ఏ ఎండకా గొడుగు పట్టడంలో సిద్ధహస్తుడనని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ (ఆర్కే) మరోసారి రుజువు చేసుకున్నారు. చేతిలో ఒక పత్రిక, టీవీ చానెల్ ఉండటంతో తననొక రాజ్యాంగేతర శక్తిగా భావించుకుంటూ.. తన వర్గానికి అనుకూలమైన పరిణామాలైతే ఒకలాగా, గిట్టనివారి విషయంలో చాలా తేడాగా వండి వార్చడం ఆర్కేకు పరిపాటిగా మారింది. తన పత్రిక, టీవీ చానెళ్ళలో ప్రతీ వారం రాసే కొ(చె)త్తపలుకును నిశితంగా గమనిస్తే ఆర్కే అసలు స్వరూపం ఇట్టే బట్టబయలవుతుంది. తాజాగా హైదరాబాదు హెచ్.సి.యూలో 400 ఎకరాల భూ వివాదానికి సంబంధించిన కేసులో తెలంగాణ సీఎస్ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
Vemuri Radhakrishna | గచ్చిబౌలి భూముల విషయంలో తమ ఆదేశాలను బేఖాతరు చేస్తే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ పరిణామంతో రేవంత్ సర్కార్ పూర్తిగా ఆత్మరక్షణలో పడింది. సుప్రీం తీర్పుతో తదుపరి ఏమి చేయాలో అర్థం గాక సీఎం రేవంత్ అయోమయంలో పడ్డారు. సుప్రీం న్యాయమూర్తులు విచారణలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఎలా ఫీలయ్యారో తెలియదు కానీ, సీఎంకు స్వయంప్రకటిత రాజగురువుగా ఫీలయ్యే ఆంధ్రజ్యోతి ఆర్కే మాత్రం బాగా హర్ట్ అయ్యారు. ఎంతగా అంటే.. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై బహిరంగంగా అక్కసు వెళ్లగక్కేటంతగా. ఆర్కేను న్యాయమూర్తుల కామెంట్స్ అంతగా డిస్టర్బ్ చేసినట్లున్నాయి. ఈ వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఆదివారం నాటి (ఏప్రిల్ 06, 2025) ఆర్కే కొత్తపలుకులో చేసిన వ్యాఖ్యలు ఆయనలోని నిస్పృహకు పరాకాష్టగా కనిపిస్తున్నాయి.
‘కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చట్టాలను మాత్రమే సమీక్షించాలా? లేదా వ్యక్తిగత అభిప్రాయాలను కూడా జోడించవచ్చా? అన్నదానిపై కూడా న్యాయ నిపుణులలో కొంతకాలంగా చర్చ జరుగుతోంది. కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలు తుది తీర్పు లేదా ఆదేశాలలో భాగం కావడం లేదు. అయినప్పటికీ, మీడియాలో వాటికి విశేష ప్రచారం లభిస్తుండటంతో సామాన్య ప్రజానీకం ప్రభావితం అవుతున్నారు. సదరు వ్యాఖ్యలను తీర్పులలో భాగంగానే చూస్తున్నారు. ఈ పరిణామం న్యాయ వ్యవస్థ విశిష్టతకు నష్టం చేస్తుందన్న అభిప్రాయం బలంగా ఉంది’ ఇవీ తాజాగా ఆర్కే తన కాలామ్లో పలికిన చెత్త పలుకులు.
ఈ సందర్భంగా ఇదే ఆర్కే తన ఆంధ్రజ్యోతి పత్రికలోనూ, ఏబీఎన్ ఛానల్లోనూ గతంలో జగన్ ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలపై పెద్దపెద్ద హెడ్డింగులు పెట్టి, వార్తలు రాసిన విషయాన్ని ఒకసారి గుర్తుచేసుకోవాలి. అమరావతి నుంచి రాజధానిని మార్చాలనుకోవడం మతిలేని చర్య అంటూ గతంలో హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను ఆంధ్రజ్యోతి బాగా హైలైట్ చేసింది.
ఈ ఒక్క కేసులోనే కాకుండా పలు సందర్భాలలో జగన్ ప్రభుత్వాన్ని తప్పుబడుతూ హైకోర్టు న్యాయమూర్తులు చేసిన కామెంట్స్‌ను ఉటంకిస్తూ, ఆంధ్రజ్యోతిలో 3 మొట్టికాయలు, 6 తలంట్లు అనే హెడ్డింగ్ పెట్టి.. పెద్ద కథనాన్ని రాయించి రాధాకృష్ణ తెగ సంబరపడి పోయారు. ఆ రోజు ఆర్కేకు న్యాయమూర్తుల కామెంట్స్ భగవద్గీతలా వినిపించాయి. ఇప్పుడు రేవంత్ సర్కారును తప్పుబడితే మాత్రం అవి అనుచిత, అసందర్భ వ్యాఖ్యలన్నమాట. ఆర్కే జర్నలిజాన్ని చూస్తే.. ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందేమో.
ఈ చెత్త పలుకులో మరో విడ్డూరమైన వాదన ఏమిటంటే.. జగన్ సీఎంగా ఉన్నప్పుడు తన నివాసం కోసం రుషికొండను తొలిచేసి, పర్యావరణ నిబంధనలను కాలరాసినపుడు సుప్రీంకోర్టు దానిపై ఓ కమిటీని నియమించి వదిలేసిందని, హెచ్.సి.యూ భూముల కేసులో మాత్రం తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఎందుకు వార్నింగ్ ఇచ్చిందో అర్థం కావడం లేదని రాధాకృష్ణ మథనపడుతున్నారు. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విచారణ సందర్భంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయాలో ఆర్కేని అడిగి, నేర్చుకోవాలన్నమాట. ఇలాగే వదిలేస్తే, రాధాకృష్ణ తన చెత్త పలుకుల ముసుగులో సుప్రీంకోర్టు తీర్పులు ఎలా ఉండాలో కూడా చెబుతారేమో. గతంలో ఓ సందర్భంలో మీడియా నియంత్రణపై హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు చేసినప్పుడు ఆంధ్రజ్యోతి కథనం ద్వారా ఆర్కే తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగంలోని ప్రతీ వ్యవస్థ తన పరిధిని, లక్ష్మణ రేఖను దాటకపోవడం శ్రేయస్కరమని ఆ కథనంలో రాధాకృష్ణ కర్తవ్యబోధ చేశారు.
మరి అదే లాజిక్ ఇప్పుడు ఆర్కేకి కూడా వర్తిస్తుంది కదా! అయినా గతంలో జడ్జీలు ఎందుకు ఇలాంటి ఆదేశాలిచ్చారు.. ఇప్పుడు వారి ఉత్తర్వులు మరోలా ఎందుకు ఉన్నాయంటూ న్యాయ వ్యవస్థను ప్రశ్నించే అధికారం ఆర్కేకు ఎవరిచ్చారు? కింది కోర్టు నుంచి పైకోర్టుకు అప్పీలుకు వెళ్ళినప్పుడు గానీ, జడ్జిలు మరే కారణం వల్లగానీ సందర్భాన్ని బట్టి న్యాయమూర్తుల ఉత్తర్వులలో మార్పు ఉండవచ్చు. అంతమాత్రం చేత తనకు అనుకూలమైన రేవంత్ రెడ్డి వంటి వ్యక్తులకు ప్రతికూలమైన ఆదేశాలిస్తే.. వెంటనే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నిబద్ధతపై అనుమానాలు సృష్టించే రీతిలో రాధాకృష్ణ చెత్తపలుకులు’ వండి వార్చడం ఏమిటి? ఇది ఆయనకు అలవాటైనట్టు కనిపిస్తున్నది.
(కొ)చెత్త పలుకులో రాసిన ఓ లైన్లో ‘తా ను చేస్తే శృంగారం… ఎదుటివారు చేస్తే వ్యభిచారం అనేవిధంగా తెలంగాణలో ప్రతిపక్షాల వైఖరి ఉంద’ని ఆర్కే తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. తాజాగా రాధాకృష్ణ విశ్లేషణను చదివితే, ఆయన రాస్తున్న తీరు శృంగారమా లేక రేవంత్ సర్కారు తప్పు చేస్తున్నా, అడ్డగోలుగా సమర్థించడాన్ని వ్యభిచారం కింద పరిగణించాలో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఆర్కేదే.
-డీఆర్సీ రావు