ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా ప్రచారం చేసుకున్న తెలంగాణ రైజింగ్ విదేశీ యాత్రలో భాగంగా అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం చర్చకు దారితీసింది. కేంద్రం రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించలేదని, సీఎం ప్రతిపాదించిన అమెరికా పర్యటన కార్యక్రమం ఆయన పదవికి, పర్యటన ఉద్దేశానికి తగిన విధంగా లేదని విదేశాంగశాఖ స్పష్టం చేయడం రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన అవగాహనా లోపానికి నిదర్శనం. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం నిర్ణయంలో రాజకీయ కోణం ఉన్నదని ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలో అసలు లోపం ఎక్కడుంది? కేంద్రంలోనా, రాష్ట్ర ప్రభుత్వ పర్యటన ప్రణాళికలోనా అనేదే ఇప్పుడు ప్రశ్న.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటన సాధారణ వ్యక్తిగత పర్యటన కాదు. ఆ యన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినిధి. అందువల్ల ఎవరిని కలుస్తారు? ఎందుకు కలుస్తారు? ఆ సమావేశాల వల్ల రాష్ర్టానికి, దేశానికి ఏం ప్రయోజనం? ఎంత పెట్టుబడి వచ్చే అవకాశం ఉన్న ది? ఎన్ని ఉద్యోగాలు సృష్టించగలరు? ఏ సాంకేతికత లేదా విద్యా భాగస్వామ్యాలు ఏర్పడుతా యి? గతంలో కుదుర్చుకున్న ఎంవోయూ లో ఎ న్ని అమలయ్యాయి? వంటి అంశాలతో స్పష్టమై న ప్రణాళిక ఉండాలి. ప్రభుత్వ ఖర్చుతో విదేశాలకు వెళ్లి, కొందరు ప్రతినిధులను కలువడం, ఫొ టోలు దిగడం, కొన్ని ఒప్పందాలు చేసుకోవడం మాత్రమే పర్యటన విజయానికి ప్రమాణం కాదు.
తెలంగాణ రైజింగ్ పేరుతో అమెరికాలో పెట్టుబడులు, పరిశ్రమలు, టెక్ సంస్థలను తెలంగాణకు ఆహ్వానించడమే ప్రధాన లక్ష్యమైతే, గత విదేశీ పర్యటనల ఫలితాలను ప్రభుత్వం ప్రజల ముందుంచాలి. దావోస్ వంటి అంతర్జాతీయ వేదికల్లో భారీ పెట్టుబడుల ప్రకటనలు, ఎంవోయూలు కుదుర్చుకోవడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. కానీ వాటిలో ఎన్ని వాస్తవ పెట్టుబడులుగా మారాయి? ఎన్ని పరిశ్రమలు క్షేత్రస్థాయిలో ఏర్పడ్డాయి? ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు ఉండా లి. ఎంవోయూ కుదరడం విజయానికి మొదటి అడుగు మాత్రమే. అది పరిశ్రమగా, పెట్టుబడిగా, ఉద్యోగంగా మారినప్పుడే ప్రభుత్వ పర్యటనకు నిజమైన ఫలితం వచ్చినట్టు భావించాలి.
రేవంత్‌రెడ్డి లండన్ పర్యటన కూడా ఇదే కోణంలో పరిశీలించాల్సిన అంశం. ఆక్స్ఫర్డ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలతో తెలంగాణకు విద్య, పరిశోధన భాగస్వామ్యాలు ఏర్పడాలని కోరుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. విదేశీ విశ్వవిద్యాలయాలు రాష్ర్టానికి రావడం, అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఏర్పాటు కావడం విద్యార్థులకు ఉపయోగకరమని తెలిపింది.
అయితే అదే సమయంలో తెలంగాణలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పరిస్థితిని కూడా ప్రభుత్వం సమీక్షించాలి. అధ్యాపకుల ఖాళీలు, పరిశోధన నిధులు, ప్రయోగశాలలు, హాస్టళ్లు, మౌలిక వసతులు వంటి సమస్యలపై విద్యార్థులు ఆందోళన చెందుతుంటే, ముందుగా మన విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రకటించిన నిధుల పరిస్థితి ఏమిటి? జిల్లాల్లోని విశ్వవిద్యాలయాలకు అవసరమైన నిధులు ఎందుకు అందడం లేదు? ఉన్నత విద్యా రంగంలో అధ్యాపకుల నియామకాలు, పరిశోధనలకు ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తున్నది? అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా విదేశీ విశ్వవిద్యాలయాలను ఆహ్వానించడం మాత్రమే విద్యా సంస్కరణగా భావించలేం. విదేశీ సంస్థలు రావాలి, అదే సమయంలో తెలంగాణ విద్యాసంస్థలను కూడా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలి.
ఈ వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అమెరికా పర్యటన కూడా ప్రస్తావనకు వస్తున్నది. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు కొన్ని రోజుల ముందు ఉప ముఖ్యమంత్రి దాదాపు రెండు వారాలు అమెరికాలో పర్యటించారు. రాష్ర్టానికి పెట్టుబడులు తీసుకురావడం, పారిశ్రామికవేత్తలను కలువడం ప్రభుత్వ లక్ష్యమైతే, ఆ పర్యటనలోనే తెలంగాణ రైజింగ్ కోసం పెట్టుబడులను ఎందుకు సమీకరించలేదనే ప్రశ్న తలెత్తుతున్నది. ఇద్దరు ముఖ్య నాయకుల పర్యటనల మధ్య సమన్వయం ఎందుకు లేదు? ఎవరి బాధ్యత ఏమిటి? ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. దీనిని వ్యక్తిగత ప్రతిష్ట సమస్యగా కాకుండా పరిపాలనా సమన్వయ సమస్యగా చూడాలి.
రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనల విషయంలో ప్రచారానికి, ఫలితానికి మధ్య తేడా ఉన్నది. పర్యటనకు ముందు భారీ పెట్టుబడుల ప్రకటనలు రావడం కంటే, పర్యటన తర్వాత వాటి అమలుపై ప్రజలకు నివేదిక ఇవ్వడం ముఖ్యం. సంస్థ పేరు, పెట్టుబడి మొత్తం, స్థాపించే ప్రదేశం, అమలు దశ, ఉద్యోగాల సంఖ్య వంటి వివరాలను ప్రభుత్వం ప్రజలకు అందించాలి. అప్పుడే తెలంగాణ రైజింగ్ ఎంతవరకు వాస్తవమో తెలుస్తుంది. రాష్ట్ర కాంగ్రెస్‌లోని అంతర్గత అసంతృప్తి నెలకొన్నది. మంత్రులు-ఎమ్మెల్యేల మధ్య మాట ల యుద్ధం ముదురుతున్నది. ప్రభుత్వ సమన్వయంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రభుత్వం లో సమన్వయం, సహకారం బలహీనంగా ఉన్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి విదేశీ పర్యటన వ్యవహారం ఆ విమర్శలకు మరింత బలం చేకూర్చింది.
మొత్తానికి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడం కేవలం రాజకీయ వివాదం కాదు. పాలనా ప్రణాళిక, పారదర్శకత, పెట్టుబడుల ఫలితాలు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు అనే నాలుగు కోణాల్లో చూడాల్సిన అంశం. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన పర్యటన ప్రణాళికలోనే లోపాలున్నాయా? అనే ప్రశ్నకు పూర్తి సమాధానం, రాష్ట్ర ప్రభుత్వమే వెల్లడించాలి.
మరోవైపు కేంద్ర ప్రభుత్వ వర్గాల విశ్వసనీయ సమాచారం జాతీయ మీడియా పలు కథనాలు ఇస్తున్నది. రేవంత్ పర్యటన షెడ్యూల్లో న్యూయార్క్ మేయర్ జోరాన్ మమ్దానీతో భేటీ ఉన్నట్టు తెలుస్తున్నది. ఆయన గతంలో పీఎం మోదీకి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే రేవంత్‌రెడ్డి పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించినట్టు కథనాలు వస్తున్నాయి. అయితే, విదేశీ పర్యటనల అసలు విలువ విమాన ప్రయాణాల్లోనూ, భారీ ప్రచారంలోనూ ఉండదు. పెట్టుబడులు పరిశ్రమలుగా మారడం, పరిశ్రమలు ఉద్యోగాలు సృష్టించడం, విద్యా ఒప్పందాలు విద్యార్థులకు ప్రయోజనం కలిగించడం, సాంకేతిక భాగస్వామ్యాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి.
మంత్రులు-ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం ముదురుతున్నది. ప్రభుత్వ సమన్వయంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రభుత్వంలో సమన్వయం, సహకారం బలహీనంగా ఉన్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి విదేశీ పర్యటన వ్యవహారం ఆ విమర్శలకు మరింత బలం చేకూర్చింది.
– (వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
సీహెచ్‌వీ ప్రభాకర్‌రావు 939153339