బెంగళూరులో ‘ది హిందూ‘ పత్రిక నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను నాలుగు వేలకు కుదిస్తామని ప్రకటించారు. అదే సమయంలో నీతి ఆయోగ్ సమావేశంలో మాట్లాడుతూ దేశాభివృద్ధికి విద్య, వైద్యమే బలమైన పునాది అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 23 వేల పాఠశాలల మూసివేతకు రంగం సిద్ధం చేస్తూ, మరోవైపు అందుకు విరుద్ధంగా చేస్తున్న ప్రకటనలకు పొంతనలేదు. ఇంకోవైపు నియోజకవర్గానికి ఒకటి చొప్పున నిర్మిస్తామని చెప్తున్న యంగ్ ఇండియా స్కూల్స్ గురించి కూడా పొంతనలేని ప్రకటనలతో గందరగోళం సృష్టిస్తున్నారు.
విద్యార్థి నివసించే ఆవాసానికి సమీపంలో పాఠశాల అందుబాటులో ఉండాలని, ఆ బాధ్యతను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహించాలని ‘విద్యా హక్కు చట్టం-2009‘ చెప్తున్నది. ఆ చట్టంలోని సెక్షన్ 5 (1) (ఏ) (బీ) ప్రకారం ఐదో తరగతిలోపు చదివే విద్యార్థులకు కిలోమీటర్ దూరంలో, ఆపై తరగతులు చదివే విద్యార్థులకు మూడు కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వమే పాఠశాల సౌకర్యం కల్పించాలని స్పష్టంగా ఉన్నది. బడ్జెట్లో విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని చెప్పి ఇప్పటికీ 8.2 శాతానికి మించట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్లలో 4వేల పాఠశాలలను మూసివేసింది. మరోవైపు ప్రాథమిక, ఉన్నత పాఠశాలు, ఉన్నత విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు, శాశ్వత సిబ్బంది లేకుండా దివాలా స్థితికి చేరుకుంటున్నాయి. పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ నివేదిక ప్రకారం జాతీయ ర్యాంకింగ్లో తెలంగాణ 26 నుంచి 28వ స్థానానికి దిగజారింది. దేశంలోని 783 జిల్లాల్లో తెలంగాణలోని 28 జిల్లాలు 300 నుంచి 675 స్థానాల్లో ఉన్నాయి. ఇవి బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లాంటి వెనుకబడిన జిల్లాలతో సమానంగా ఉన్నాయి.
రాష్ట్రంలో బహుళ తరగతి బోధన వలన ప్రభుత్వ పాఠశాలల పట్ల విశ్వాసం కోల్పోయి, అందులో చదివే పిల్లల సంఖ్య తగ్గిపోయింది. ఒక్కో తరగతికి ఒక టీచరు, ఒక గది ఉండేలా చూస్తే ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలు వస్తారు. ఆ మేరకు ప్రభుత్వం విశ్వాసం కలిగించే చర్యలు చేపట్టాలి.
ప్రస్తుతం ఉన్న 27 వేల పాఠశాలల్లోని తక్షణ సమస్యల పరిష్కారం పట్ల చొరవ చూపకుండా, రూ.23 వేల కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని అనుకోవడంలో ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి? ఇంటిగ్రేటెడ్ పాఠశాలల విధివిధానాలు, పాఠశాలల నిర్వహణ విధానాలు, ఉపాధ్యాయుల నియామకం ఏమీ లేకుండా కులాల గోడలు కూల్చివేస్తామని ఆర్భాటపు ప్రసంగాలతో విద్యా విధానంలో మార్పులు రావు.
అన్ని రకాల రెసిడెన్షియల్ పాఠశాలలను కేంద్రీకృతం చేస్తూ నిర్వహించబోయే ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల్లోకి విద్యార్థులు ప్రస్తుత ప్రభుత్వ గ్రామీణ పాఠశాలల నుంచే చేరక తప్పదు. ప్రభుత్వ నిర్వహణలోని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్ బడుల్లో నమోదు మరింతగా తగ్గుముఖం పట్టి పాఠశాలలు అంతరించి పోయే ప్రమాదం లేకపోలేదు. ఇందుకోసం వ్యయం చేసే కోట్లాది రూపాయల నిధులతో ఇప్పుడున్న 27 వేల ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ మౌలిక సదుపాయాలు, తాగునీరు, మరుగుదొడ్లు, ఆట స్థలాలు కల్పించే చర్యలు చేపట్టవచ్చు. ఈ పాఠశాలలన్నింటినీ సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్పు చేయవచ్చు.
రాష్ట్రంలో ఐదు రకాల గురుకులాలతోపాటు అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లు, కేజీబీవీ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, ఏకలవ్య మాడల్ పాఠశాలలు, మూగ, చెవిటి విద్యార్థుల ఆశ్రమ పాఠశాలలతో పది రకాల రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రభుత్వ పాఠశాలలతో ప్రభుత్వ రంగంలో ఉన్న అనేక రకాల అంతరాల పాఠశాలలు ఏక రూప విద్యను అందించడం లేదు. ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ పాఠశాలలు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటైతే మరో రెండు రకాల పాఠశాలలు ఉనికిలోకి వస్తాయి. పైన తెలిపిన పాఠశాలలకు అదనంగా మరో రెండు చేరుతాయి. తెలంగాణ సమాజానికి కావలసింది అంతరాలతో కూడిన విద్య కాదు. 27 వేల పాఠశాలలను పటిష్టంగా నిర్వహించే శాశ్వత విధానాలు కావాలి. అందుకోసం ఈ పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగు కోసం నిధుల కేటాయింపు జరగాలి. బడ్జెట్ కేటాయింపులు పెరగాలి. పాఠశాలల పర్యవేక్షణ కోసం 25 కొత్త జిల్లాలకు డీఈవో పోస్టుల మంజూరుతోపాటు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, మండల విద్యాధికారుల పోస్టులను భర్తీ చేసే చిత్తశుద్ధి కలిగిన విధానాలు అమలు కావాలి. ఆచరణాత్మక విధానాలు, క్షేత్రస్థాయి వాస్తవాలు, తెలంగాణ సమాజపు అవసరాల ప్రాతిపదికన విద్యా విధానాన్ని రూపొందించి అమలు చేయాలి.
మౌలిక వసతులు కల్పించకపోవడం, విద్యా ప్రమాణాలు పెంచే విధంగా పర్యవేక్షణ అధికారుల నియామకం చేయకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులను ఆకర్షించలేకపోతున్నాయి. అంతేకాదు ప్రాథమిక పాఠశాలలకు అనుబంధంగా ప్రీ ప్రైమరీ తరగతులు లేకపోవడంతో తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయించడంతో ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు తగ్గింది.
ప్రభుత్వ పాఠశాలల్లో చేరే పిల్లలంతా గురుకులాలకు తరలిపోయారు. ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యలో శిక్షణ ప్రారంభించి, తల్లిదండ్రులను ఆకర్షించే చర్యలు చేపట్టకుండా, విద్యార్థులు రావడం లేదనే సాకుతో పాఠశాలలను మూసివేస్తామని ప్రకటించడంతో ప్రభుత్వం పేదలకు వెనుకబడిన గ్రామీణ వర్గాల పిల్లలకు ప్రభుత్వ విద్య అందకుండా చేస్తున్నది. పటిష్టమైన బోధన వాతావరణాన్ని కల్పిస్తూ శాశ్వత ప్రణాళికలను రూపొందించకుండా ఆర్భాటపు ప్రకటనలతో కొత్త పాఠశాలను ప్రారంభిస్తే సంక్షోభం సమసిపోదు. ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య అందిస్తేనే మంచి సమాజం నిర్మితమవుతుంది.
ఊర్లో ఉన్న బడి, గ్రామంలోని అన్ని సమస్యల చర్చా కేంద్రంగా ఉండి అక్కడి సమస్యల పరిష్కారానికి దోహదకారిగా ఉంటుంది. అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు గ్రామాల్లో చైతన్యం కలిగిస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతారు. అలాంటి చైతన్య కేంద్రం మూతపడితే గ్రామానికి భవిష్యత్తు ఉండదు. గ్రామీణ పేద విద్యార్థులు చదువుతున్న సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలను పెద్ద ఎత్తున వేలాదిగా మూసివేస్తామని ప్రకటించడం అప్రజాస్వామ్యం, అమానుషమే గాక రాజ్యాంగ వ్యతిరేకం. ఆచరణ సాధ్యం కాని విధానాలు ప్రకటించి ప్రజలకు విద్యను మరింత దూరం చేసే చర్యగా వేలాది పాఠశాలల మూసివేతను చూడాల్సి ఉంటుంది. ప్రతిరోజూ కొత్త విన్యాసాలతో, కొత్త విధానాలతో పిల్లలను పరీక్షించే వేదిక పాఠశాల కాదు ! ఈ రోజు ఒక తీరు, రేపొక తీరు, ఎల్లుండి మరో మార్పులతో ఇలా గాలివాటం విధానాలతో విద్యారంగాన్ని గందరగోళంలో పడేస్తున్నారు. నిర్దిష్టమైన విద్యా విధానంతో తెలంగాణ పాఠశాల విద్యా విధానాన్ని రూపొందించాలని కోరుతూ ప్రభుత్వం పాఠశాలల మూసివేత ప్రతిపాదనను విరమించుకోవచ్చు. విద్యా పరిరక్షణ కమిటీ పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నది.
(23 వేల పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ ‘తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ‘ ఆధ్వర్యంలో నేడు (13-6-2026) రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్న సందర్భంగా).