కేసీఆర్ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కల్యాణలక్ష్మి , షాదీముబారక్ పథకాల బంద్‌కు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు పన్నుతున్నది. ఈ రెండు పథకాల అమలుపై హైకోర్టు స్టే ఇచ్చింది. అర్హులైన లబ్ధిదారులకు డబ్బులు కూడా ఇవ్వకూడదని ఆదేశించింది. ఈ ఆదేశాలను తప్పకుండా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది కూడా. అయితే ఏ కేసులో అయినా వాదోపవాదాల అనంతరం తీర్పు వెలువడుతుంది. కానీ ఈ రెండు పథకాల మీద వచ్చిన కేసులో వాదోపవాదాలు జరుగలేదు. పిటిషనర్ వేసిన పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్‌పై కోర్టు ఆదేశాలు వెలువడేంత వరకు సర్కార్‌కు ఐదుసార్లు కౌంటర్ వేయడానికి సమయం ఇచ్చిన తర్వాత కూడా దాఖలు చేయలేదు. ఆదేశాల తర్వాత కౌంటర్ వేసినప్పటికీ అది ఎలాంటి ప్రభావం చూపలేదు. దీంతో కోర్టు తీర్పు అనివార్యంగా పిటిషనర్‌కు అనుకూలంగా వచ్చింది.
న్యాయ శాఖను కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. ఆయన పరిధిలో అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్, గవర్నమెంట్ ప్లీడర్ ఇలా అనేక మంది న్యాయకోవిదులు ఉంటారు. కానీ ఏ ఒక్కరూ దీనిపై స్పందించలేదు. సరైన సమయంలో కౌంటర్ వేయలేదు. జూలై 8న పిల్ నమోదైతే, ఆగస్టు 12 వరకు ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులను ప్రతివాదులుగా పిటిషనర్ పేర్కొన్నారు. అంటే కేసు రికార్డుల్లోకి ఎక్కిన వెంటనే వివరాలు ఆ అధికారులకు చేరుతాయి. కనీసం అధికారులైనా స్పందించి కౌంటర్ దాఖలు చేయాల్సి ఉండేది, కానీ చేయలేదు. కల్యాణలక్ష్మి అమలు బాధ్యత అడ్మినిస్ట్రేటివ్ లేదా నోడల్ ఏజెన్సీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వద్ద ఉన్నది. కానీ ఆ శాఖ కూడా కౌంటర్ దాఖలు చేయలేదు. అంటే న్యాయశాఖ మంత్రి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖ మంత్రులు ఐదుగురూ మౌనంగా ఉండి, కేసును నీరుగార్చే ప్రయత్నం చేసి ఈ రోజు ఆ పథకం నిలిచిపోయే పరిస్థితికి తెచ్చారు.
కల్యాణలక్ష్మి పథకం బీఆర్ఎస్ హయాంలో 2014 అక్టోబర్ 2న అమల్లోకి వచ్చింది. కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో సుమారు రూ.12 వేల కోట్లు ఖర్చు చేసి, సుమారు 13 లక్షల మందికి లబ్ధ్ది చేకూర్చారు. వీరిలో 2 లక్షల మంది ఎస్టీ కుటుంబాలు రూ.1,300 కోట్లు లబ్ధి పొందాయి. ఎస్సీలు సుమారు 3 నుంచి 4 లక్షల మంది, బీసీలు 6 నుంచి 7 లక్షల మంది, 2.3 లక్షల మంది మైనారిటీలు లబ్ధి పొందారు.
నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరడం వల్ల మధ్యవర్తులు, అధికారులు తదితరుల ప్రమే యం లేకపోవడంతో ఈ పథకానికి ప్రజల్లో మంచి స్పందన లభించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించడంతోపాటు ఈ పథకం కింద రూ.లక్షతో పాటు తులం బంగారం కూడా అందిస్తామని ఉదారంగా మాటిచ్చారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ప్రతి నెలా ఒకే వ్యక్తికి ఉచితంగా లబ్ధి చేకూర్చే పథకాలు కావు. వివాహం చేసుకునే 18 ఏండ్ల్లు నిండిన యువతికి ఒకసారి మాత్రమే ఆర్థిక సాయం అందించే పథకం. మిగతా పథకాలన్నింటికీ లేని అడ్డంకి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకే ఎందుకొచ్చింది? దీనికి గల కారణాలేంటి? తులం బంగారం ఇస్తానని ఎంతో గొప్పగా హామీ ఇచ్చినా నేటికీ ఇవ్వలేదని జనం నిలదీస్తారు కనుక ఈ పథకాన్నే లేకుండా చేసే కుట్రలకు కాంగ్రెస్ తెగబడింది.
పేదలు పేదలుగానే ఉండాలి, సంక్షేమ పథకాలు మాత్రం తీసెయ్యాలి అంటే ఎలా? కల్యాణలక్ష్మి పథకాన్ని తొలగించేందుకు యోచిస్తున్న ప్రభుత్వానికి రైతు బంధు పథకం తొలగించే దమ్మున్నదా? ఉచిత విద్యుత్తు పథకం ఆపేసే దమ్మున్నదా? అనర్హులు లేదా డబ్బున్నవాళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని వర్తింపజేస్తే లాయర్లు, కోర్టులు ప్రశ్నించాలి, శిక్షించాలి. కానీ పేదలకు ఉపయోగపడే పథకాన్ని మొత్తానికి లేకుండా చేయడం ఏంటి? లాయర్లే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కూడా వద్దంటే ప్రభుత్వం చేతులు కట్టుకొని చూస్తూ ఉంటుందా? ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుందని ఎవరైనా కోర్టు తలుపులు తడితే నిశ్శబ్దంగా ఉంటుం దా? హైడ్రా కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కొంటున్న అధికారులను కాపాడుతున్నట్టే కాపాడుకుంటారు కదా! మరి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలు నిలిపివేతను ఎందుకు అడ్డుకోలేదు? సకాలంలో కౌంటర్ దాఖలు చేయలేదెందుకు? అంటే ఉద్దేశపూర్వకంగానే ఈ పథకాన్ని రద్దు చేయాలనే కుట్రతోనే ప్రభుత్వం ఉన్నట్టుగా బోధపడుతున్నది. కావాలనే ప్రభుత్వ తర ఫు న్యాయవాదులు కోర్టులో కౌంటర్ దాఖలుపై నిర్లక్ష్యం చేశారనే విషయం అర్థమవుతున్నది.
కల్యాణలక్ష్మి పథకం సమర్థవంతంగా అమలు చేసేందుకు కేసీఆర్ పాలనాకాలంలో ఏనాడూ రాని అడ్డంకి ఇప్పుడే ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ పథకం రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నదని ఎందుకు కోర్టుకు వెళ్లలేదు? రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఆత్మగౌరవంతో బతికే హక్కు పౌరులకు లేదా? ఆర్టికల్ 15 క్లాజ్ 3 ప్రకారం రాష్ట్రంలోని మహిళలు, పిల్లల కోసం ఏదైనా ప్రత్యేక చట్టం లేదా అవకాశాలను రాజ్యాంగ విరుద్ధంగా, వివక్షగా చూడరాదని స్పష్టంగా ఉన్నది. రాజ్యాంగంలోని ఆదేశికసూత్రాలు ఆర్టికల్ 38, 39 ప్రకారం ప్రజ ల్లో లేదా సమాజంలో ఉండే సామాజిక, ఆర్థిక అసమానతలను రూపుమాపడం ప్రభుత్వాల బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చడంలో భాగమే కల్యాణలక్ష్మి పథకం. దీని అమలును సమానత్వానికి వ్యతిరేకంగా చూడడం సరైంది కాదు.
– (వ్యాసకర్త: లా విద్యార్థి, పీఆర్ఆర్ కాలేజీ)
దూడపాక నరేష్ 9704050285