిక్స్ చేశి, జనరేటర్ ఆన్ చేశిండు.
కరెక్ట్ వారానికి, రూ.1,380 బిల్లులతోని జనరేటర్ సప్పుడు ఇన్నం. కరెంటు పోతనే ఉన్నది. జనరేటర్ సౌండ్ ఇంటనే ఉన్నం. డీజిలు స్టాకు గురించి మల్ల వాచ్‌మెన్‌ను అలెర్టు చేశిన. ఏందక్వ పదేండ్లు జనరేటర్లు, ఇన్వర్టర్లతోటి అక్కెర బగ్గ తగ్గె. ఇప్పుడేమో రోజులు మారె. మార్పు వచ్చె.
ఎంత మెయింటెనెన్సు పేరు చెప్పి, కరెంటు కట్ చేస్తున్నా.. పోయిన దస్ సాళ్ల మెయింటెనెన్సు లేకుండెనా ఎట్లా? అప్పుడు సుత ఉండె. కని కరెంటు గీ తరీక పోకపోతుండె. అంతెందుకు? 2014కు ముందు చినుకు వడితె సటుక్కున ఫస్టు కరెంటు గాయబ్ అయితుండె. చూశీ చూశీ ఓ దినం గిట్లనె అయితే, కేటీఆర్ యాష్టపడ్డరు. వాన వస్తే కరెంటు పోవుడు.. గిదేం దరిద్రం? అని అన్న ఘడియలు మొదలుకొని 2023 నవంబరు దాన్క ఆ దరిద్రం కొట్టుకపోయింది. వాన, సలి, ఎండతోటి నిమిత్తం లేకుండ మల్ల ఆ దరిద్రం మోపైతున్నట్టున్నది!
– ఇల్లెందుల దుర్గాప్రసాద్
94408 50384