తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులున్న చోట విద్యార్థులు ఉండటం లేదు. విద్యార్థులున్న చోట టీచర్లు ఉండటం లేదు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందటం లేదు. 10 మంది విద్యార్థులకు 8 మంది టీచర్లు, 130 మంది విద్యార్థులకు ఇద్దరే ఉపాధ్యాయులు ఉన్నారనే వార్తలు చూస్తున్నాం. ఈ సమస్యను పరిష్కరించాలంటే టీచర్ల రేషనలైజేషన్ తప్పనిసరి.
రాష్ట్రంలో 26,074 మండల, జిల్లా పరిషత్ పాఠశాలలున్నాయి. 194 మాడల్ స్కూళ్లు, 475 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలున్నాయి. వీటికితోడు 31 అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు, 51 సెంట్రల్ స్కూళ్లు, 1002 సంక్షేమ గురుకులాలు, 161 మదర్సాలున్నాయి. వీటిల్లో 30,93,368 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2015 సంవత్సరంలో తొలిసారి ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేశారు.దాదాపు 8 ఏండ్ల తర్వాత ఇప్పుడు ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ చేయాలని విద్యాశాఖ చర్యలు చేపట్టింది.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయడం కోసం టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహించాలంటే ముందుగా ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ జరగాల్సిందే.
ప్రతి విద్యా సంవత్సరం ఆరంభంలో విద్యాశాఖ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయా జిల్లాల్లోని మండలాన్ని యూ నిట్గా చేసుకొని ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తున్నది. తద్వారా తాత్కాలికంగా ఉపాధ్యాయు ల కొరత తీరుస్తున్నది. ఉపాధ్యాయులు అందుబాటులో లేని బడుల్లో విద్యా వాలంటీర్లను నియమిస్తున్నది. దీనికి శాశ్వత పరిష్కారం ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ (టీచర్ల రేషనలైజేషన్).
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2015లో తొలిసారి ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ జరిగింది. దాదాపు ఎనిమిదేండ్ల తర్వాత ఇప్పుడు ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ చేయాలని విద్యాశాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీచేయడం కోసం టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహించాలంటే ముందుగా ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ జరుగాల్సిందే.
ఈ హేతుబద్ధీకరణ ప్రక్రియ ప్రభావం ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలపై ఎక్కువగా ఉంటుంది. ఉన్న త పాఠశాలలో ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడుంటారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులను హేతుబద్ధీకరణ చేస్తారు.
ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం… రాష్ట్రంలోని 400కు పైగా ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6,7 తరగతుల్లో విద్యార్థులు లేకున్నా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఆయా పాఠశాలల్లో రెండు తరగతుల్లో కలిపి 10 మంది విద్యార్థులే ఉన్న బడులు 650 పైగా ఉన్నాయి. పై గణాంకాలను పరిశీలిస్తే ఆ పాఠశాలల్లో విద్యార్థులు తక్కు వ, ఉపాధ్యాయులు ఎక్కువ ఉన్నట్టుగా అర్థమవుతున్నది. ఇక ఉన్నత పాఠశాలల పరిస్థితిని గమనిస్తే 6 నుంచి 10వ తరగతి వరకు 50 లోపు విద్యార్థులున్న బడులు 500 వరకున్నాయి. పరిస్థితి ఇలా ఉండటం వల్ల ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకుండా పోతున్నది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభు త్వం చర్యలు చేపట్టింది.
ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ ప్రక్రి య చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం 2021 ఆగస్టు 12న మార్గదర్శకాలు విడుదల చేస్తూ జీవో 25ను జారీచేసింది. కొన్ని కారణాల వల్ల ఈ హేతుబద్ధీకరణ ప్రక్రియ అమలుకాకుండా నిలిచిపోయింది. ఈ మార్గదర్శకాల్లో ఒకే ఆవరణ లో పనిచేస్తున్న ప్రాథమిక పాఠశాల, ప్రాథమికో న్నత పాఠశాలలను కలిపి ఉన్నత పాఠశాలలో విలీనం చేయాలని నిర్ణయించింది. అలాగే ఒకే ఆవాసంలో ప్రాథమిక , ప్రాథమికోన్నత, ఉన్న త పాఠశాలలు ఉంటే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వాటిని ప్రాథమిక పాఠశాలలుగా లేదా ఉన్నత పాఠశాలలుగా గాని మార్చాలి.
ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ చేస్తే సగటున ప్రతి జిల్లాలో 250 మంది ఉపాధ్యాయులకు స్థానచలనం కలుగనున్నదని అంచనా. అంటే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8,000 మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యే అవకాశం ఉన్నది. ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ జరిగితేనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీలు తెలుస్తాయి. అప్పుడే నూతన ఉపాధ్యాయ నియామకాల కోసం నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నది.
టీచర్ల రేషనలైజేషన్ ప్రక్రియ వల్ల రాష్ట్రంలోని ఒక్క బడి కూడా మూతపడకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలకు కనీసం ఒక టీచర్ ఉం డేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఉపాధ్యాయ పోస్టును మంజూరు చేస్తారు. ఆ తర్వాత విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ పోస్టులు కేటాయిస్తారు. విద్యార్థులు తక్కువు న్న ప్రాథమికోన్నత పాఠశాల 6,7 తరగతుల విద్యార్థులను సమీపంలోని ఉన్నత పాఠశాల లో విలీనం చేస్తారు. ఉన్నత పాఠశాలలోని సబ్జె క్టు టీచర్ ఖాళీలను భర్తీ చేయడానికి ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేస్తారు. దీనివల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో చదివే బడుగు, బలహీనవర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అం దే అవకాశం ఉంటుంది.
రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం నిర్వహించిన బడిబాట కార్యక్రమం ద్వారా నూతనంగా 1,14,257 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరారు. వారి సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ జరగాల్సిందే. హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తికాగానే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాల్సి ఉన్నది. రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎంతోకాలంగా టీఆర్టీ నోటిఫికేషన్ కోసం ఎదు రుచూస్తున్నారు. పర్యవేక్షణ అధికారుల
నియామకాలు చేపట్టాల్సి ఉన్నది. అప్పుడే ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందుతుంది.ప్రభుత్వ బడుల్లో మౌలిక సౌకర్యాలు కల్పిం చి, ఉపాధ్యాయులను నియమిస్తే ప్రభుత్వ పాఠశాలలు పూర్వ వైభవం సంతరించుకుంటాయి.
-పాకాల శంకర్ గౌడ్
98483 77734