కేంద్రంలో, వివిధ రాష్ర్టాల్లో హిందుత్వ శక్తులు అధికారంలోకి వచ్చినప్పుడల్లా చరిత్రను వక్రీకరిస్తూ, మెదళ్లను విద్వేష భావాలతో నింపివేస్తున్నాయి. పాఠ్యపుస్తకాలను మార్చడం, సెన్సార్ బోర్డును నియంత్రించి భారతీయతకు మసిపూసి మారేడుకాయ చేసేలా విచ్ఛిన్నకర, అశాస్త్రీయ ధోరణులను రెచ్చగొట్టేలా సినిమాలను నిర్మిస్తూ వాటికి ప్రచారం కల్పిస్తున్నాయి.
తెలంగాణలో సామరస్యతను దెబ్బతీసేందుకు, మహత్తర లక్ష్యాలతో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కప్పిపెడుతూ ‘రజాకార్’ సినిమా తీశారు. రజాకార్లు నిజాం సంస్థానంలో దొరల భూస్వాములకు అండగా ఉన్న ప్రైవేట్ సైన్యం. దీనికి నిజాం రాజు పరోక్ష మద్దతు ఉంది. రజాకార్ ఉపసేనానిగా విస్నూరు దేశముఖ్ రాపాక రామచంద్రారెడ్డి, అధిపతిగా ఖాసిం రజ్వీ ఉన్నారు. ఈ సినిమాలో మత మార్పిడులు, బ్రాహ్మణ హత్యలు, తెలుగు మాట్లాడితే హత్య లు చేసే బృందంగా చిత్రీకరించారు. హిందూ ముస్లిం సంఘర్షణగా చిత్రీకరిస్తూ పటేల్ రక్షకుడిగా ఉండే థీమ్‌తో సాగిందీ సినిమా. బీజేపీ నేతలు నిర్మించి, వారే ప్రమోట్ చేసిన సినిమా ఇది. నిజాం సంస్థానంలో ఏడో తరగతి వరకు తెలుగు రెండవ భాషగా ఉన్నది. ఉర్దూని ప్రధాన భాషగా చేశారు. తాము ఆ సంస్థాన పోరాటాన్ని తమ కండ్లతో చూసినట్టుగా చెప్తూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. విస్నూరు దేశముఖ్‌పై భూమి కేసు గెలిచి అవమానించడం తట్టుకోలేక బందగి అనే ముస్లిం యువకుడిని రజాకార్లు హత్య చేశారు. సినిమాలో దీనిని చూపించలేదు.
సంస్థాన ఆగడాలను ఇమ్రోజ్ పత్రిక ద్వారా తెలియజేస్తున్న షోయబుల్లాఖాన్ హత్యను చూపించింది. మతాలకు అతీతంగా వెట్టిచాకిరి, శ్రమదోపిడి, విద్యావ్యాప్తి మొదలగు అంశాలపై ఆయన తన కలాన్ని ఉపయోగించిన వైనాన్ని చూపించలేదు. సంస్థానంలో ట్రేడ్ యూనియన్ ఉద్యమాన్ని నిర్మిస్తూ, కార్మికులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్న పెట్టుబడిదారుల ప్రైవేట్ సైన్యం రజాకార్లను దునుమాడిన మఖ్దూం మొహియుద్దీన్ పాత్ర లేదు. ఆల్ హైద్రాబాద్ స్టూడెంట్స్ సంఘ స్థాపకులు ఆలం, జువాద్ రజ్వీ,
షాహిద్‌ల ప్రస్తావన లేదు.
దాశరథి సోదరులు నిజాం రాచరిక, భూస్వామ్య రజాకార్ వ్యతిరేక పోరాటంలో ప్రత్యక్ష భాగస్వాములు. జైలు జీవితాన్ని గడిపినవాళ్లు. ఆ పోరాటాన్ని తమ సాహిత్యం ద్వారా నమోదు చేసిన వాళ్లు. 1940వ దశకంలో తెలంగాణలో పెల్లుబికిన విప్లవ దావానలం నిజాం దొరల పాలనను కూల్చింది. మూడువేల గ్రామాల్లో గ్రామ రాజ్య కమిటీలు పది లక్షల ఎకరాల భూములను పంచి పెట్టాయి. ఇది భారత చరిత్రలో శిఖరస్థాయి ఉద్యమం. దీనిని అందుకునే ఉద్యమం గతంలో లేదు. ఈ ఘనత కమ్యూనిస్ట్ పార్టీదే. మట్టి మనుషులతో పాటు ఆ పోరాటాన్ని నడిపించిన సేనాని రావి నారాయణ రెడ్డిదే.
భూస్వామ్య కుటుంబంలో పుట్టి తన భూమిని ప్రజలకు ధారాదత్తం చేసిన మానవీయ నేత రావి నారాయణరెడ్డి ప్రస్తావన ఒక్కసారి కూడా సినిమాలో లేదు. ఆంధ్ర మహాసభను కమ్యూనిస్ట్ పార్టీగా మార్చి భూస్వామ్య దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా పోరాడే సంస్థగా మార్చాడు రావి నారాయణరెడ్డి. మఖ్దూం, ఎల్లారెడ్డిలతో కలిసి సాయుధపోరాటానికి పిలుపునిచ్చాడు. రావి లేకుండా తెలంగాణ చరిత్ర లేదు. మొదటి సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణలో అత్యధిక స్థానాలను కమ్యూనిస్ట్ పార్టీ గెలుచుకున్నది. సంస్థాన ప్రాతిపదికన కాకుండా తెలంగాణకు పరిమితమైతే రావి నారాయణరెడ్డి మొదటి ముఖ్యమంత్రి అయ్యేవారు.
ఇంటిని పోరాట కేంద్రంగా మలిచిన చాకలి ఐలమ్మ భూ పోరాటాన్ని చూపించి దానికి సహకరించి నడిపించిన కమ్యూనిస్ట్ పార్టీని ఉద్దేశపూర్వకంగా ఈ సినిమాలో చూపెట్టలేదు. భీంరెడ్డి నర్సింహారెడ్డి ప్రస్తావన.. ఐలమ్మ, బైరాన్‌పల్లి సంఘటనలలో రక్షకుడిగా, ఆయుధాలను పంపించిన వ్యక్తిగా ప్రస్తావించారు. ఎర్రజండాలను చేతబట్టి వేలమందితో జైత్రయాత్ర చేస్తూ దొరల నుంచి గ్రామాలను విముక్తి చేసిన భీంరెడ్డి చిత్రణ లేదు. రజాకార్ల క్యాంపులపై దాడులు చేసి వారి ఆయుధాలను లాక్కొని ప్రజలతో దళాలు నిర్మించిన విప్లవసింహం నల్లా నర్సింహ కనిపిస్తాడని.. దొడ్డి కొమురయ్య సహా వందమంది వీరులను ఇచ్చిన కడవెండి ప్రజలు భావించారు. గుర్రాలపై స్వారీ చేస్తూ మల్లు స్వరాజ్యం కనిపిస్తుందని ప్రజలు భావించారు. కానీ, ఇవేమీ సినిమాలో లేవు.
నిజాం రాజు.. రజాకార్లు, పటేల్‌తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని రైతాంగ దళాలను వీలైనంతవరకు అణచివేసే ప్రయత్నం చేశాడు. నాలుగు వేలమందికి పైగా ప్రజలను చంపాడు. అయినా పురోగమిస్తున్న సాయుధ పోరాటంతో చేతులెత్తేసిన నిజాం రాజు ఆహ్వానం మేరకు 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీసు చర్యను కొనసాగించారు. భారత సైన్యం నిజాం పోలీసులు, రజాకార్ల జోలికి వెళ్లలేదు. రాచరిక భూస్వామ్య వ్యవస్థపై పోరాడుతున్న ప్రజలను, కమ్యూనిస్ట్ దళాలను అణచివేయడానికి మాత్రమే పనిచేశాయి. అత్యంత క్రూరమైన దాడులకు పాల్పడిన ఖాసిం రజ్వీకి నామమాత్ర శిక్ష వేశారు. నిజాంను రాజ ప్రముఖ్ చేశారు. ఇవేమీ చిత్రంలో చోటు చేసుకోలేదు.
ఆకలి, అసమానతలు, పేదరికం లేని దేశంగా మార్చే బదులు ప్రతిపక్ష రహిత, గాంధీరహిత దేశంగా మార్చే దిశగా పాలకులు కొనసాగుతున్నారు. బహమనీ రాజ్యం నుంచి అసఫ్‌జాహీ కాలం వరకు కొనసాగిన మత, సామరస్య, సహజీవనాన్ని వక్రీకరిస్తూ ప్రచారం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ గత చరిత్ర, సాంస్కృతిక వారసత్వం హేతుబద్ధమైన దృక్పథంతో నిత్యం ప్రచారంలో ఉండే బాధ్యతను తెలంగాణలోని పాలక ప్రతిపక్షాలు తీసుకోవాలి.
ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టు రాజకీయంగా, ఆర్థికంగా నష్టపోతే కోలుకోవచ్చు కానీ, చరిత్ర, సంస్కృతి, అవి అందించిన వారసత్వాన్ని మర్చిపోతే మాత్రం జాతి కోలుకోలేదు. ఈ శూన్యాన్ని మతోన్మాదులు ఉపయోగించుకొని కట్టుకథలతో తమ వశం చేసుకుంటారు. ఈ శక్తులను నిర్వీర్యం చేసే బాధ్యతలో దేశానికి మార్గదర్శిగా నిలబడటమే మన ముందున్న కర్తవ్యం.
(వ్యాసకర్త: వ్యవస్థాపకులు దొడ్డి కొమురయ్య ఫౌండేషన్)
ఆస్నాల శ్రీనివాస్
96522 75560