బీజేపీ అధ్యక్షుడి ఎంపికలో గతంలో ఆరెస్సెస్‌దే పెత్తనం సాగేది. అయితే, ఇదంతా 2014కు ముందు ముచ్చట. 2014, 2019 ఎన్నికల్లో మిత్రపక్షాల మద్దతు అవసరం లేకుండా బీజేపీని మోదీ సోలోగా ఎప్పుడైతే అధికారంలోకి తీసుకువచ్చారో అప్పట్నుంచి పరిస్థితి మారిపోయింది. కానీ, 2024లో సీన్ మళ్లీ రివర్స్ అయ్యింది. ఈ ఎన్నికల్లో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువగా 240 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో పార్టీ అధ్యక్షుడి ఎంపికలో మోదీ ప్రభావం నామమాత్రంగా మారడంతో.. తమ ఉనికిని చాటుకోవడానికి ఆరెస్సెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరోవైపు తమకు నచ్చిన వ్యక్తిని అధ్యక్షుడిగా ప్రకటించాలని మోదీ-షా వర్గం పట్టుబడుతున్నది. వెరసి సంఘ్‌పరివార్ నేతలు, బీజేపీ నాయకుల మధ్య నెలకొన్న ఈ వివాదం కారణంగా బీజేపీ అధ్యక్షుడి ఎంపికలో తీవ్రమైన జాప్యం నెలకొన్నట్టు అర్థమవుతున్నది.
బీజేపీ తర్వాతి అధ్యక్షుడు ఎవరన్న దానిపై ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతున్నది.ఆరెస్సెస్, బీజేపీ నాయకుల మధ్య కుదిరే ఏకాభిప్రాయంపై ఆధారపడే కమలం అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందనేది గత అనుభవాలను బట్టి అర్థమవుతున్నది. అయితే, ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తున్నది. మార్చి 30న నాగ్‌పూర్‌లోని ఆరెస్సెస్ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోదీ పర్యటించారు. ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ మెమోరియల్‌ను ఆయన సందర్శించారు. అదే సమయంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌తో మోదీ భేటీ అయ్యారు. దీంతో అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఆరెస్సెస్-బీజేపీ మధ్య నెలకొన్న పొరపొచ్చాలకు ముగింపు పలకడంతో పాటు కొత్త అధ్యక్షుడి ఎంపిక త్వరలోనే జరుగుతుందని అందరూ భావించారు. అయితే, అలా జరగలేదు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అధ్యక్షుడి ఎంపికకు మరింత సమయం పట్టేలా కనిపిస్తున్నది.
2020లో బీజేపీ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన జగత్ ప్రకాశ్ నడ్డా ఇప్పటికీ ఆ పదవిలో కొనసాగుతున్నారు. బీజేపీలో సాధారణంగా ‘వన్ మ్యాన్, వన్ పోస్ట్’ అనే నిబంధన ఉంటుంది. అయితే, ఈ సూత్రానికి అతీతంగా నడ్డా అధ్యక్ష పదవితో పాటు ఆరోగ్య మంత్రిగా, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పలు పదవులను చేపట్టడం గమనార్హం. నిర్ణీత సమయంలో అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను చేపట్టడం ఆ పార్టీలో ఓ ఆనవాయితీగా, నియమంగా ఉండేది. అయితే, ఈసారి అది గాడి తప్పినట్టు తెలుస్తున్నది.
గత చరిత్రను చూసుకుంటే, ఆరెస్సెస్ ఎంపిక చేసిన వ్యక్తినే బీజేపీ అధ్యక్షుడిగా నియమించడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే, గడిచిన పదేండ్లలో చూడని విధంగా నిరుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువగా 240 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో అధ్యక్షుడి ఎంపికలో తన ఉనికిని చాటుకోవడానికి, బీజేపీ నియంత్రణను తగ్గించడానికి ఆరెస్సెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ఏడాది చివరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మరుసటి ఏడాది దక్షిణాది రాష్ర్టాలు కేరళ, తమిళనాడుతో పాటు పశ్చిమబెంగాల్లో, ఆ తర్వాతి ఏడాది సంఘ్ పరివార్‌కు అడ్డాలుగా పిలిచే యూపీ, గుజరాత్ అసెంబ్లీలకూ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీ క్యాడర్‌పై పట్టున్న విశ్వాసపాత్రుడిని అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని ఆరెస్సెస్ భావిస్తున్నది. ఈ క్రమంలోనే 2024 ఆగస్టులో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నివాసంలో అత్యున్నత స్థాయి భేటీ జరిగింది. ఈ సమావేశంలో జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆరెస్సెస్ అగ్రనేత దత్తాత్రేయ హోసబాలే, ఆరెస్సెస్ సంయుక్త కార్యదర్శి అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. సంస్థాగత నైపుణ్యాలు కలిగిన వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించాలని ఆరెస్సెస్ ప్రయత్నిస్తుండగా, మోదీ-షా ద్వయం మెప్పు పొందిన వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించాలని బీజేపీ పరివారం పట్టుబడుతున్నది.
గడిచిన పదేండ్లలో బీజేపీ అధ్యక్షుడు పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కంటే మోదీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తిగా ఎక్కువగా పని చేసినట్టు ఆరెస్సెస్ భావిస్తున్నది. అయితే, ఇప్పుడు ఎంపిక చేసే వ్యక్తి ప్రభుత్వం నీడలో కాకుండా స్వతంత్రంగా పనిచేయాలని సంఘ్ పరివార్ కోరుకుంటున్నది. అడ్మినిస్ట్రేటివ్, ఆర్గనైజేషనల్ స్కిల్స్ కలిగిన సంఘ్ నేత శివరాజ్‌సింగ్ చౌహాన్ లేదా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లేదా బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి సంజయ్ జోషీని బీజేపీ తర్వాతి అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని ఆరెస్సెస్ భావిస్తున్నది. అయితే, దీనికి భిన్నంగా.. కేంద్రమంత్రులు మనోహర్‌లాల్ ఖట్టార్ లేదా భూపేంద్ర యాదవ్ లేదా ధర్మేంద్ర ప్రధాన్‌ను అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాలని బీజేపీ నాయకత్వం తలపోస్తున్నది. ఒకవేళ, దక్షిణాదికి అవకాశం ఇవ్వాలనుకుంటే.. తెలంగాణ నుంచి ఎవరో ఒకరికి లేదా మహిళకు అవకాశం కల్పించాలనుకుంటే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి పట్టం కట్టాలని బీజేపీ భావిస్తున్నది. కాగా యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ర్టాలకు బీజేపీ అధ్యక్షులను నియమించాల్సి ఉన్నది. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికపై ఆరెస్సెస్, బీజేపీ మధ్య చర్చలు త్వరలోనే కొలిక్కివచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
-అనితా సలూజా