Population Census | దేశ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జనగణనకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ నుంచి దేశంలో జనాభా లెక్కల ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతుండటం శుభపరిణామం. పదమూడేండ్ల తర్వాత జరగనున్న ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు 18 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. చైనాను దాటి అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించిందని గతేడాది ఐక్యరాజ్య సమితి నివేదిక వెలువరించిన నేపథ్యంలో ఈ జనగణన ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.
2021లో జరగాల్సిన జనగణన ప్రక్రియ కొవిడ్ కారణంగా ఆలస్యమైన విషయం విదితమే. ఆ తర్వాత పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇది వాయిదా పడుతూ వచ్చింది. జాప్యం కారణంగా పలు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ జనగణనను పూర్తిచేయడం అనివార్యం. దేశ ప్రజల అవసరాలు, సమస్యలను పరిష్కరించేందుకు ఆ డేటా దోహదపడుతుంది. భారత్ లాంటి దేశాలకు ఈ డేటా ఎంతో సహాయకారిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే, జనాభాలో సంభవిస్తున్న మార్పులు, లింగ నిష్పత్తి, వలసలు, అక్షరాస్యత, పేదరికం, అసమానతలు తదితర అంశాలకు సంబంధించిన సమగ్ర వివరాలు దీని ద్వారా తెలుస్తాయి. కుటుంబాల ఆర్థిక స్థితిగతులు, పట్టణీకరణ వంటి అంశాలు అవగతమవుతాయి. రాష్ర్టాలకు కేంద్ర నిధుల కేటాయింపు నుంచి మొదలుకొని విద్యాసంస్థల ఏర్పాటు, నియోజకవర్గాల విభజన వరకు అనేక అంశాలు ఈ డేటాపైనే ఆధారపడి ఉంటాయి.
తాజా అంచనా ప్రకారం ఆగస్టు 21 నాటికి మన దేశ జనాభా సుమారుగా 145.27 కోట్లు ఉన్నట్టు తెలుస్తున్నది. ఇది ప్రపంచ జనాభాలో 17.78 శాతం కావడం గమనార్హం. ఈ లెక్కన ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ గుర్తింపు పొందింది. అసలు జనగణన అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. దేశంలోని ప్రతీ కుటుంబంలోని సభ్యులను క్రమపద్ధతిలో లెక్కించడం, అవసరమైన ఇతర సమాచారాన్ని సేకరించడం, వాటిని నమోదు చేయడం.. ఇలా అనేక ప్రక్రియలతో ముడిపడినదే జనగణన. సంక్షేమం, అభివృద్ధిపై ఇది ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాదు, జాతీయ శాంపిల్ సర్వే, (దేశ ప్రజల జీవన విధానాలకు సంబంధించి అన్ని అంశాలపై సమాచారాన్ని సేకరించే వరుస సర్వేలు), జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వంటి పలు కీలకమైన అధ్యయనాలకు కూడా ఈ డేటా కీలకం. ఈ నేపథ్యంలో దేశ ప్రగతిలో ఎంతో కీలకమైన జనగణన దిశగా ఇప్పటికైనా అడుగులు పడటం సంతోషకరం.
– డాక్టర్ కృష్ణకుమార్ వేపకొమ్మ
98495 62910