భారతదేశం అనేక భాషల సమాహారం. ప్రతి మట్టిలో ఒక మాట, ప్రతి ఊరిలో ఒక స్వరం. ఈ భాషా వైవిధ్యాన్ని ఒకే విద్యావిధానంలో కూర్చోబెట్టాలని చేసిన ప్రయత్నమే త్రిభాషా విధానం. కానీ ఈ విధానం నిజంగా భాషలకు వంతెనగా మారనుందా? లేక అడ్డంకిగా నిలుస్తుందా? అనే ప్రశ్న ఇప్పుడు ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నది. సీబీఎస్ఈ 6వ తరగతి నుంచే తప్పనిసరి త్రిభాషా విధానాన్ని ఇటీవలే ప్రవేశపెట్టింది. ఈ విధానం ప్రకారం విద్యార్థులు కనీసం రెండు భారతీయ భాషలను నేర్చుకోవాలి. 2031 నాటికి 10వ తరగతి వరకు ఈ విధానం పూర్తిగా అమల్లోకి వస్తుంది.
దేశంలో త్రిభాషా విధానం కేవలం విద్యావిధానం మాత్రమే కాదు, భాష, సంస్కృతి, రాజకీయాల కలయికలో ఉన్న సున్నితమైన అంశం. సెంట్రల్ బోర్డ్ త్రిభాషా వైఖరి భారతీయ భాషలకు అనుకూలమా? లేక అడ్డంకా? అనే ప్రశ్నకు ఒకే సమాధానం లభించదు. దానిని రెండువైపులా పరిశీలించాల్సిందే. త్రిభాషా విధానం అంటే సాధారణంగా మాతృభాష/ప్రాంతీయ భాష, హిందీ లేదా ఇతర భారతీయ భాష, ఇంగ్లీష్ లేదా మరో విదేశీ భాష. భాష అనేది కేవలం మాటల సమాహారం కాదు. అది మనసు, మట్టి, మనుగడ. వాటి నడుమ త్రిభాషా విధానం ఒక వంతెన కావచ్చు, కానీ అది బలవంతపు వంతెనగా మారితే, సంస్కృతుల మధ్య దూరం పెరుగుతుంది. మాతృభాషలో పుట్టిన ఆలోచనకు రెక్కలు ఉంటాయి. ఆ రెక్కలను కత్తిరించకుండా, ఇతర భాషల గాలిని అనుభవించే స్వేచ్ఛ ఇవ్వడమే నిజమైన విద్యావిధానం. త్రిభాషా విధానం ఉద్దేశం చూస్తే అది ఆకర్షణీయంగానే ఉన్నది.
విద్యార్థి తన మాతృభాషలో నేర్చుకోవాలి, మరో భారతీయ భాషను అర్థం చేసుకోవాలి, ప్రపంచంతో సంభాషించడానికి ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇది సిద్ధాంతంగా సరైన దారే. భాషల మధ్య సంభాషణ పెరగాలి, సంస్కృతులు దగ్గర కావాలి, జాతీయ ఐక్యత బలపడాలి అనే ఆశయం దీనిలో దాగి ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఆచరణలోకి వచ్చినప్పుడు మొత్తం దృశ్యమే మారిపోతుంది. మూడు భాషలు విద్యార్థి భుజాలపై బలవంతంగా మోపిన భారంలా మారుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ పాఠశాలల్లో, మౌలిక వసతులు తక్కువగా ఉన్నచోట్ల, ఇది విద్యపై ఆసక్తిని పెంచకుండా తగ్గిస్తున్నది. భాషలు నేర్చుకోవడం ఎవరికైనా ఆనందంగా ఉండాలి, కానీ అది బాధ్యతగా, పరీక్షల ఒత్తిడిగా మారితే, విద్యార్థి మనసు భారమవుతుంది.
మరొక ప్రధాన అభ్యంతరం..హిందీ ప్రాబల్యం. దక్షిణ భారతదేశంలో త్రిభాషా విధానం అనేది హిందీని తప్పనిసరి చేయడంగా అనిపిస్తున్నది. అదే సందర్భంలో ఉత్తర భారతదేశంలో దక్షిణ భాషలు నేర్చుకోవడం పట్ల అలాంటి కట్టుబాటు కనిపించదు. ఈ అసమానత భాషా న్యాయంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నది. నిజానికి భాషా విధానం ఒక ప్రాంతానికి అనుకూలంగా, మరో ప్రాంతానికి భారంగా మారకూడదు. అలాగని ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకించడం కూడా సరైంది కాదు. ఎందుకంటే భాషల మధ్య పరిచయం అవసరం. ఒక తెలుగు విద్యార్థి హిందీ లేదా మరొక భారతీయ భాష నేర్చుకోవడం వల్ల దేశవ్యాప్తంగా అవకాశాలు విస్తరిస్తాయి. అదేవిధంగా ఉత్తర భారతదేశ విద్యార్థి తెలుగు లేదా తమిళం నేర్చుకుంటే, నిజమైన సాంస్కృతిక మార్పిడి జరుగుతుంది. అందుకే సమస్య విధానంలో కాదు, అమలులోనే ఉన్నది. మాతృభాషకు నిజమైన ప్రాధాన్యం ఇవ్వకుండా, ఇతర భాషలను బలవంతంగా రుద్దడం అనేదే సమస్య.
అది ప్రాంతాల మధ్య ఆధిపత్యం పెరగడానికి దారితీస్తుంది. భాష మన ఆత్మ. ఆ ఆత్మను గౌరవించే విధానం ఏదైనా సమర్థనీయమే. గౌరవించని విధానం ఎంత మంచిదైనా, అది అడ్డంకిగానే మిగులుతుంది. త్రిభాషా విధానం ఉద్దేశం చూస్తే అది సమతుల్యమైనదే. మాతృభాషలో విద్య పునాది, దేశవ్యాప్త అనుసంధానం కోసం ఒక భారతీయ భాష, అంతర్జాతీయ అవకాశాల కోసం ఆంగ్లం ఈ మూడు కోణాలను కలిపే ప్రయత్నమే ఇది. ఈ ఆలోచనలో లోపం లేదు. కానీ అమలులోనే సమస్యలు. ముఖ్యంగా, హిందీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన ఇతర అన్ని భాషల ప్రజల్లో అసంతృప్తిని పెంచుతున్నది. తమిళనాడు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. అక్కడ భాషా ఉద్యమాలు కేవలం రాజకీయ ప్రతిస్పందనలు కావు. అవి అస్తిత్వ పోరాటాలు. భాష అంటే ‘మనం’ అనే భావనతో హిందీని బలవంతంగా రుద్దడాన్ని తమిళ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. అందుకే అక్కడ రెండు భాషల విధానం తమిళం, ఆంగ్లం స్థిరపడింది. అది ఒక ప్రతిఘటన మాత్రమే కాదు, తమిళ గౌరవానికి ప్రతీక.
మరి తెలుగు రాష్ర్టాలు ఏ దారిని ఎంచుకోవాలి? తెలుగు సమాజం చరిత్రపరంగా విస్తృతమైన భాషా అనుభవం కలిగి ఉన్నది. ఉర్దూ, ఆంగ్లం, హిందీ ఇవన్నీ మన జీవితంలో భాగమయ్యాయి. కనుక హిందీని పూర్తిగా వ్యతిరేకించడం అవసరమా? అదే సమయంలో హిందీకి ‘ప్రాధాన్యత’ అనే పేరుతో తెలుగు స్థానాన్ని తగ్గించడాన్ని కూడా అంగీకరించలేం.
హిందీ ఒక పెద్ద భాష. ఉద్యోగావకాశాలు, ఇతర రాష్ర్టాలతో సంబంధాలు.. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటే దానిని నేర్చుకోవడం ప్రయోజనకరం. కానీ అది ఐచ్ఛికం కావాలి, అనివార్యం కాదు. ప్రాధాన్యత అనే పదం, ఇతర భాషలను పక్కనబెట్టే ప్రమాదాన్ని కలిగిస్తుంది. అది సమానత్వాన్ని కాదు, ఆధిపత్యాన్ని సూచిస్తుంది. తెలుగు రాష్ర్టాల ముందు ఉన్న నిజమైన సవాల్ ఇదే. సమతుల్యతను ఎలా కాపాడాలి? మొదటగా, విద్యావ్యవస్థలో తెలుగు భాషకు అగ్రస్థానం ఉండాలి. దీంతో మాతృభాషలోనే బలమైన పునాది ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆంగ్లం ప్రపంచంతో కలిపే వేదికగా. మూడోదిగా హిందీ లేదా ఇతర భాషలు విద్యార్థి ఆసక్తి, అవసరాల మేరకు నేర్చుకునేలా ఉండాలి. ఇదే సమతుల్య దారి. అవసరమైతే, తమిళనాడు చూపించిన దారిలో గట్టిగా నిలబడాలి. అది వ్యతిరేకత కోసం కాదు, స్వాభిమానం కోసం. కానీ ప్రతి సందర్భంలో ప్రతిఘటన అవసరం లేదు. చైతన్యంతో కూడిన నిర్ణయం అవసరం. భాషను ప్రేమించడం అంటే ఇతర భాషలను ద్వేషించడం కాదు. అదే సమయంలో, మన భాష విలువను తగ్గించడాన్ని మౌనంగా చూడడం కూడా కాదు. మాతృభాషపై మమకారం, ఇతర భాషల పట్ల అవగాహన ఈ రెండూ కలిస్తే నిజమైన భారతీయ బహుభాషా ఆత్మ. తెలుగు రాష్ర్టాలు ఈ సూత్రాన్ని గౌరవిస్తే, త్రిభాషా విధానం ఒక వివాదంగా కాకుండా, ఒక అవకాశంగా మారుతుంది.
(వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత)
-వారాల ఆనంద్