సాంకేతిక విప్లవం సాయంతో తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధిస్తున్నది. అనేక రాయితీలు కల్పిస్తూ భారీ ఎలక్ట్రానిక్ పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షిస్తున్నది. ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్స్ విధానాన్ని, ఎనర్జీ స్టోరేజ్ విధానాన్ని రూపొందించి అంకుర పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నది. యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నది. ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని పెంచి కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నది.
పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో సాంకేతికత విప్లవాల ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై ప్రపంచ దేశాలు ముందడుగు వేస్తున్నాయి. అమెరికా , కెనడా, ఐరోపా దేశాలు గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ విధి విధానాలను రూపొందించి అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కూడా 2016లో ఎలక్ట్రానిక్స్ విధానాన్ని రూపొందించింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగా ఇటీవల ఫార్ములా ఈ రేస్‌ను నిర్వహించింది.సాంకేతిక విప్లవం 5.0 లో భాగంగా ప్రపంచ దేశాలు ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ విధానాలను అనుసరిస్తున్నాయి. వాహనాలకే పరిమితం కాకుండా రాకెట్ల తయారీ, విమానాల తయారీ , షిప్ బిల్డింగ్‌లో ఎలక్ట్రానిక్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఇంతటి పాధాన్యత , మార్కెట్ డిమాండ్ ఉండటం వల్ల ఈ రంగంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వాహనాల తయారే కాకుండా వాటికి సంబంధించిన బ్యాటరీ, పరిశోధన కేంద్రాలను కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేసింది.
సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా కంపెనీలు అన్ని అనుమతులు పొందే విధంగా విధానాన్ని రూపొందించారు. రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీలో 100 శాతం మినహాయింపు , 5 సంవత్సరాల వరకు 100 శాతం ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు ఇస్తున్నారు. భూమి కొనుగోలులో 25 శాతం రాయితీ ఇస్తున్నారు. సెమీ కండక్టర్స్, ఎల్ఈడీ, ఐఓటీ రంగాల పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 21 రోజుల్లోనే అనుమతులను ఇస్తున్నది. దీనివల్ల రాష్ట్రంలో ఈ పరిశ్రమలు పెట్టుబడులు పెడుతుండటంతో చాలా మంది యువతకు ఉపాధి లభిస్తున్నది.
ఎలక్ట్రికల్ వాహనాల తయారీలో బ్యాటరీ, స్టోరేజీ విభాగాలు ముఖ్యమైనవి. నేటికీ మన దేశం బ్యాటరీలో ఉపయోగించే లిథియం ఖనిజాన్ని దిగుమతి చేసుకుంటున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఎనర్జీ స్టోరేజ్ విధానాన్ని తీసుకువచ్చింది. బ్యాటరీ పరిశమల ఏర్పాటును ప్రోత్సహి స్తూ, అంకుర పరిశమలను అభివృద్ధి చేస్తున్నది. క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ ద్వారా పరిశోధనలను ప్రోత్సహిస్తున్నది. రాష్ట్రం లో బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీని దాదాపు 10 GW వరకు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నది. 2016 నుంచి 2020 వరకు ఎలక్ట్రానిక్ రంగంలో రాష్ర్టానికి 50 వేల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చాయి. అథెర్ , బిలిటీ , ఓలా ఎలెక్ట్రికల్స్, మెంజా మోటార్స్, అమర్ రాజా తదితర కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. 2025 నాటికి ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల ద్వారా రూ.3 లక్షల కోట్ల ఎగుమతులు చేసే విధంగా ప్రభుత్వం విధానాలను అమలు చేస్తున్నది.
రాష్ట్రంలో రవాణా రంగంలో ఎలక్ట్రికల్ వాహనాలకు ఊతమిచ్చే విధంగా 100 బస్సులను నడపడానికి ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. ఎలక్ట్రికల్ ద్వి చక్ర వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నది. కొత్త ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలులో రాయితీలను అందిస్తున్నది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర పభు త్వం దేశంలో ఎక్కడా లేని వి ధంగా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ రంగాల్లో దూసుకుపోతున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం మరింత సహకారం అందించాల్సి ఉంది. ఇది జరిగితే సాంకేతిక విప్లవం 6.0కి దోహదమవుతుంది.
-కన్నోజు శ్రీహర్ష
89851 30032