రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ ప్రభుత్వ పర్సంటేజీల బాగోతం, కమీషన్ల దందా బట్టబయలైంది. ఈ అవినీతి కారణంగానే ఏడాదిన్నరకే ఖజానా ఖాళీ అయి సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, పింఛన్ల పెంపు, కేసీఆర్ కిట్ సహా పల్లెల్లో అభివృద్ధి పనులు, ఆఖరికి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల నిర్వహణ కూడా సజావుగా సాగలేని దుస్థితి దాపురించింది.
సరిగ్గా ఏడాదిన్నర కిందట ఈ పనులన్నీ జరుగుతూ, పథకాలన్నీ ప్రజలకు సకాలంలో అందుతుండేవి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అన్నీ ఆగిపోయాయి. అందుకు, ఆ పార్టీ అవినీతి కారణం కాదా? రాష్ట్రంలో పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నమిలితే ఆలస్యమవుతుందని నమలకుండానే రాష్ట్ర ప్రజల సొమ్మును మింగేస్తున్నది. రాష్ర్టాన్ని కేవలం 16 నెలలు పాలించిన తర్వాత స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీసేలా వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలో మన రాష్ట్రం పరిస్థితి బాగా లేదు. ఎక్కడా ఒక్క రూపాయి అప్పు పుట్టడం లేదు. ఎవ్వరూ మనల్ని నమ్మటం లేదు. బ్యాంకర్లను కలవడానికి పోతే దొంగను చూసినట్టు చూస్తున్నారు. ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. చెప్పులు ఎత్తుకుపోయే దొంగల్లా చూస్తున్నారు’ అని ఆయన ప్రకటించటమే ఇందుకు నిదర్శనం.
ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి జరుగని శాఖనే లేదు. పౌరసరఫరాల శాఖలో అవినీతి జరిగిన సంగతి రాష్ట్రంలోని ఏ చిన్న రైస్‌మిల్లర్‌ను అడిగినా పూసగుచ్చినట్టు చెప్తారు. అమృత్ టెండర్ల అవినీతి బాగోతంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రానికి అన్ని సాక్ష్యాధారాలతో సహా ఇప్పటికే ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. రాష్ట్రంలో పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందంటే… సామాన్య ప్రజలు, అధికారులతో నిత్యం కిటకిటలాడాల్సిన సచివాలయం, మంత్రుల ఆఫీసులు బోసిపోతున్నాయి. కానీ, మంత్రులు, ఎమ్మెల్యేల సెటిల్మెంట్ల కోసం ఏర్పాటుచేసిన ప్రైవేట్ ఆఫీసులు మాత్రం నిత్యం పైరవీకారులతో కిటకిటలాడుతున్నాయి.
ఒకవైపు స్వయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి కార్యాలయం ముందే కాంట్రాక్టర్లు తాము 20, 30 శాతం కమీషన్ చెల్లించుకోలేమని ధర్నా చేసే దుస్థితి రాష్ట్రంలో దాపురించింది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో భూ కొనుగోలు, అమ్మకాలు జరిగితే చాలు, గజాల చొప్పున కమీషన్ వసూలు చేస్తూ రియల్ ఎస్టేట్ రెండు కాళ్లు ఇప్పటికే విరిచి కూర్చోబెట్టారు. రాష్ట్ర స్థాయిలోనే ఇలా జరుగుతున్నదంటే గ్రామ, మండల స్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల పేరుతో జరుగుతున్న అవినీతి ఎంతనో ఊహించుకోవచ్చు. ఆఖరికి పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందంటే రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు విడుదల చేయాలంటే సెటిల్మెంట్కు రండి అంటూ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలను స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా పిలుపునిచ్చే స్థాయికి దిగజారింది. అందుకే, స్వయంగా వరంగల్‌కు చెందిన మంత్రి కొండా సురేఖ ‘మామూలుగా మంత్రుల దగ్గరికి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియెరెన్స్లు ఇస్తుంటారు’ అంటూ బహిరంగ సభలో బట్టబయలుచేశారు. అయినా ఆమె మీద ఇప్పటికీ కనీస చర్యలు లేవు. సురేఖ మంత్రులందరినీ ఉద్దేశించి అన్నప్పటికీ ఏ మంత్రి కూడా ఆమె వ్యాఖ్యలను ఖండించలేదు. అందుకే, అందరూ తేలు కుట్టిన దొంగల్లా మౌనం వహిస్తున్నారు.
రాష్ట్రంలో ఇంత అవినీతి జరుగుతున్నా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ తమ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనటం లేదు. ఎందుకంటే, తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎం వంటిది. దేశంలో ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలంగాణ ప్రజల సొమ్ము అక్కడికి వెళ్లాల్సిందే. మార్పు కోరి కాంగ్రెస్‌కు పట్టం కడితే ఆ పార్టీలో ఇంత మతలబు జరుగుతున్నదా అన్న ఆవేదన ప్రజల్లో వ్యక్తమవుతున్నది. కాబట్టి ప్రజలు సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టక మానరు.
– ఏనుగుల రాకేష్ రెడ్డి (వ్యాసకర్త: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు)