బుద్ధోదయం
ఈడీ , సీబీఐ దాడుల ద్వారా విపక్షాలను చీల్చి కేంద్రంలో తమ బలాన్ని పెంచుకున్న బీజేపీ ఇప్పుడు యువత ఉద్యమానికి వణికిపోతున్నది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాన మంత్రి, వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు తమ ఉపన్యాసాల్లో ప్రధానంగా యువత, విద్యారంగం గురించి ప్రస్తావించారు. ఇదంతా జెన్-జీ ఉద్యమ ప్రభావం అని తెలుస్తున్నది. జెన్-జీ ఢిల్లీ జంతర్ మంతర్‌లో జరిపిన ఉద్యమం దేశ రాజకీయాలపై తీవ్రమైన ప్రభావం చూపింది. విద్యార్థులు అడుగుతున్నది తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు. టీచర్లను నియమించాలని, కూలిపోతున్న పాఠశాల భవనాలను బాగు చేయాలనే డిమాండ్లతో ఉత్తరాదిలో అనేక రాష్ర్టాల్లో బడి పిల్లలు కూడా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో 240 సీట్లు మాత్రమే సాధించిన బీజేపీ, మిత్రపక్షాల మద్దతుతో అధికారంలో కొనసాగుతున్నది. సర్వ వ్యవస్థలను ఉపయోగించుకొని బలం పెంచుకోవాలని చూస్తూ నియంతృత్వం చెలాయిస్తున్నది. ఈ తరుణంలో యువతరం ఉద్యమం పుణ్యమా అని ఉత్తరాదిలో పాఠశాలలు ఎంత దయనీయంగా ఉన్నాయో దేశానికి తెలిసి వచ్చింది. అక్కడి పాఠశాలల వీడియోలు యూట్యూబ్‌లో కనిపిస్తున్నాయి. తాగి పాఠశాలలోనే పడిపోయిన టీచర్, అధ్వానంగా ఉన్న తరగతి గదులు, టాయిలెట్స్, కూలిపోతున్న గదులు ఇవన్నీ అందరూ చూసే అవకాశం లభించింది. ఓ పాఠశాలలో తరగతి గదిలోనే స్కూల్ సిబ్బంది మందు పార్టీ చేసుకుంటుంటే అక్కడికి వెళ్లిన యూట్యూబర్ ‘ఇదేంటి?’ అని అడిగితే ‘మా స్కూల్ మా ఇష్టం’ అని సమాధానం చెప్పడం ఓ వీడియోలో కనిపిస్తున్నది.
బడిపిల్లల ఉద్యమానికి ప్రభుత్వం ఎంతగా వణికి పోతున్నదో చెప్పడానికి రాజస్థాన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోనే సాక్ష్యం. కాక్రోచ్ జనతా పార్టీ స్కూల్ ఠీక్ కరో ఉద్యమాన్ని ప్రకటించగానే ఈ జీవో జారీ చేసింది. ప్రధానోపాధ్యాయుడి అనుమతి లేకుండా పాఠశాలలోకి ప్రవేశించి తరగతి గదులు, టాయిలెట్స్ వీడియోలు తీయవద్దు, పిల్లలతో మాట్లాడకూడదు అని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. కేసులు పెట్టినా, దాడులు చేసినా పాఠశాలలు బాగుచేసుకొనే ఉద్యమం, పాఠశాలల సందర్శన ఆగదని కాక్రోచ్ జనాత పార్టీ తేల్చిచెప్పింది. ఎవరి ఆదేశాలను పట్టించుకోబోమని, పాఠశాలలకు వెళ్లి, అక్కడి పరిస్థితిని రికార్డ్ చేస్తూనే ఉంటామని, కేసులు పెడితే పెట్టుకోవాలని సవాల్ చేసింది.
‘మహాత్మాగాంధీ పేరును తుడిచివేయాలి’ అంటూ బీజేపీ అభిమానులు వాట్సాప్ ఉద్య మం ద్వారా ఎన్నో ఏండ్ల నుంచి ప్రయత్నిస్తుంటే చివరకు బడి పిల్లలు కూడా గాంధేయ మార్గం లో ఉద్యమించడం బీజేపీ పాలకులకు నిద్ర లేకుండా చేస్తున్నది. ‘పాఠశాలల అధ్వానస్థితిని వీడియోలో రికార్డ్ చేస్తే జాతీయ భద్రతకు ముప్పు’ అని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది.
గతంలో ఉద్యమాలు అంటే ఒకే చోట పెద్ద ఎత్తున నిరసనకారులు చేరి ఆందోళనకు దిగేవారు. లాఠీఛార్జ్‌తో ఇలాంటి ఆందోళనను పాలకులు అణచి వేస్తారేమో! కానీ ప్రతీ గ్రామంలో, పాఠశాలలో జరిగే ఆందోళనను ఏం చేయగలరు? బడి పిల్లలు అందరూ రోడ్డు మీద బైఠాయించడంతో ఓ పోలీసు అధికారి వారిని బెదిరించినట్టుగా తరగతి గదిలోకి వెళ్తే ఏం జరుగుతుంది? మీరు చదువుకున్నారు, పోలీస్ అయ్యారు, మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు, మరి మాకు చదువు వద్దా? టీచర్లు లేకుండా ఎలా చదువుకోవాలి? అని ఓ విద్యార్థిని ప్రశ్నించేసరికి ఆ పోలీసు అధికారి మౌనంగా ఉండి పోయారు. కాక్రోచ్ జనతా పార్టీ తమ ఉద్యమం నేషన్ వైడ్ సోషల్ ఆడిట్ అని చెప్తున్నది. ప్రభుత్వ పాఠశాలలు ఎలా పని చేస్తున్నాయో ప్రజలు తనిఖీ చేస్తే తప్పేంది? ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవాలి? ఈ ఆందోళన తర్వాత మధ్యప్రదేశ్‌లో కొన్ని పాఠశాలల్లో ఫ్యాన్లు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించారు. బెంగాల్ బంకరాలో కాక్రోచ్ జనతా పార్టీ వాలంటీర్ ఒక పాత పాఠశాల దుస్థితిపై వీడియో తీసిన తర్వాత ఘర్షణలో వాలంటీర్ తండ్రి మరణించాడు. ఇది హత్య అని ఆరోపణ, విచారణ జరుగుతున్నది.
అధికారిక లెక్కల ప్రకారమే దేశవ్యాప్తంగా లక్ష పాఠశాలల్లో సరైన టాయిలెట్లు లేవు, 1.19 లక్షల పాఠశాలలకు విద్యుత్తు సౌకర్యం లేదు అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కలే చెప్తున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు దీప్కే సొంత గ్రామం మహారాష్ట్రలోని హింగోలి పాఠశాలలో కనీస సౌకర్యాలు లేని విషయాన్ని ఆ పార్టీ తెలిపింది. స్వాతంత్య్ర దినోత్సవ ఉపన్యాసాల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రధాన మంత్రి, పలువురు ముఖ్యమంత్రులు తమ ప్రసంగాల్లో యువత , విద్యార్థుల సమస్యలను ప్రధానంగా ప్రస్తావించారు. అంటే సమస్య తీవ్రత పాలకులకు అర్థమయ్యే ఉంటుంది. అన్ని సమస్యలకు వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారమే సమాధానం అని ఇంతకాలం బీజేపీ భావిస్తూ వచ్చింది.
గాంధీజీ వల్లనే దేశ విభజన జరిగింది అని, నెహ్రూ ముస్లిం అని చిత్ర విచిత్రమైన అబద్ధాలను వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా బీజేపీ ఐటీ సెల్ ద్వారా ప్రచారం చేసేవారు. ‘నిజం, అబద్ధం ఏదైనా కావొచ్చు, మేం క్షణాల్లో జనంలోకి పంపగలం’ అని ఐటీ సెల్ గురించి అమిత్ షా గర్వంగా చెప్పారు. జెన్-జీ ఉద్యమం బీజేపీ ఐటీ సెల్‌ను చావుదెబ్బ తీసింది. జెన్-జీ ముందు వాట్సాప్ యూనివర్సిటీ వెలవెలబోయింది. చివరికి బీజేపీ ఐటీ చీఫ్ అమిత్ మాల్వేను ఆ పదవి నుంచి తొలగించారు. వాట్సాప్ యూనివర్సిటీ సిలబస్‌కే అలవాటుపడిన వాళ్లు జెన్-జీ , జెన్-ఆల్ఫా ముందు నిలువలేకపోయారు. బీజేపీ ఐటీ సెల్ అబద్ధాలను ఎంతకాలం అని నమ్మిస్తుంది? యువత, బడి పిల్లల గాంధేయవాద ఉద్యమం ముందు నిలువలేకపోతున్నారు. బలవంతమైన సర్పం చలి చీమల చేత చిక్కి చావదె సమతీ అని అన్నట్టుగా యువత, బడి పిల్లలు నియంతల మెడలు వంచుతున్నారు. దేశానికి మంచి రోజులు వస్తున్నట్టే అనిపిస్తున్నది.
బుద్దా మురళి