‘ఎవరెంతో వారికంత’ అన్నది అత్యంత ప్రజాస్వామికమైన డిమాండ్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సందర్భంలోనూ భవిష్యత్తు గురించిన చర్చలు జరిగాయి. 50 శాతానికి పైగా బీసీలు మన రాష్ట్రంలో ఉన్నారు. సహజంగానే వీరికి అన్ని రంగాల్లో మంచి వాటా దక్కుతుందని, దక్కి తీరుతుందని అంతా భావించారు. నాటి ఉద్యమ నాయకత్వం కూడా అదే ధోరణితో ఉన్నది. బీసీలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అటు కోకాపేటలోను, ఇటు ఉప్పల్ భగాయత్‌లోనూ అనేక కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలకు స్థలాలు ఇచ్చి, కొన్ని కులాల వారికి నిధులు సైతం కేటాయించారు. బీసీలు తలెత్తుకుని జీవించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం పట్ల అప్పట్లో బీసీ కుల సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
బీసీలు ఎంతమంది ఉన్నారు? వారిలో ఎవరికెంత వాటా దక్కుతున్నది? ఏ ప్రాతిపదికన ఈ కేటాయింపులు జరుగుతున్నాయి? ఇవన్నీ ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. బీసీలు అనగానే రెండు మూడు సామాజిక వర్గాల వారి పేర్లనే అందరూ చెప్తున్నారు. 130కి పైగా బీసీ కుల సమూహాలున్నాయి. పార్టీల సీట్ల కేటాయింపు, నామినేటెడ్ పోస్టుల కేటాయింపులు, విద్య, ఉద్యోగ, ఉపాధి వంటి అంశాల్లో ఆ రెండుమూడు సామాజిక వర్గాలే వారే కన్పిస్తున్నారు. వారి గొంతే వినిపిస్తున్నది. మరి మిగిలిన బీసీ కులాల పరిస్థితి ఏమిటి?
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణనపై విమర్శలు వెల్లువెత్తడంతోప్రతిపక్షాలు, బీసీ సంఘాల ఒత్తిడికి తలొగ్గి రీ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డెడికేటెడ్ కమిషన్ నిక్కచ్చిగా సర్వే చేస్తే ఎవరి జనాభా ఎంత ఉందో స్పష్టంగా తేలిపోతుంది. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అమలులో అది ఎంతవరకు సాధ్యమవుతుందోనని బీసీ కులాలు ఆందోళనలో ఉన్నాయి. కులగణన విషయంలో ప్రభుత్వం కచ్చితమైన వివరాలను వెల్లడించడంతోపాటు ఆయా కులాలకు జనాభా ప్రాతిపదికన తగిన ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
కొన్ని బీసీ కులాల ప్రజలు తమ సంఖ్య విషయంలో ఇన్నాళ్లు చెప్పుకుంటూ వచ్చిన లెక్కలకు, ప్రస్తుత లెక్కలకు మధ్య ఎంతో తేడా కనిపిస్తున్నది. ఇదే ఇలా ఉంటే, మరి ఎవరూ పెద్దగా పట్టించుకోని కులాల సంఖ్య సంగతేంటి? వారి గురించి ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదు? జనాభా తక్కువగా ఉన్న వారిని పట్టించుకోరా?
వీరిని ఓటర్లుగా మాత్రమే చూసే ధోరణి చాలా రాజకీయ పార్టీల్లో కనిపిస్తున్నది. అందుకే పదవుల పంపకాల సందర్భంలో కూడా కొందరికే ఆ ఫలాలు దక్కుతున్నాయి. రాష్ర్టానికి అప్పుడు, ఇప్పుడు కూడా చెరువులే ప్రధాన ఆధారం. కాకతీయులు, ఆ తర్వాత వచ్చిన గోల్కొండ నవాబులు, వీళ్ల తర్వాత వచ్చిన నిజాం నవాబులు. వారి వారి కాలాల్లో తెలంగాణను బతికించినవి చెరువులే. అంతెందుకు, ఉమ్మడి రాష్ట్రపు నిర్లక్ష్యపు నీడలో తెలంగాణను కాపాడుకున్నవి కూడా చెరువులే. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ సారథ్యంలో ఏర్పాటైన ప్రభుత్వం కూడా చెరువులకే తొలి ప్రాధాన్యం ఇచ్చింది. ఆ చెరువుల నిర్మాతలైన సగరుల (ఉప్పరుల) గురించి ఇప్పటికీ చాలామందికి తెలియదు. ఇందుకు ప్రధాన కారణం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వారు వెనుకబడి ఉండటమే.
ఎంతో ఘన చరిత్ర కలిగిన షట్ చక్రవర్తులలో సగర చక్రవర్తి వారసుడైన భగీరథుని వంశస్థులుగా గుర్తింపు పొందిన సగరులు మొదటగా ఉప్పు తయారీదారులుగా, చెరువులు, ప్రాజెక్టులు నిర్మించే వారిగా, ఆ చెరువుల నీటిని విడుదల చేసే నీరటికారులుగా, ప్రస్తుతం నిర్మాణ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న వారిగా ముందుకు సాగుతున్నారు. అలాంటి ఉప్పరుల గురించి పాలకులు నామమాత్రంగా మాత్రమే ప్రస్తావిస్తున్నారు. జీవజాలానికి ఆధారం అవుతున్న ఇలాంటి కులాల గురించి ఆలోచించాల్సిన అవసరం రాజకీయ పార్టీలకు ఉన్నది. వీళ్లే కాదు ఇంకా బీసీల్లో అత్యంత దుర్భర జీవితాలు వెళ్లదీస్తున్న వారు ఎందరో ఉన్నారు. వారంతా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జీవనాడులుగా ఉన్నవారే. కొన్ని బీసీ కులాల వారు భిక్షాటన చేసుకుంటున్నారు. మరికొన్ని సామాజిక వర్గాల వారు అయితే కేవలం ఓటర్లు గానే మిగిలిపోయారు. రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి వంటి రంగాల్లో వారికి రావాల్సిన వాటా రావడం లేదు.
నేటి కమ్యూనికేషన్ ప్రపంచంలో వృత్తులు పోయాయి. ఉపాధులు పోయాయి. కొత్త తరహా వ్యవస్థలు వచ్చాయి. ఆర్థిక వనరులు మారిపోయాయి. వాటిని అందుకున్న వారు నిలబడుతున్నారు. అందుకోలేని వారు ఎటు పోయారో, పోతున్నారో ఎవరి వద్దా లెక్కలు ఉండటం లేదు.
అందువల్ల బీసీల్లో అత్యంత వెనక్కు నెట్టేయబడుతున్న వారు తమ బలాన్ని ప్రత్యక్షంగా ఈ పాలకులకు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇందుకుగాను వారు ఏకం కావాల్సిన అవసరం, అనివార్యత ఉన్నది. ఎప్పుడైతే ఐక్యతను చాటుతారో వారి గురించి ఆలోచించే అవసరం ఈ పాలకులకు అనివార్యమవుతుంది.
ఈ క్రమంలోనే సగరులు ఒక అడుగు ముందుకు వేసి జనగర్జన ద్వారా శంఖారావం పూరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 16న ‘సగర శంఖారావం’ పేరుతో వేలాదిమందితో నాగర్‌కర్నూలులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచబోతున్నారు. ఇంకెన్నాళ్లీ నిర్లక్ష్యం అంటూ నినదించబోతున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు తమ కులానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలనేది ఈ బహిరంగ సభ ముఖ్య ఉద్దేశం. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే రెండు లక్షల మంది వరకు సగరులున్నారు. తెలంగాణవ్యాప్తంగా 5 నుంచి 7 లక్షల వరకు వీరి జనాభా ఉంటుంది.
ఇక నుంచి అన్ని రంగాల్లో తమకు రావాల్సిన వాటా ఇచ్చి తీరాల్సిందేననే డిమాండ్‌ను అన్ని పార్టీల ముందు పెట్టబోతున్నారు. తమతో పాటు కలిసివచ్చే వారిని కలుపుకొని ‘ఎవరెంతో వారికంత’ అనే సహజ న్యాయ సూత్రాన్ని అమలు చేసుకోవాలని అత్యంత వెనుకబడిన బీసీ సమాజాన్ని సగరులు కోరుతున్నారు. సగరుల శంఖారావం సభ నిర్వహిస్తున్న సందర్భంగా విస్మరణకు గురైన బీసీలు చైతన్యమై తమ హక్కులు సాధించుకోవాలని సూచిస్తూ తెలంగాణ రాష్ట్ర సగర సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న సగరుల శంఖారావం సభకు యావత్ తెలంగాణ సమా జం మద్దతునివ్వాలని కోరుతున్నారు. సగరులు భారీ సంఖ్యలో సభకు హాజరై తమ ఆకాంక్షలను వ్యక్తీకరించి అనేక కులాలకు మార్గ నిర్దేశకులుగా మారి బీసీ సమాజాన్ని మరింత చైతన్య పరచాలి.
ఎంతో ఘన చరిత్ర కలిగిన షట్ చక్రవర్తులలో సగర చక్రవర్తి వారసుడైన భగీరథుని వంశస్థులుగా గుర్తింపు పొందిన సగరులు మొదటగా ఉప్పు తయారీదారులుగా, చెరువులు, ప్రాజెక్టులు నిర్మించే వారిగా, ఆ చెరువుల నీటిని విడుదల చేసే నీరటికారులుగా, ప్రస్తుతం నిర్మాణ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న వారిగా ముందుకు సాగుతున్నారు. అలాంటి ఉప్పరుల గురించి పాలకులు నామమాత్రంగా మాత్రమే ప్రస్తావిస్తున్నారు.