రాజమండ్రి.. ఈ పేరు తెలుగువారిలో ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక భావనను కలిగిస్తుంది. ఇది తెలుగు సినిమాల ప్రభావం వల్ల కావచ్చు. కానీ, వాస్తవానికి కొబ్బరి చెట్లు, పచ్చటి పొలాలు, ప్రవహించే కాలువలు, నీళ్ల ప్రవాహాన్ని నియంత్రించే పాత లాకులతో ఈ ప్రాంతం ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. మరీ ముఖ్యంగా ఇక్కడి ప్రజల మాటకారితనం, ఆత్మైస్థెర్యం కట్టిపడేస్తాయి. సినిమాల్లో ఈ ప్రకృతి రమణీయత ఒక మాయజాలంలా కనిపిస్తుంది. రాజమండ్రి అనగానే మనకు వెంటనే గుర్తుకువచ్చేది.. నిండుగా పారే గోదావరి, ఆ నదిపై విస్తరించిన ఐదు కిలోమీటర్ల పొడవైన రైల్వే బ్రిడ్జి. ఒక్క మాటలో చెప్పాలంటే, మనుషులు, ప్రకృతి మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుబంధానికి ఈ ప్రాంతం ప్రతీక అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణానికి ముందు ఉభయ గోదావరి జిల్లాలు దుర్భిక్ష ప్రాంతాలుగా ఉండేవి. అభివృద్ధికి దూరంగా ఉండే ఈ ప్రాంతాలు తరచూ కరువు, వరద ప్రభావానికి గురయ్యేవి. 183233లో తీవ్రమైన కరువు, ఆ తర్వాత 183538 మధ్యకాలంలో వరుసగా మూడేండ్లు కరువు, 1839లో తుఫాను, ఆ తర్వాత సంవత్సరాల్లో కూడా విపత్తులు ఆ ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. వరుస కరువులు, విపత్తుల కారణంగా ఆహారం లేక నిరాశ్రయులై ఆ ప్రాంతంలోని మూడో వంతు ప్రజలు మరణించారు. ఈ కాలాన్ని చరిత్రకారులు ‘డొక్కల కరువు’గా (శరీరంలో మాంసం లేకుండా కేవలం ఎముకలు కనిపించే స్థితి) పేర్కొంటారు. ఆ కాలంలో బతుకడానికి పిల్లలను కొన్ని అణాలకే అమ్మేవారని ఒక సందర్భంలో సర్ ఆర్థర్ కాటన్ కుమార్తె ఎలిజబెత్ రీడ్ కాటన్ (లేడీ హోప్) చెప్పారు.
ఈ దుస్థితికి విరుద్ధంగా నేడు గోదావరి డెల్టా అత్యంత సారవంతమైన, వ్యవసాయ ఉత్పాదకత కలిగిన ప్రాం తంగా మారింది. ఇది సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ధవళేశ్వరం ఆనకట్ట వల్లే సాధ్యమైంది. 1847లో ప్రారంభించి, 1852లో పూర్తయిన ఈ ఆనకట్ట ప్రజలను ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడటమే కాకుండా ఆధునిక సాగునీటి వ్యవస్థకు బాటలు వేసింది. ఆయనను ఇప్పటికీ అక్కడి ప్రజలు ఆరాధిస్తారు.
అయితే, విమర్శనాత్మక దృష్టితో చూస్తే కాటన్ ఈ ఆనకట్టను బ్రిటిష్ ప్రభుత్వ ప్రయోజనాల కోసం నిర్మించారని భావించవచ్చు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి భూమి శిస్తు ద్వారా ఆదాయాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యమని.. కరువు నివారణ, ఈ ప్రాంత అభివృద్ధి ద్వితీయ లక్ష్యాలని విమర్శకులు అంటారు.
రాజమండ్రి దగ్గర గోదావరి నది ఏడాది పొడవునా నిండుగా ప్రవహించడానికి ధవళేశ్వరం ఆనకట్ట కారణం. ఇది రాజమండ్రి నుంచి సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ఆనకట్ట లేకుంటే ఒక్కసారి ఆ ప్రాంతాన్ని ఊహించుకోండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే.. తెలంగాణ అంతటా గోదావరిపైన ఇలాంటి బ్యారేజీలను నిర్మించి ఉంటే రాజమండ్రి వంటి అనేక సాంస్కృతిక కేంద్రాలతో తెలంగాణ విలసిల్లేది. అయితే, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా బ్యారేజీలు నిర్మించినప్పటికీ, అవి రాజకీయ క్రీడలో పావులుగా మారడం తెలంగాణ చేసుకున్న దురదృష్టకరం. తెలంగాణకు దక్కాల్సిన గోదావరి జలాలు రాజకీయాల వల్ల తెలంగాణ రైతాంగానికి అందకపోవడం మన దౌర్భాగ్యం.
ఇక్కడ ఇంకో ఉదాహరణ కూడా చెప్పుకోవాలి. అది ఉమ్మడి ఏపీలో నిర్మించిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. దీన్ని నిర్మించకముందు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు కరువుతో అల్లాడేవి. ఆ జిల్లాల ప్రజలు తక్కువ జీవన ప్రమాణాలతో బాధపడేవారు. గోదావరి జిల్లాలతో పోలిస్తే ఈ జిల్లాల రాజకీయ, సాంస్కృతిక ప్రాబల్యం కూడా చాలా తక్కువ. అయితే, ఈ ప్రాజెక్టును నిర్మించాక ఈ జిల్లాలు సామాజిక, ఆర్థికపరంగానే కాదు, రాజకీయపరంగానూ అసాధారణమైన వృద్ధి సాధించాయి.
ఈ ప్రాంతం అభివృద్ధి ప్రధానంగా కుల రాజకీయాలు, మీడియా, చలనచిత్ర పరిశ్రమలో కులాధిపత్యానికి దారితీసింది. కాళేశ్వరం, బనకచర్లపై నేడు చర్చ జరుగుతున్న నేపథ్యంలో ధవళేశ్వరం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల పోలిక, వాటి వల్ల జరిగిన మార్పులపై చర్చించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. నీటిపారుదల ప్రాజెక్టులు ఆ ప్రాంత ఆర్థిక, సామాజిక స్థితిగతులను మెరుగుపరచడమే కాకుండా, రాజకీయ ప్రాబల్యాన్ని, సాంస్కృతిక ఆధిపత్యాన్ని పెంచడానికి కూడా దోహదపడతాయి. ధవళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఆర్థికంగా ఎదిగిన ఉభయ గోదావరి జిల్లాలు మద్రాస్-ఆంధ్ర రాజకీయాలను ప్రభావితం చేయగా, నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి చెందిన కృష్ణా-గుంటూరు జిల్లాలు ఉమ్మడి ఏపీ రాజకీయాలను శాసించాయి.
ఉభయ గోదావరి జిల్లాలు గాని, కృష్ణా-గుంటూరు జిల్లాలు గాని ఆయా ప్రాంతాల్లో నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించకముందు తెలంగాణలోని ఏ ఒక్క జిల్లా కంటే కూడా ముందంజలో లేవనే విషయాన్ని తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా రైతులు గుర్తించాలి. ఖర్చు లేకుండా సాగు నీరు లభ్యమవడంతో ఈ జిల్లాల్లో వ్యవసాయం లాభసాటిగా మారింది. వ్యవసాయంలో వచ్చిన ‘మిగులు’ ద్వారా వారి రాజకీయ ఆధిపత్యం పెరిగింది. నీటిపారుదల ప్రాజెక్టులు లేకుండా రాజకీయ నాయకత్వం బలపడదు. ఈ కోణంలో ఆలోచిస్తే కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చూపెట్టడం ఒక రాజకీయ వ్యూహంగా కనిపిస్తున్నది. కాళేశ్వరంపై లేనిపోని ఆరోపణలు చేయడం, దుష్ప్రచారం చేయడం, తద్వారా దానిపై నిరర్థక ప్రాజెక్టుగా ముద్ర వేసి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడం వారి మొదటి లక్ష్యం. రెండవది, ఆర్థికంగా ఎదగకుండా చేసి తెలంగాణపై వెనుకబడిన ప్రాంతంగా ముద్రవేసి, ఇక్కడి ప్రజలను శాశ్వతంగా ఆత్మన్యూనతాభావంలో ఉంచడం.
ఇక బనకచర్ల విషయానికి వద్దాం. బనకచర్ల ప్రాజెక్టు నిర్మించనున్న ప్రాంతం, అంతర్-బేసిన్ జలాల మళ్లింపు, ఈ ప్రాజెక్టు ప్రతిపాదిత సమయంపై తెలంగాణవాదులు ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘మిగులు జలాలు’ అనే భావనను తెలంగాణ నీటిపారుదల ఇంజినీర్లు వ్యతిరేకిస్తున్నారు. చివరి ప్రాజెక్టును దాటిన తర్వాత నదిలో లభ్యమయ్యే నీటిని ‘మిగులు’గా పరిగణించాలని ఇంజినీర్లు వాదిస్తున్నారు. ఈ లెక్కన గోదావరి విషయంలో ధవళేశ్వరం బ్యారేజీని దాటిన తర్వాతే పారే జలాలలను మిగులుగా పేర్కొనాలి. అందువల్ల మిగులు జలాలపై ఆధారపడి నిర్మించే ఏ ప్రాజెక్టు అయినా ధవళేశ్వరం దిగువన ఉండాలే తప్ప, ఎగువన కాదని వారు వాదిస్తున్నారు. అట్లాగే, ఎగువ ఉన్న నదీ పరీవాహక తీర రాష్ర్టాల అవసరాలు పూర్తిగా తీర్చకుండా అంతర్-బేసిన్ మళ్లింపు జరగకూడదని వారు గట్టిగా వాదిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకుల పుణ్యమాని తెలంగాణలో దశాబ్దాల తరబడి గోదావరి ఎండిపోయింది. గోదావరి వల్ల తెలంగాణకు ఇసుమంతైనా ప్రయోజనం కలగలేదు. అందుకే, స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం తన సాగు, తాగునీటి అవసరాలను తీర్చుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది.
ప్రస్తుతం కాళేశ్వరం చుట్టూ జరుగుతున్న పరిణామాలు, రాజకీయ వివాదాలన్నీ పలు అనుమానాలను లేవనెత్తుతున్నాయి. గోదావరి నీటిని ఇలాగే వదిలేయడం ద్వారా ఏపీకి లబ్ధి చేకూర్చడం, ఇతర నదీ బేసిన్లకు జలాలను తరలించడం దీని వెనుక ఉన్న ఉద్దేశమని తెలుస్తున్నది. తమిళనాడులో ఓట్లు కొల్లగొట్టడానికి బనకచర్ల ద్వారా పెన్నా, తూతపూఝ బేసిన్లకు గోదావరి నీటిని మళ్లిస్తున్నట్టయితే తెలంగాణకు జరిగే నష్టం అంతా ఇంతా కాదు. అది తరతరాలకు శాపంగా మారుతుంది. ఎందుకంటే పోతిరెడ్డిపాడు ఉదాహరణ మన కండ్లముందే ఉన్నది.
కాళేశ్వరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అణా పైసా ఇవ్వలేదు. అయినా తెలంగాణ ప్రభుత్వమే పూర్తిగా తన సొంత వనరులతో ఈ ప్రాజెక్టును నిర్మించుకున్నది. నయా పైసా ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కాళేశ్వరం ద్వారా తెలంగాణకు అందుతున్న నీటిని ఇతర రాష్ర్టాల ప్రయోజనాల కోసం మళ్లించాలని చూస్తున్నది. తెలంగాణ జలాల విషయంలో ‘అమ్మ పెట్టదు అడుక్కుతిననివ్వదుట’ అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తున్నది.
బనకచర్లకు సంబంధించి మరో అతిపెద్ద సమస్య ఏమంటే.. పక్షపాత ధోరణిని అవలంబిస్తున్న మీడియా, వాటిలో వస్తున్న కథనాలు. ఈ మీడియా ఎలాంటిదో అర్థం చేసుకునేందుకు కాళేశ్వరం విషయంలో జరిగిన విమర్శలు, దుష్ప్రచారమే చక్కని ఉదాహరణ. ఆర్థికంగా ఈ ప్రాజెక్టు సాధ్యపడుతుందా? ఆర్థిక భారం, స్థిరత్వం, పర్యావరణానికి జరిగే నష్టం, ప్రాజెక్టు వల్ల ముంపు, అటవీ సంరక్షణ, ముఖ్యంగా తెలంగాణకు నీళ్లు ఎందుకు అవసరమనే ప్రాథమిక ప్రశ్న సహా అనేక అంశాలపై దుష్ప్రచారం చేస్తూ ఈ మీడియా ప్రశ్నలు లేవనెత్తింది. తెలుగు, ఇంగ్లిష్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇలాంటి ప్రశ్నలతో కూడిన కథనాలే ఎక్కువగా కనిపించాయి. ప్రధానమైన ప్రశ్నలు ఏమంటే.. నీళ్లను లిఫ్ట్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అంతగా ఖర్చు చేస్తున్నది? అందుకు అవసరమైన విద్యుత్తు భారాన్ని ఎందుకు మోయాలి? తెలంగాణను తరతరాలుగా కరువు ప్రభావిత ప్రాంతంగా ఉంచాలనుకోవడమే వారి ఉద్దేశమని సుస్పష్టం.
పెరిగిన నీటిపారుదల వసతి అధిక వరి సాగుకు దారితీస్తుందని, తద్వారా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలకు పెరుగుతాయని కొందరు నిపుణులు వాదించడం విడ్డూరం. అటవీ భూములు మునిగిపోవడాన్ని ప్రస్తావిస్తూ పర్యావరణ ఆందోళనలను లేవనెత్తారు. అయితే, ఎక్కడ కూడా ఉమ్మడి ఏపీలో తెలంగాణ దశాబ్దాలుగా ఎదుర్కొన్న నిర్లక్ష్యం గురించి గాని, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా గురించి గాని ప్రస్తావించలేదు. తెలుగు, ఆంగ్ల మీడియాలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సమర్థిస్తూ ఒక్క కథనం కూడా ప్రచురితం కాలేదు. దీంతో జాతీయ ఆంగ్ల మీడియాలోనూ ఇలాంటి కథనాలే వచ్చాయి. నేటికీ కాళేశ్వరం వల్ల తెలంగాణలో జరిగిన మార్పు గురించి దేశ ప్రజలకు తెలియదు. ఈ ప్రతికూల ప్రచారం జాతీయ నిపుణులు, కేంద్ర పాలనా యంత్రాంగం, ట్రిబ్యునళ్లు, ఇతర వర్గాల వరకు అంతకంతకూ వ్యాపించింది.
ధవళేశ్వరం లేదా నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టుల ప్రభావం నీళ్లకు అతీతంగా ఉంటుంది. అది మేధో మూలధనాన్ని సృష్టిస్తుందని గుర్తించడం చాలా ముఖ్యం. తెలంగాణ విషయంలో కాళేశ్వరానికి మద్దతిచ్చే నిపుణులు, మేధావుల గొంతుకలు జాతీయ చర్చలో చాలా తక్కువగా వినిపించాయి. పక్షపాత మీడియా సంస్థలు వారి గొంతుకలను నొక్కివేశాయి. అందుకే దుష్ప్రచార కథనాలు ఈ చర్చలో ఎక్కువగా ఆధిపత్యం చెలాయించాయి.
ఇప్పుడు బనకచర్ల విషయానికి వద్దాం. నేడు దేశంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట బనకచర్ల. ఆ ప్రాజెక్టు ఆర్థికంగా సాధ్యపడుతుందా? దాని ఆర్థిక భారం మాటేమిటి? నదీ పరీవాహక ప్రాంతం వెలుపల నీళ్లను ఎందుకు మళ్లిస్తున్నారు? అంత అత్యవసరం ఏమొచ్చింది? అని తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా రైతాంగం నిలదీస్తున్నది. కాళేశ్వరం విషయంలో తీవ్ర చర్చనీయాంశమైన నీటిని ఎత్తిపోసే ఖర్చు గురించి ఇప్పుడు ఏ ఒక్క మేధావి కూడా గొంతు పెగలడం లేదు. పర్యావరణ సమస్య ఇప్పుడు అకస్మాత్తుగా తక్కువ ప్రాధాన్యాంశంగా మారిపోయింది. ప్రతిపాదిత పైప్లైన్లు నల్లమల అటవీ ప్రాంతం నుంచి వెళ్తాయి. దాని వల్ల సున్నితమైన పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. భారీ జలాశయాల నిర్మాణం వల్ల అక్కడి స్థానికులు నిరాశ్రయులవుతారు. కాళేశ్వరంపై విమర్శలు గుప్పించిన న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, హక్కుల కార్యకర్తలు సహా పౌర సమాజం ఇప్పుడు బనకచర్ల విషయంలో మౌనం దాల్చడం ఆందోళనకరం. ఈ గొంతుకలన్నీ మూగబోవడంతో బనకచర్ల పట్ల తెలంగాణ అభ్యంతరాలను నొక్కిపెట్టడం ద్వారా ఒక వర్గం మీడియా పక్షపాత ధోరణిని అవలంబిస్తున్నది. బనకచర్ల విషయంలో ఇలాంటి ఆందోళణలను లేవనెత్తితే వాటిని అభివృద్ధి నిరోధకులుగా అభిప్రాయాలుగా, రాజకీయ ప్రేరేపితమైనవిగా ఈ మీడియా తోసిపుచ్చుతున్నది.
ఇప్పుడు కూడా తెలంగాణకు బనకచర్ల ఏ విధంగా నష్టం చేస్తుందో తెలియజేయకుండా దాని వల్ల ఆంధ్రకు కలిగే ఉపయోగాల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నది. అదీ తెలంగాణ ఎడిషన్లలో. ఇది బానిస మనస్తత్వాలపై ప్రయోగించే సాధనం. తన అవసరాలు, తను ఏం కోల్పోతున్నాడో బానిసకు తెలియకుండా దాచిపెట్టి.. యజమాని, ఆయన కుటుంబ అవసరాలను ప్రముఖంగా చూపెట్టే ప్రయత్నంలో బానిసను త్యాగాల దిశగా నడిపించే ప్రయత్నం జరుగుతుంది. పోతిరెడ్డిపాడు విషయంలో అదే జరిగింది. ఇప్పుడు బనకచర్ల విషయంలో అదే జరుగుతున్నది. మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం రైతులను విస్మరించి కరువు జిల్లాల పేరుతో కృష్ణా నీళ్లను ఏపీకి తరలించినట్టు.. ఇప్పుడు అదే ప్రాతిపదికన తెలంగాణ రైతుల ప్రయోజనాలను తక్కువ చేసి చూపుతూ బేసిన్లో లేని రైతుల ప్రయోజనాలే ముఖ్యమన్నట్టు వార్తలు ప్రచురిస్తున్నారు.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఈ మీడియా రాసిన వార్తలను మనం చూశాం. కాళేశ్వరానికి వ్యతిరేకంగా జాతీయ నిపుణులు మొదలుకొని అనామకులు చెప్పే విషయాల వరకు మొదటి పేజీల్లో ఏ విధంగా ప్రచురించారో గుర్తుచేసుకోవాలి. ఎక్కడా వినపడని, చదువని వాదనలను కాళేశ్వరంపై ప్రచురించారు. టీవీల్లో ప్రసారం చేశారు. జల నిపుణులుగా చెప్పుకొనే వ్యతిరేకుల అభిప్రాయాలకు ఇచ్చిన విలువ కాళేశ్వరం వల్ల ఒనగూడే ప్రయోజనాలకు ఈ మీడియా ఇవ్వలేదు. నరనరానా తెలంగాణ అంటే వ్యతిరేకత నింపుకొన్న ఒక మేధావి వర్గం కాళేశ్వరం వల్ల కళ్లకు కనిపిస్తున్న అభివృద్ధిని విస్మరించింది. వారికే ఈ మీడియా పెద్దపీట వేస్తున్నది. ముఖ్యంగా వారి అభిప్రాయాలను ప్రచురిస్తున్నాయి ఈ పత్రికలు. టీవీల్లో చూపిస్తున్నారు. కాళేశ్వరం విషయంలో అదే జరుగుతున్నది. కాళేశ్వరం, బనకచర్ల కథనాల్లో మనకు ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. తెలంగాణను కించపరచడం, తెలంగాణ ప్రయోజనాలను తక్కువ చేయడం, తెలంగాణను ఆర్థికంగా దెబ్బతీయడమే ఈ వర్గం మీడియా లక్ష్యం.
తాము చదివే పత్రికలు, చూసే టీవీ చానళ్లు చాలా అరుదుగా తమ సమస్యలను ప్రస్తావిస్తాయని తెలంగాణ రైతు లు గుర్తించాలి. తాము చెప్పింది, చూపించిందే ముఖ్యమైన అంశమని భావించేలా ఈ పక్షపాత మీడియా తెలంగాణ ప్రజలపై తమ అభిప్రాయాలను రుద్దుతుంది. తెలంగాణ ప్రాజెక్టులను విస్మరించే మీడియా, వార్తాపత్రిక లు.. తెలంగాణ ప్రయోజనాలను సమర్థించే పత్రికల కంటే ఎక్కువగా ప్రాచు ర్యం పొందడం మన దురదృష్టకరం.
– చంద్రి రాఘవరెడ్డి (వ్యాసకర్త: ప్రొఫెసర్, డిపార్ట్మెంట్
ఆఫ్ సోషియాలజీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్)