ముందుచూపు లేని పాలన
శాస్త్రీయ ప్రణాళికలు, ముందస్తు దార్శనికత లేని అధికార పీఠాలు తీసుకొనే ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం కోట్లాది మంది ప్రజల నోటికాడ కూడును లాగేస్తున్నది. దశాబ్దాల పోరాటాల తర్వాత స్వయంపాలనలో సగర్వంగా తలెత్తుకున్న తెలంగాణ వ్యవసాయ రంగానికి నేడు మళ్లీ అలాంటి తీవ్రమైన గ్రహణమే పట్టుకున్నది. వర్షాకాలంలో వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావం చూపిస్తున్నదనే అంచనాలను సాకుగా చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ‘వరి సాగు చేయవద్దు’ అంటూపరోక్షంగా జారీ చేస్తున్న ఆంక్షలు, ఉచిత సలహాలు సంచలనం సృష్టిస్తున్నాయి.
శాస్త్రీయ ప్రణాళికలు, ముందస్తు దార్శనికత లేని అధికార పీఠాలు తీసుకొనే ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం కోట్లాది మంది ప్రజల నోటికాడ కూడును లాగేస్తున్నది. దశాబ్దాల పోరాటాల తర్వాత స్వయంపాలనలో సగర్వంగా తలెత్తుకున్న తెలంగాణ వ్యవసాయ రంగానికి నేడు మళ్లీ అలాంటి తీవ్రమైన గ్రహణమే పట్టుకున్నది. వర్షాకాలంలో వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావం చూపిస్తున్నదనే అంచనాలను సాకుగా చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ‘వరి సాగు చేయవద్దు’ అంటూపరోక్షంగా జారీ చేస్తున్న ఆంక్షలు, ఉచిత సలహాలు సంచలనం సృష్టిస్తున్నాయి. వర్షాలు తక్కువగా పడతాయనో, లేదా ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు తగ్గుతాయనో భయపడి రైతులకు ‘క్రాప్ హాలిడే’ (పంటల విరామం) ప్రకటించమనే సలహాలు ఇవ్వడం బాధ్యత గల ప్రభుత్వం చేయాల్సిన పనికాదు.
ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి, విపత్తు నిర్వహణ ద్వారా రైతాంగానికి ధైర్యాన్ని నూరిపోయాల్సిందిపోయి అసలు పంటలే వేయవద్దని శాసించడం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో..ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డెల్టా ప్రాంతాలు, తెలంగాణ పల్లెలు ‘క్రాప్ హాలిడే’ కన్నీళ్లను చూశాయి. నేడు మళ్లీ అదే పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వేళ, సరిగ్గా అవే దుస్థితులు, ఆనాటి చీకటి రోజులే తెలంగాణ మట్టిపై పునరావృతం అవుతుండటం తీవ్రంగా ఖండించాల్సిన అంశం. తెలంగాణ నేలలో వరి కేవలం ఒక పంట మాత్రమే కాదు; అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక, రైతు జీవన విధానం, నిరుపేద కూలీల ఉపాధికి మూలాధారం. కృష్ణా, గోదావరి నదుల పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులు, చెరువులు, కాలువలతో పాటు భూగర్భజల వనరులు, విద్యుత్తు కనెక్షన్లపై ఆధారపడి కోట్లాది ఎకరాల్లో రైతులు ధాన్యాన్ని పండిస్తున్నారు.
ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పలు పథకాల అమలుతో 2023-24లో 168.75 లక్షల మెట్రిక్ టన్నుల వరిని ఉత్పత్తి చేసి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాలను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించింది. 2022-23 కాలానికి రెండోస్థానంలో ఉన్న రాష్ట్రం, 2023-24లో రికార్డు స్థాయి దిగుబడితో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నది. ఇది కేసీఆర్ సాధించిన ఘనత. దేశవ్యాప్తంగా మొత్తం వరి ఉత్పత్తిలో తెలంగాణ వాటా దాదాపు 12.5% కావడం విశేషం. ఇటువంటి అపారమైన దిగుబడులు సాధిస్తున్న గడ్డపై, ఒక్క కాలం పాటు వరి పంట వేయవద్దని ప్రభుత్వం స్పష్టం చేస్తే, దాని ప్రభావం కేవలం తెలంగాణపైనే కాదు, మొత్తం దేశ ఆహార భద్రతపై ప్రతికూలంగా పడుతుంది. వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో ముప్పు ఆకస్మికంగా ఊడిపడినవి కావు.
వాతావరణ శాఖలు, అంతర్జాతీయ సంస్థలు నెలల ముందే దీనిపై ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తాయి. మరి ప్రభుత్వం ఏం చేసింది? గోదావరి నది పక్కనే పుష్కలంగా నీటి ప్రవాహాలు ఉన్నప్పటికీ సమయానికి ఎత్తిపోయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ముఖ్యంగా కాళేశ్వరం నెట్‌వర్క్‌లోని కన్నెపల్లి (మేడిగడ్డ) పంపింగ్ స్టేషన్‌తోపాటు అన్నారం, మేడారం బరాజ్‌ల వద్ద పంపులను నడపకపోవడం సర్కార్ చేసిన పెద్ద తప్పు.
అదేవిధంగా దేవాదుల ఎత్తిపోతల పథకం, మిడ్ మానేరు, లోయర్ మానేరు జలాశయాలను పూర్తిస్థాయిలో నింపలేకపోయారు. వీటితోపాటు నీటిని నిల్వ చేసే అతిపెద్ద జలాశయాలైన మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్‌కు పంపింగ్ చేయకుండా ఖాళీగా ఉంచారు. ఎగువన ఉమ్మడి ఆయకట్టుకు లబ్ధి చేకూర్చే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కూడా పునరుజ్జీవ పథకం ద్వారా నీటిని తోడటంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించి ఈ ప్రభుత్వం పాపం మూట కట్టుకున్నది.
వేసవి రాకముందే జలాశయాలు ఎండిపోవడానికి, సాగునీరు అందక చేలు ఎండిపోవడానికి కాంగ్రెస్ పాలకుల అనాలోచిత నిర్ణయాలే కారణం. ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల నేడు కరెంట్ కోతలు, సాగునీటి కొరత, తాగునీటి ఎండమావులు ఎదురవుతున్నాయి. విపత్తు నిర్వహణలో ప్రభుత్వాలకు నైపుణ్యం ఉండాలి. కానీ, సంక్షోభాన్ని పరిష్కరించే దిశగా అడుగులు వేయాల్సిందిపోయి, నేరుగా ‘వరి వేయకండి’ అని ఆర్డర్లు జారీ చేయడం పాలకుల చేతకానితనానికి నిదర్శనం. రాష్ట్రంలో ఒకవేళ వరి సాగును నిలిపివేస్తే..అది కేవలం వ్యవసాయ రంగానికే కాకుండా సమస్త సమాజంపై తీవ్ర ప్రభావం చూపే గొలుసుకట్టు విపత్తుకు దారితీస్తుంది. ప్రాథమికంగా వరి సాగు బంద్ అయితే రాష్ట్రంలో ఆహార ధాన్యాల కొరత తీవ్రంగా ఏర్పడుతుంది. దీని ఫలితంగా ద్రవ్యోల్బణం అమాంతం పెరిగి, బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు అడ్డూ అదుపు లేకుండా ఆకాశాన్నంటే అవకాశం ఉన్నది.
వరి సాగును నమ్ముకొని జీవించే లక్షలాది మంది వ్యవసాయ కూలీలకు ఉపాధి పూర్తిగా కోల్పోయే దుస్థితి వస్తుంది. పనిలేక గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు జీవనోపాధి కోసం పెద్ద ఎత్తున వలసలు పెరగడంతో పాటు, పేదల బతుకులు ఆకలిచావుల అంచుకు చేరుకుంటాయి. పంటలు పండక రైతులకు సరైన గిట్టుబాటు రాకపోవడం వల్ల వారు తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోతారు. రైతుల చేతిలో డబ్బులు లేకపోవడంతో గ్రామీణ కొనుగోలు శక్తి పూర్తిగా క్షీణించి, స్థానిక వ్యాపారాలు, మిల్లులు, రవాణా రంగాలు మూతపడి సమగ్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థే కుప్పకూలే ప్రమాదం ముంచుకొస్తుంది.
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, నిషేధాలు విధించడం మానుకొని, తక్షణమే ప్రత్యామ్నాయ ప్రణాళికలను యుద్ధప్రాతిపదికన అమలుచేయాలి. వరికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి పంటలు పండించాలో సూచించి వాటిని వేసేలా రైతులను ప్రోత్సహించాలి. ప్రత్యామ్నాయ పంటలకు మారే రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను 100% సబ్సిడీతో అందుబాటులోకి తీసుకురావాలి. రైతులు పండించే ప్రత్యామ్నాయ పంటలకు కనీస మద్దతు ధరతో ప్రభుత్వమే స్వయంగా కొనుగోలు చేస్తుందని ముందే చట్టబద్ధమైన గ్యారెంటీ ఇవ్వాలి. వరి సాగు నిలిచిపోవడం వల్ల ఉపాధి కోల్పోయే వ్యవసాయ కూలీల కోసం ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ కింద పని దినాలను 100 రోజుల నుంచి 200 రోజులకు పెంచాలి.
ప్రభుత్వ ఆంక్షల వల్ల సాగు చేయలేకపోయే రైతులకు ఎకరాకు సరిపడా నష్టపరిహారాన్ని భృతి రూపంలో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయాలి. కార్మికుడు స్వేదం చిందిస్తేనే యంత్రం తిరుగుతుంది. రైతు నాగలి పడితేనే దేశానికి ఆకలి తీరుతుంది. ఏ సమాజమైనా అన్నదాతను నిర్లక్ష్యం చేసి మనుగడ సాగించలేదు. ఎల్ నినో అనేది ఒక ప్రకృతి ప్రక్రియ మాత్రమే. సాంకేతిక పరిజ్ఞానం అపారంగా పెరిగిన నేటి ఆధునిక కాలంలో, సరైన నీటి యాజమాన్య పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలతో కరువును జయించవచ్చు. తెలంగాణను మళ్లీ పాతకాలపు కరువు కోరల్లోకి, ‘క్రాప్ హాలిడే’ చీకట్లలోకి నెట్టవద్దు. ప్రభుత్వం తక్షణమే మేల్కొని, వరి పండించే ప్రాంతాల్లో శాస్త్రీయ నీటి యాజమాన్యాన్ని అమలు చేయాలి. ప్రత్యామ్నాయ పంటలకు పూర్తిస్థాయి భరోసా ఇచ్చి, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులను ఆదుకోవాలి. అలాకాకుండా, అనాలోచిత నిర్ణయాలతో వారి జీవితాలతో చెలగాటమాడితే…కాలం, తెలంగాణ రైతాంగం పాలకులను క్షమించవు.
(వ్యాసకర్త: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే)
పీ సబితా ఇంద్రారెడ్డి
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

