పంచాయతీల పోరు అయిపోయింది.. పట్టణాల వంతు వచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో నలభై శాతం గ్రామాలు కర్రుకాల్చి కాంగ్రెస్‌కు వాతపెట్టాయి. ఇప్పుడు పట్టణాల ఓటర్లకు అవకాశం లభించింది. తెలుగుదేశం పార్టీ విశ్వాసపాత్రుడైన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ జెండా కప్పుకొని అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో పల్లెల్లోనే కాదు.. పట్టణాల్లో జరిగిన విధ్వంసం కూడా అంతాఇంతా కాదు. తెలంగాణ సాధించిన తర్వాత అన్ని అడ్డంకులను అధిగమించి చక్కగా పట్టాలపైన వెళ్తున్న దశలో తెలంగాణ ఒక్కసారిగా పట్టాలు తప్పింది.
పదేండ్ల పాటు.. అర్బన్ ఎకానమీతోపాటుగా, రూరల్ ఎకానమీని సమాంతరంగా సమతుల్యతతో నడిపించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. ప్రజల్లో సంతృప్తిస్థాయి పెరిగితే.. వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పర్యవసానంగా వారు మానవవనరులై రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతంగా నిలుస్తారన్న కేసీఆర్ దార్శనికతకు అనుగుణంగా పదేండ్లపాటు పాలన సాగింది. పల్లె ప్రగతితోపాటుగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కేసీఆర్ విజయవంతంగా అమలు చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమానికి 10 శాతం గ్రీన్ బడ్జెట్‌ను కేటాయించారు. పట్టణాల్లో పారిశుధ్యం, వర్షపు నీరు, మురుగునీటి నిర్వహణ వ్యవస్థల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన వంటి చాలా అంశాలపై ఒకేసారి దృష్టి సారించి రాష్ట్రంలోని అన్ని పట్టణాలను ప్రగతిబాట పట్టించారు. అన్ని జిల్లా కేంద్రాలకు కనెక్టివిటీని పెంచారు.
రాష్ట్ర రహదారుల మౌలిక సదుపాయాల కల్పనలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలించింది. మిషన్ భగీరథ కార్యక్రమంతో ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు అందాయి. గృహ నిర్మాణ రంగంలోనూ విప్లవాత్మక విధానాలు అమలు చేశారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ అందించారు. అభివృద్ధిని హైదరాబాద్‌తోపాటు జిల్లాలకు వికేంద్రీకరించారు. ములుగు లాంటి ఏజెన్సీ ప్రాంతాలను మున్సిపాలిటీలు చేయడం ద్వారా అభివృద్ధికి రాచబాట పరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో రియల్ ఎస్టేట్ రంగం అనూహ్యమైన అభివృద్ధి సాధించింది. కానీ రేవంత్‌రెడ్డి పాలన వచ్చిన తర్వాత మొట్టమొదట విధ్వంసమైన రంగం రియల్ ఎస్టేటే. రెండేండ్లయినా కూడా ఇంకా కోలుకోలేదు. దీనికి తోడు హైడ్రా వ్యవస్థను నగరం మీదికి వదిలారు. పేదలను బయటకు ఈడ్చి పడేసి, ఇండ్లు కూల్చేసిన ఘటనలు ఎన్నో. ఇదే హైడ్రా ఏ రోజు కూడా చెరువులు దిగమింగిన గద్దల జోలికి మాత్రం పోనే లేదు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల తర్వాత హైడ్రాను రాష్ట్రంలోని మిగతా పట్టణాలన్నింటికీ విస్తరించాలన్న ఆలోచనతో ఉన్నట్టు కనబడుతున్నది. అదే జరిగితే.. ఇక పేదల గోడు వినేవాడే ఉండడు.
కాంగ్రెస్ పాలనలో మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న పని ఒకటే. మున్సిపాలిటీలకు నాలుగు వైపులా ఆఫీసులు ఏర్పాటు చేసుకోవటం, ఎవరు ఇల్లు కట్టినా, రోడ్డు వేసినా.. అపార్టుమెంట్ల నిర్మాణం చేపట్టినా, వాళ్ల నుంచి కమీషన్లు వసూలు చేయడం.. ఎక్కడ భూమి కనిపిస్తే.. అక్కడికి పోయి కబ్జాలు చేయడం, ఎవరైనా గట్టిగా మాట్లాడితే హైడ్రాను తెస్తామంటూ బెదిరించడం తప్ప మరేమీ చేయడం లేదు. చివరకు వర్సిటీల భూములపైనా రేవంత్ సర్కార్ పెద్దలు కన్నేశారు. భూములు అమ్ముకోవద్దంటూ విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో పట్టణాల్లో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారు. ఉచిత డయాగ్నొస్టిక్ సెంటర్లు నెలకొల్పారు. వరంగల్ మహానగరంలో దేశంలోనే అత్యాధునిక సౌకర్యాలతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం చేపట్టారు. రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దవాఖాన నిర్మాణం నిలిచిపోయింది. ఇక నగరంలో బస్తీ దవాఖానలు పడకేశాయి. డయాగ్నొస్టిక్ సెంటర్లు మూతపడ్డాయి. కాంగ్రెస్ పాలకులు వైద్యరంగాన్ని సర్వనాశనం చేశారు. బీఆర్ఎస్ హయాంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ అంటే ప్రతిష్ఠాత్మక శాఖగా గుర్తింపు పొందింది. ఆ శాఖను నిర్వహించిన కేటీఆర్ దేశవ్యాప్తంగా గొప్ప పేరు సాధించారు. ప్రతి పట్టణంలోనూ ట్యాంక్బండ్ల నిర్మాణం జరిగింది. చిన్న మున్సిపాలిటీల్లో ఒకటి, పెద్ద మున్సిపాలిటీల్లో రెండు, కార్పొరేషన్లలో నాలుగు చొప్పున వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లను ఏర్పాటు చేశారు. వీటిలో చాలావరకు పూర్తయ్యాయి. పనులు మధ్యలో ఉన్న మాట మిగిలితే.. ఆ పనులు రెండేండ్లుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు తయారైంది. పనులు చేయడానికి ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రావటం లేదు. తాజాగా ఖమ్మంలో పురపాలక ఎన్నికల ప్రచారంలో రెవెన్యూ మంత్రి మాట్లాడుతూ.. నల్లాల్లో మురికి నీళ్లొస్తున్నాయంటూ ఆరోపణలు వస్తున్నాయి. మమ్మల్ని గెలిపిస్తే.. చక్కని నీళ్లను అందిస్తాం అని హామీ ఇచ్చారు. ఇప్పుడు తామే అధికారంలో ఉన్న సంగతి మంత్రి మరచిపోయారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఐటీ రంగాన్ని తెలంగాణలోని అన్ని పట్టణాలకు విస్తరించేలా ప్రణాళికలు అమలు చేశారు. కాంగ్రెస్ పాలనలో ఏకంగా టీహబ్‌కు మంగళం పాడటానికి ప్రయత్నించారంటే.. పట్టణాభివృద్ధి శాఖను తన దగ్గరే పెట్టుకున్న రేవంత్ ఆలోచన ఏమిటో అర్థమవుతున్నది. ఇక పట్టణాల్లో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు బీఆర్ఎస్ చేసిన మేలు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోనూ, ఏ ఒక్క ప్రభుత్వమూ చేయలేదు. ఉద్యోగులు రిటైర్ అయితే.. అదే రోజు బెనిఫిట్స్ అందించి, ప్రభుత్వ వాహనంలో ఇంటి దగ్గర దింపే సంప్రదాయాన్ని కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించింది. రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటి దగ్గర దింపడం మాట దేవుడెరుగు.. రిటైరైన వారికి బెనిఫిట్లు కూడా ఇవ్వడంలేదు. రిటైరైన పలువురు ఆత్మహత్యలు చేసుకోగా, కొందరు ఆందోళనతో గుండెపోటు వచ్చి చనిపోయారు. పట్టణాల్లో తెల్లరేషన్ కార్డులు ఉన్న వారికి ఆస్తిపన్ను తగ్గిస్తామంటూ రేవంత్ ఇచ్చిన హామీ గంగలో కలిసింది
రెండేండ్ల కిందటి వరకు కేంద్ర ప్రభుత్వం పట్టణాలకు సంబంధించి ఏ అవార్డు ఇచ్చినా.. మొదటి వరుసగా తెలంగాణ రాష్ట్రం ఉండేది. కాంగ్రెస్ పాలనలో రెండేండ్లుగా ఇలాంటి అవార్డుల మాట వినిపించడంలేదు. దీన్ని బట్టి తెలంగాణలో ఎంత దారుణంగా పట్టణ విధ్వంసం జరుగుతున్నదో ప్రతి ఒక్కరికీ అర్థమవుతున్నది. పల్లెల్లో రైతులను గోస పుచ్చుకుంటున్న రేవంత్ సర్కార్.. పట్టణాల్లో ఉద్యోగులను గోస పుచ్చుకున్నది. తెలంగాణ సమాజం ఇప్పుడు మేలుకున్నది. ఇంటి మనిషిని వదులుకొని.. వలస మనిషికి బంటును నమ్మి నెత్తిన పెట్టుకున్నందుకు ఫలితం ఏమిటో ప్రజలకు అర్థమైంది. ఇక మిగిలింది.. పంచాయతీల మాదిరిగానే పురపోరులోనూ పాలకులకు పరాభవమే.
కర్నాటి విద్యాసాగర్