గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన తీర్పు కాంగ్రెస్ పాలనపై ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లకు గల వ్యతిరేకతకు అద్దం పడుతున్నది. కరీంనగర్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చావో రేవో అన్నట్టుగా ప్రచారం చేసింది. ఏడుగురు మంత్రులు, 24 మంది శాసనసభ్యులు నెల రోజులకు పైగా ప్రచారం చేశారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి ముఖ్యమంత్రి స్వయంగా గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఒకవైపు ఎస్ఎల్బీసీ ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకుపోతే, ఘటనా స్థలానికి వెళ్లి సమీక్ష నిర్వహించకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తమ 15 నెలల పాలన నచ్చితే ఓటు వెయ్యాలని ప్రచారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్, అదే సమయంలో తాము ఒక్క సీటు గెలవకపోయినా పోయేదేమీ లేదని ఓటర్లను బెదిరించే ప్రయత్నం చేశారు. విజ్ఞులైన ఓటర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి గాడి తప్పుతున్న పాలనను సరిచేసుకోవాలని హెచ్చరించారు. 55 వేల ఉద్యోగాలు ఇచ్చామని, ఆరు గ్యారెంటీలు అమలు చేశామని చెప్పిన అబద్ధాలు, గ్రాడ్యుయేట్ ఓటర్లు అర్థం చేసుకొని బుద్ధి చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కానీ, ఏ ఒక్క హామీనీ సంపూర్ణంగా నెరవేర్చలేదు. పైగా, కేసీఆర్ ప్రభుత్వ పథకాల అమల్లోనూ మీనమేషాలు లెక్కిస్తున్నారు. అన్నీ సగంసగం చేసి చేతులు దులుపుకొన్నారు. రుణమాఫీ కథ కంచికి వెళ్లింది. రైతు భరోసా ఎగవేసింది. కౌలు రైతులకు కన్నీరు మిగిల్చింది. విద్యుత్తు పరిస్థితి తీరని వ్యధలాగా మారింది. శాంతి భద్రతలు దిగజారాయి. గురుకులాల్లో విద్యార్థులకు భద్రత ఉండటం లేదు. మూసీనది పునరుజ్జీవం పేరుతో పేద ప్రజలకు ముప్పు తెచ్చి పెట్టారు. హైడ్రా పేరిట హైడ్రామా నడుపుతున్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఇది.
రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఓటర్లుగా ఉన్న ఉద్యోగులు, నిరుద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. అధికారంలోకి రాగానే ఆరు నెలల కాలంలో పీఆర్సీ అమలు చేస్తామని, డీఏ విడుదల చేస్తామని, హెల్త్ కార్డులు జారీ చేస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చి ఒక డీఏను మాత్రమే విడుదల చేసి సర్దుకోమని చెప్పడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దీంతో వారు న్యాయం కోసం కోర్టుకెక్కారు.
2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఐదారు వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసి, గత ప్రభుత్వంలో ప్రాసెస్ చేసి నిలిచిపోయిన 45 వేల ఉద్యోగాలకు నియామకాలు ఇచ్చి తమ ఖాతాలో వేసుకొని గొప్పలు చెప్పి కాలం గడిపారు. జాబ్స్ లేని క్యాలెండర్‌తో నిరుద్యోగులను మోసం చేశారు. నిరుద్యోగ సమస్యలపై పోరాడిన విద్యార్థులపై చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ, అశోకనగర్లో లాఠీఛార్జ్ చేసి, అరెస్టులు చేసి హైదరాబాద్‌ను నిరుద్యోగుల శోక నగరంగా మార్చారు.
ఎన్నికల్లో డబ్బు ప్రభావం తీవ్రం కావడంతో పెద్దల సభకు పేదలు ఇక ముందు రావడం కష్టమనే విషయం స్పష్టం అవుతున్నది. గతంలో అనేకమంది విద్యావేత్తలు, మేధావులు, ఉద్యమకారులు గెలిచి ఎమ్మెల్సీలు అయ్యారు. కానీ ఇప్పుడు కార్పొరేట్ వ్యక్తులు రంగంలోకి దిగుతున్నారు. ఇదే ధోరణి కొనసాగితే తెలంగాణ భవిష్యత్తు ఏమైపోతుందోనన్న ఆందోళన కలగకమానదు. ఎన్నో సామాజిక ఉద్యమాలు, పోరాటాలు నడిపి దేశానికే ప్రత్యామ్నాయం చూపించిన తెలంగాణ తప్పకుండా ఇలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొని రాజకీయ చైతన్యంతో ముందుకు సాగాలని ఆశిద్దాం.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించాలని బీసీ సంఘం నేతలు పిలుపునివ్వడం కొంత మేర పనిచేసింది. గ్రాడ్యుయేట్ ఓటర్లు ప్రసన్న హరికృష్ణ వైపు నిలబడటం వల్ల గణనీయమైన ఓట్లు సాధించారు. బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక గ్రాడ్యుయేట్లు కూడా ప్రసన్నకే ఓట్లు వేశారు. ఇక, కుల గణనలో అన్యాయం జరిగిందని తీన్మార్ మల్లన్న సహా బీసీ సంఘాలు ప్రకటించినా, ప్రభుత్వం మాత్రం తమ లెక్కే కరెక్ట్ అని దబాయిస్తున్నది. బీసీ కులాల సంఖ్యను తగ్గించి వారికి అన్యాయం చేసే కుట్ర చేస్తున్నదన్న ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని, చర్చకు రావాలని బీసీ ‘జాక్’ ప్రకటించింది. సర్వేలో వేసిన ప్రశ్నలు ప్రజలను బెదిరించేలా ఉన్నాయని ప్రజలు భావించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సర్వేలో పాల్గొనలేదని పదే పదే చెప్పడం సమస్యను పక్కదారి పట్టించడమే. రిజర్వేషన్లను రాష్ర్టాల యూనిట్‌గా నిర్ణయించే అధికారం ఆయా రాష్ట్ర శాసనసభలకు ఉండే ఉండాలని కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పారు.కానీ కేంద్ర ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుండా జటిలం చేసే ప్రయత్నం చేసింది.
ఇక, ఉపాధ్యాయ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు. రెండు స్థానాల్లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా మారిన జనసమితి ప్రతిపాదించిన ఇద్దరూ పరాజయం పాలయ్యారు. నల్లగొండ జనసమితి అభ్యర్థికి 34 నియోజకవర్గాల్లో 24 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయిన అభ్యర్థి పోటీచేసి ఓడిపోయారు. కాంగ్రెస్ మద్దతుతో పోటీచేసిన వామపక్ష అభ్యర్థి పరాజయం చెందారు. తీన్మార్ మల్లన్న బలపరిచిన బీసీ అభ్యర్థులు కూడా గెలువలేక పోయారు. దీనిని బట్టి ప్రభుత్వంతో సంబంధం ఉన్న ఏ అభ్యర్థినీ ఉపాధ్యాయులు ఆదరించలేదు.
317 ఉత్తర్వులను సరిచేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం, పీఆర్సీ అమలు, కరువుభత్యం కంచికి చేరడంతో పాటు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల విసిగి పోయిన ఉపాధ్యాయుల మనోగతాన్ని ఎన్నికలు స్పష్టంగా సూచించాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఓటు ద్వారా డిమాండ్ చేసిన ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి మారాలని కోరుకుందాం. అయితే, ఉపాధ్యాయ ఉద్యమాలతో, సమస్యలతో ఎలాంటి సంబంధం లేని కార్పొరేట్ తరహా వ్యక్తులు ఎన్నికలలో విజయం సాధించడం ఆందోళన కలిగిస్తున్నది.
ఎన్నికల్లో డబ్బు ప్రభావం తీవ్రం కావడంతో పెద్దల సభకు పేదలు ఇక ముందు రావడం కష్టమనే విషయం స్పష్టం అవుతున్నది. గతంలో అనేకమంది విద్యావేత్తలు, మేధావులు, ఉద్యమకారులు గెలిచి ఎమ్మెల్సీలు అయ్యారు. కానీ ఇప్పుడు కార్పొరేట్ వ్యక్తులు రంగంలోకి దిగుతున్నారు. ఇదే ధోరణి కొనసాగితే తెలంగాణ భవిష్యత్తు ఏమైపోతుందోనన్న ఆందోళన కలగకమానదు. ఎన్నో సామాజిక ఉద్యమాలు, పోరాటాలు నడిపి దేశానికే ప్రత్యామ్నాయం చూపించిన తెలంగాణ తప్పకుండా ఇలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొని రాజకీయ చైతన్యంతో ముందుకు సాగాలని ఆశిద్దాం. ఎన్నికల కమిషన్ ఓటర్లకు అవగాహన కల్పించలేకపోవడం వల్లే దాదాపు 28,000 ఓట్లు చెల్లకుండా పోయాయి. రాజకీయ పార్టీల నాయకులు సైతం ప్రచారానికి ఇచ్చిన ప్రాధాన్యం ఓటుపై అవగాహన కల్పించడంలో చూపించలేదు. గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు ప్రక్రియలో సమూల మార్పులు రావాలి. 25 లక్షలకు పైగా ఉన్న గ్రాడ్యుయేట్లలో కేవలం 3.55 లక్షల మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. ప్రతిసారి ఓటును నమోదు చేసుకోవడం తప్పనిసరి కావడంతో ఓటర్లు అంతగా ఆసక్తి చూపడం లేదు. వార్డు సభ్యుడికి సైతం ఎన్నికల ఖర్చుపై పరిమితి విధిస్తున్న ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో విధించకపోవడం వల్ల ఖర్చు కోట్లు దాటుతున్నది. వం దల కోట్లు ఖర్చు పెట్టి గెలవగల అభ్యర్థులకు ఎన్నికల సంఘమే రాచబాట వేయడం విషాదం.
– (వ్యాసకర్త: టీఎన్జీవో పూర్వ అధ్యక్షుడు) జి.దేవీప్రసాద్ రావు