నేటి విద్యార్థులే రేపటి పౌరులు. మన దేశ భవిష్యత్తును నిర్ణయించేది, నిర్మించేది కూడా విద్యార్థి తరమే. విద్యార్థిదశలో కష్టపడి చదివిన వ్యక్తి, యవ్వన దశలో ఉద్యోగం సంపాదించడం ద్వారా తన కొనుగోలుశక్తితో పరోక్షంగా దేశ ఆర్థికాభివృద్ధికి, ప్రత్యక్షంగా తన కుటుంబ అభివృద్ధికి దోహదపడతాడు. నవీన సమ సమాజ స్థాపనకు సైతం విద్యార్థి దశ చాలా కీలకమైనది. అందుకే దేశ నిర్మాణానికి ప్రతివ్యక్తి విద్యార్థి దశ పునాది వంటిది. కానీ బాధపడాల్సిన విషయమేమిటంటే, కొంతమంది విద్యార్థి దశలోనే తమ నూరేండ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు.
కష్టపడి చదివి ఉన్నత విద్యలో సీటు పొం దిన విద్యార్థినీ విద్యార్థులు మానసిక ఒత్తి డి, క్షణికావేశాలకు లోనై తమ విలువైన ప్రాణాలను తీసుకుంటున్నారు. ఫలితంగా తమపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తీవ్ర శోకం మిగులుస్తున్నారు. ఇటీవల రాష్టంలోని వరంగల్, బాసరలలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ ఒక్కొక్క విద్యార్థిది ఒక్కో సమస్య. కుటుంబ సమస్యలు, పరీక్షల్లో ఫెయిల్, తల్లిదండ్రుల మందలింపు, తోటివారి అవహేళన, సీనియర్ల ఒత్తిడి, ప్రేమ వ్యవహారాలు ఇలా అనేక సమస్యలు. ఇలాంటి చిన్న చిన్న సమస్యలకే చాలామంది విద్యార్థులు తమ విలువైన జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు.
కొన్ని సర్వేల ప్రకారం.. మనదేశంలో సగటున ప్రతి 55 నిమిషాలకు ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. సాధారణ విద్యార్థులే కాకుండా, ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదివే విద్యార్థులు సైతం మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14 నుంచి ఏప్రిల్ 21 మధ్యకాలంలో మద్రాస్ ఐఐటీలో సుమారు 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2018 నుంచి 2023 మార్చి మధ్యకాలంలో ఐఐటీ, ఐఐఎం నీట్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన సుమారు 61 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని స్వయానా కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు.నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం 2018 నుంచి ఏటా సుమారు పది వేల మంది విదార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2021లో మనదేశంలో 1,64,033 ఆత్మహత్య లు జరిగితే అందులో సుమారు 13,089 మంది విద్యార్థులే ఉన్నారు.
కష్టపడి చదివి, ఉద్యోగం సంపాదించి ఎన్నో ఆశలతో నూతన జీవితంలోకి అడుగుపెట్టిన యువత సైతం ఆత్మహత్యలు చేసుకుంటున్నది. దీనికి కారణం ఉద్యోగ ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, ఎదుటివారిని అర్థం చేసుకోలేకపోవడం, మానసిక సమస్యలు, జీవితంలో అసంతృప్తి, తప్పుడు మార్గాలను ఎంచుకోవడం.. ఇలా అనేక సమస్యలు ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. తమ మేధస్సుతో దేశ నిర్మాణానికి ఉపయోగపడాల్సిన యువత ఇలా అర్ధాంతరంగా అసువులు బాయడం శోచనీయం. విద్యార్థిలోకం ఇలా తమ జీవితాలను ముగించడం వెనుక వివిధ కారణాలతో పాటు ప్రస్తుత పోటీ చదువులు కూడా కారణమవుతున్నాయి.
డిగ్రీలు, ఉద్యోగ కల్పన మాత్రమే ప్రస్తుత విద్యావిధానంలో కీలకమైన అంశాలు. విద్యార్థి ‘కాంపిటేటివ్’ అంశాలపై మాత్రమే దృష్టి పెడుతున్నారే గానీ ‘క్వాలిటేటివ్’ అంశాలను పట్టించుకోవడం లేదు. నూతన కోర్సుల రూపకల్పన, ఉద్యోగ కల్పన వంటి అంశాలపైనే దృష్టి పెట్టి విద్యార్థుల సామాజిక దృక్పథం, సత్ప్రవర్తన, మానసిక పరిపక్వత, క్వాలిటీ లైఫ్‌ల బోధన అవసరాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు.
జీవితానికి అవసరమైన స్కిల్స్‌ను విద్యార్థి అందిపుచ్చుకునేలా ‘కరికులం’ను రూపొందించాలి. ముఖ్యంగా నేటితరం విద్యార్థులు తమను తాము అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. ఒత్తిడిని అధిగమించడంతోపాటు ఇతరుల మనస్తత్వాల ను అర్థ్ధం చేసుకోవడం, వివిధ పరిస్థితులను పాజిటివ్ దృక్పథం’తో చూడటం, సైన్స్ ఆఫ్ హ్యాపినెస్ వంటి వాటిపై బోధన చాలా అవసరం. అందుకనే పాఠశాల స్థాయిలో, ఉన్నత విద్య స్థాయిలో (డిగ్రీ) ‘సైకాలజీ (మనస్తత్వ శాస్త్రం)’ బోధన తప్పనిసరి చేయాలి.
‘మనస్తత్వ శాస్త్రం’ అనేది మానవుల్లో మనసు, ప్రవర్తనల శాస్త్రీయ అధ్యయనం. దీనిలో భావా లు, ఆలోచనలతో సహా చేతన, అపస్మారక దృగ్విషయాల అధ్యయనం ఉంటుంది. ఇది సహజ, సాంఘిక శాస్ర్తాల సరిహద్దులను దాటి అపారమైన పరిధిని కలిగి ఉండే ఒక శాస్త్ర విజ్ఞానం. మనస్తత్వ శాస్త్రం ద్వారా వ్యక్తుల భావోద్వేగాల ను, మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు మనిషి తమలో కలి గే భావోద్వేగాలను ఎలా అధిగమించవచ్చు, తమ వ్యక్తిత్వాన్ని ఎలా మా ర్చుకోవచ్చు అనేది ఈ శాస్త్త్రం తెలియజేస్తుంది. అందుకే పాఠశాల స్థాయి లో నే సైకాలజీని బోధించాలి.
ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి ఈ విషయం పై దృష్టిపెట్టాలి. గణితం, సా మాన్య, సాంఘిక శాస్ర్తాలతో పాటు 8వ తరగతి నుంచి మనస్తత్వ శాస్ర్తాన్ని ప్రవేశపెట్టాలి. పాఠశాల స్థాయిలో ఇప్పటికే కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ సైకాలజీని బోధిస్తున్నాయి. అంతేకా దు డిగ్రీ చదివే విద్యార్థులకు సైతం మొదటి సంవత్సరం నుంచే సైకాలజీ బోధన తప్పనిసరిగా ప్రవేశపెట్టాలి. ఈ విషయంలో నిపుణుల సలహాలను తీసుకోవాలని యూజీసీ, ఏఐసీటీఈ సైతం ఆలోచిస్తున్నాయి. నేటి యువత తమ దైనందిన జీవితంలో ఎక్కువ భా గం సెల్‌ఫోన్‌తోనే గడుపుతున్నది. తద్వారా ప్రత్యక్ష సమాజంతో వారు మమేకం కాలేకపోతున్నారు.
అందుకే, వివిధ వ్యక్తుల, పరిస్థితుల ప్రవర్తనను అర్థం చేసుకోలేక డిప్రెషన్‌కు గురవుతున్నారు. శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ ప్రవర్తనలను విద్యార్థి దశ నుంచే పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి. తద్వా రా మానసిక దృఢత్వం పెరిగి తన, ఇతరుల ప్రవర్తనపై అవగాహన పెరుగుతుంది.. క్షణికావేశ నిర్ణయాలపై నియంత్రణ ఏర్పరచుకొని ఆత్మహత్య అనే ఆలోచనను అదుపులో పెట్టుకోగలరు. అందు కే, సైకాలజీ బోధన నేటి తరానికి తప్పనిసరి.
(వ్యాసకర్త: కేరళ సెంట్రల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్)
డాక్టర్ ,రామకృష్ణ బండారు 79057 51940