ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యంగా తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్ )గా ఏర్పడి ‘తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు’ అనే నినాదంతో ఉద్యమించినం. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రెస్‌క్లబ్‌లతో పాటు, స్వతంత్ర జర్నలిస్టు వేదికలు, విద్యార్థి సంఘాలు, వృత్తి సంఘాలు ఇలా ఎన్నో వేదికల ద్వారా నాటి పాలకుల దౌర్జన్యకాండను నిరసించాం. తద్వారా పోలీసుల లాఠీదెబ్బలతో ఒళ్ళు హూనమైనా ఎత్తిన పిడికిలి దించలేదు. జర్నలిస్టు నాయకుడు అల్లం నారాయణ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమ శక్తులను ఏకం చేయడంలో, తెలంగాణ ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చి ఉద్యమాన్ని ఉరకలెత్తించడంలో జర్నలిస్టులు పోషించిన పాత్ర అజరామరం.
క్షేత్రస్థాయిలో ఉద్యమశక్తులను సమన్వయం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పా టు తప్పదనే సంకేతాలను కేంద్రానికి ఇవ్వడంలో రాజీలేని పోరాటం చేసినం. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించే దాకా తెలంగాణ జర్నలిస్టులమైన మనం ఉద్యమ భావజాలంతో జనాన్ని జాగృతం చేసినం. తెలంగాణ కోసం జర్నలిస్టుల కలాలు కవాతు చేసినయ్. సత్సంకల్పం కోసం తెలంగాణ జర్నలిస్టులు ఎంతదాకైనా కొట్లాడుతరనే విషయాన్ని ఉద్యమ సమయంలో ప్రపంచానికి ఎలుగెత్తి చాటినం.
రెండు దశాబ్దాల అవిశ్రాంత పోరాటం ద్వారా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నం. ఏ పార్టీ ప్రభుత్వమైనా సరే ప్రజలు ఎన్నుకున్న తొలి తెలంగాణ ప్రభుత్వానికి కనీసం పదేండ్లు బేషరతుగా మద్దతుగా నిలువాలని టీజేఎఫ్ నిర్ణయం తీసుకున్నది. ప్రజల ఆకాంక్షలను ఉద్యమ నినాదాలను సాకారం చేసుకునే దిశగా నాడు ఉద్యమాన్ని సమన్వయం చేసుకున్నట్టుగానే ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకుసాగాలనే దార్శనిక తను టీజేఎఫ్ ప్రదర్శించింది. ‘సాధించుకున్నం.. తెలంగాణను ఇక పునర్నిర్మించుకుందాం..’ అనే సిద్ధాంత ప్రాతిపదికన ముందుకుసాగింది. స్వరాష్ట్రంలో సాగే పునర్నిర్మాణంలో తెలంగాణ జర్నలిస్టుల కుంటుంబాలు కూడా భాగమయ్యాయి. తమ హక్కులనూ కాపాడుకుంటూ తెలంగాణ జర్నలిస్టుల వృత్తి భద్రత, కుటుంబ సంక్షేమం కోసం ‘తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్’ సంఘాన్ని స్థాపించింది.
రాష్ట్రంలో జరిగిన మొదటి ఎన్నికల్లో ప్రజలు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గా ఉద్యమ నాయకుడు కేసీఆర్‌కే అవకాశం కల్పించారు. రాష్ట్ర అవసరాలు, ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా అమలుచేసిన పథకాలు, కార్యక్రమాల ఫలితంగా రాష్ట్ర ప్రజలు స్వరాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందుకోగలుగుతున్నారు. సుమారు తొమ్మిదేండ్ల కాలంలో తెలంగాణ దేశానికి ఓ ప్రగతి నమూనాగా నిలిచింది. యావత్ భారతావనికి రోల్ మాడల్‌గా నిలవడం వెనుక కేసీఆర్ పాత్ర ఎనలేనిది. దేశంలో మరే రాష్ట్రం సాధించని అద్భు త ఫలితాలు సాధిస్తున్న తెలంగాణ రాష్ర్టాన్ని రాజకీయాలకతీతంగా అభినందించాలి. తెలంగాణ నిలదొక్కుకునేదాకా మొదటి తెలంగాణ ప్రభుత్వానికి బేషరతు మద్దతుగా నిలువాలనే ‘తెలంగాణ జర్నలిస్టుల యూనియన్’ దార్శనికత గొప్పది, ఆకాంక్షలు నిజమైనందుకు అటు తెలంగాణ జర్నలిస్టులకు, ఇటు తెలంగాణ పౌరులకు గర్వకారణం.
ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) మహాసభల కేంద్రంగా తెలంగాణ జర్నలిస్టులుగా భావి భారత భవిష్యత్తు కోసం మన వంతు పాత్ర పోషించాల్సి ఉన్నది. సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా భారత్ వర్ధిల్లేందుకు, రాష్ర్టాల సమాఖ్యగా పరిఢవిల్లేందుకు తెలంగాణ జర్నలిస్టులు తమ ఉద్యమస్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం మరోసారి ఏర్పడింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మరింత గుణాత్మకం గా నెరవేరాలంటే మనం భాగస్వాములమై మన దేశ అభ్యున్నతి కోసం పాటుపడాల్సిందే. దేశం బాగుంటేనే రాష్ర్టాలు బాగుంటాయి. రాష్ర్టాలు బాగుంటేనే మన పల్లెలు బాగుంటాయి. మత మౌఢ్యం, అధికార దాహం, అవినీతి, అక్రమాలతో భ్రష్టు పట్టిపోతున్న ఈ దేశ వ్యవస్థలను తిరిగి పునరుద్ధరించేందుకు, అభివృద్ధి ఫలాలు దేశంలోని ప్రతీ వర్గానికి చేరేలా, స్వేచ్ఛా శాం తియుత వాతావరణంలో ప్రజలు జీవించేలా, భారతదేశం పురోగామి పథంలో పయనించేందుకు కావాల్సిన శక్తియుక్తులను సమకూర్చుకునే కార్యాచరణను అమలుచేయడమే లక్ష్యం గా మనం పనిచేయాలి.
ప్రజా ఆకాంక్షలను కాపాడటమే పరమావధిగా నాడు ‘తెలంగాణ జర్నలిస్టు ఫోరం’తో ముందుకుసాగిన మనం నేడు ‘ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్’ వేదికగా ముందుకుసాగాలి. జర్నలిస్టులుగా మన వృత్తిని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూనే మన హక్కుల ను మనం కాపాడుకుందాం. సామాజిక బాధ్యత కలిగిన బుద్ధిజీవులుగా, దేశ సౌభాగ్యం కోసం, ప్రజాస్వామిక విలువల పరిరక్షణ కోసం మన కర్తవ్యాన్ని మనం
కొనసాగించాలి.
కేంద్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యంతో జర్నలిజం తన ఉనికి కోల్పోతున్నది. ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ప్రభావంతో ప్రింట్ మీడియా జర్నలిస్టులకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఓ సమగ్ర చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలను కలిపి ఓ సమగ్ర చట్టాన్ని తెస్తామని హామీ ఇచ్చిన కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి, ఆ కలను సాకారం చేసుకున్న వ్యక్తులుగా తెలంగాణ జర్నలిస్టులకు జాతీయస్థాయిలో ఉన్న గుర్తింపును కూడా ఉపయోగించుకొని జర్నలిస్టులుగా మన హక్కులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
(వ్యాసకర్త:ఆస్కాని మారుతిసాగర్, 90107 56666, టీయూ డబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి)